
జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడినట్లు జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ చెప్పారు. శుక్రవారం జీజీహెచ్ జనరల్ సర్జరీ విభాగంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మాదారం గ్రామానికి చెందిన పాలిపోగు ప్రసాద్ (62) రెండు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. తీవ్రమైన కడుపునొప్పి, కామెర్లు, చలిజ్వరం రావడంతో ఒంగోలులో 25 రోజులు చికిత్స తర్వాత గుంటూరు జీజీహెచ్‌కు వచ్చాడు. హైడాటిడ్ సిస్ట్ వ్యాధి (కాలేయంలో నీటిబుడ్డ)తో బాధపడుతున్నట్లు నిర్ధారించామన్నారు. కుక్కల వల్ల, కలుషిత నీటిని తాగడం వల్ల వ్యాధి వస్తుందన్నారు. కొన్నిసార్లు మాంసం పూర్తిగా ఉడకకుండా తినడం వల్ల కూడా వస్తుందని చెప్పారు. ప్రసాద్ కాలేయం, ఇతర అవయవాలకు ఇబ్బంది ఉండటంతో సర్జరీ చేశామని, దీనికి నాలుగు గంటల సమయం పట్టిందన్నారు. సుమారు 40 రోజులపాటు వార్డులో చికిత్స అందించి డిశ్చార్జి చేశామన్నారు. సుమారు రూ.10 లక్షల ఖరీదైన ఆపరేషన్‌ను ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఉచితంగా చేశామని తెలిపారు. ఆపరేషన్ ప్రక్రియలో వైద్యులు నాగ సంతోష్‌కుమార్, సాదిక్ బాషా, వేణుగోపాల్, మేఘన, అవిన్, హరి, పోలయ్య, శ్యాంసన్, శ్వేత, ప్రసాద్, హనుమంతరావు, నర్సింగ్ సిబ్బంది రాజ్యలక్ష్మి, స్రవంతి, అనిత, ఉష, నంద పాల్గొన్నట్లు వెల్లడించారు. వృద్ధుడి ప్రాణాలు కాపాడిన వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్‌ఎస్‌వీ రమణ అభినందించారు.