
రహదారి.. నత్తగా మారి
● జాతీయ రహదారి నిర్మాణంలో జాప్యం
● భూ సేకరణలో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం
● కూటమి ప్రభుత్వం అశ్రద్ధ
కడప సిటీ : జాతీయ రహదారి–440 నిర్మాణ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. కల నెరవేరుతుందన్న తరుణంలో.. పనుల్లో జాప్యం జరుగుతుండటం నిరాశ కలిగిస్తోంది. భూ సేకరణ అంతంత మాత్రమే జరగడంతో నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. రెవెన్యూ శాఖ భూ సేకరణకు సహకరించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోడ్డుకు 2023 మార్చిలో నిధులు మంజూరైనప్పటికీ ప్రధానంగా భూ సేకరణ కాకపోవడంతోనే పనులు ముందుకు సాగడం లేదు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఊపందుకున్న పనులు.. ఆ తర్వాత కుంటుపడుతూనే వస్తున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఈ రోడ్డు నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వ పెద్దలను పలుమార్లు కలిసి పట్టుదలతో కృషి చేశారు. కేంద్ర మంత్రి గడ్కరీకి అనేకమార్లు వినతిపత్రాలు సమర్పించి సమస్యను వివరించడంతో ఆయన కృషి ఫలించి రహదారి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఈ విషయంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చేసిన కృషిని ప్రజలు అభినందిస్తున్నారు. రెండు రీచ్‌లుగా అంటే చాగలమర్రి–వేంపల్లె వరకు 80 కిలోమీటర్లకు గాను రూ.660 కోట్లు, వేంపల్లె–రాయచోటి వరకు 53.9 కిలోమీటర్లకు గాను రూ.230 కోట్ల నిధులు కేటాయించారు.
ప్రజల ఇబ్బందులు తొలగేందుకే
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ రోడ్డు కార్యరూపం దాల్చుతుందన్న నేపథ్యంలో.. ఆయన ఆకస్మిక మరణంతో అటకెక్కింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఈ రోడ్డు నిర్మాణాన్ని విస్మరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కృషితో ఎట్టకేలకు ఈ రోడ్డు నిర్మాణానికి అడుగులు పడ్డాయి.
రైతులకు పరిహారం అంతంత మాత్రమే
ప్రధానంగా ఈ రోడ్డు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఇందుకు కారణం భూ సేకరణ ఆలస్యం కావడంతోనేనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూశాఖ నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంటోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినప్పటికీ.. భూ సేకరణ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సేకరించి వారికి అప్పగించాల్సి ఉంటుంది. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం వహిస్తుందంటే.. అందుకు కారణం ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వమే. రెండు రీచ్‌లకు కలిపి మొత్తం 185 హెక్టార్లు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇందులో చాగలమర్రి–వేంపల్లె రోడ్డుకు 174 హెక్టార్లకు గాను 104 హెక్టార్లు మాత్రమే జరిగింది. అలాగే వేంపల్లె–రాయచోటి రోడ్డుకు కేవలం 11 హెక్టార్ల భూసేకరణ గాను.. దాదాపు ఇక్కడ భూసేకరణ పనులు చిన్నా చితక ప్రాంతాల్లో మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది. మొత్తం భూసేకరణకు చాగలమర్రి–వేంపల్లె రోడ్డుకు రూ.300 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ. 24 కోట్లు రైతులకు అందింది. అలాగే వేంపల్లె–రాయచోటి రోడ్డుకు రూ.70 కోట్ల పరిహారానికి గాను రూ.53 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. సంబంధిత శాఖ మంత్రి పట్టించుకుని భూసేకరణపై శ్రద్ధ వహిస్తేగానీ పనులు ముందుకు సాగవు.
ముందుకు సాగని చాగలమర్రి–వేంపల్లె
ఎన్‌హెచ్ రోడ్డు పనులు
ఎన్‌హెచ్–440 పేరుతో చాగలమర్రి–వేంపల్లె వరకు 80 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఇందుకు గాను 285 హెక్టార్ల భూ సేకరణ అవసరం ఉంది. మొత్తం రూ.660 కోట్లతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. భూ సేకరణ తీవ్ర ఆలస్యం కావడంతో ఈ రోడ్డు పనులు ముందుకు సాగలేదు. ఇటీవలే ఈ రోడ్డుకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. 28 గ్రామాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. పరిహార విషయంలో రూ.14 లక్షల నుంచి గరిష్టంగా రూ. 2.50 కోట్ల వరకు హెక్టారుకు ఉంది. చాగలమర్రి నుంచి రాజుపాళెం, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మీదుగా వేంపల్లె–రాయచోటి బైపాస్ వరకు ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంది. 2024 వరకు పనుల్లో పురోగతి ఉండగా, ఆ తర్వాత జాప్యం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం శ్రద్ధ వహించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. రెండు మేజర్ బ్రిడ్జిలు, ఇంకా చిన్నా చితక వంతెనలు కూడా నిర్మించాల్సి ఉంది. త్వరలో రోడ్డు నిర్మాణం చేపట్టి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
కొనసాగుతున్న వేంపల్లె–రాయచోటి
ఎన్‌హెచ్ రోడ్డు పనులు
వేంపల్లె–రాయచోటి ఎన్‌హెచ్–440 రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. 53.9 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాల్సి ఉండగా, రూ.230 కోట్ల నిధులు కేటాయించారు. ఇప్పటి వరకు 40 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంలో మేజర్ వంతెనలు 2, మైనర్ వంతెనలు 11, కల్వర్టులు 60, పైపు కల్వర్టులు మరికొన్ని అవసరం ఉన్నాయి. ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్ ఈ పనులను ప్రారంభించింది. మరో ఆరు నెలలు గడిస్తే గానీ ఈ రోడ్డు పూర్తయ్యే అవకాశం లేదు. చక్రాయపేట వద్ద గ్రామంలో కాకుండా ఊరి వెలుపల రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. అయితే అందుకు సంబంధించిన సర్వీసు రోడ్డు గుంతలమయంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులకు విన్నవిస్తున్నారు. భూ సేకరణకు కేవలం 11 ఎకరాలు మాత్రమే అవసరం ఉండగా, రూ.70 కోట్లకు గాను రూ.53 కోట్ల పరిహారం అందించారు. మరికొంత భూ సేకరణ చేయాల్సి ఉంది. ఎల్‌ఆర్ పల్లె, నాగులగుట్టపల్లె, ఆంజనేయపురం, పాయలోపల్లె గ్రామాల వద్ద భూ సేకరణ పెండింగ్‌లో ఉంది. ఈ భూ సేకరణ పూర్తయితే ఎటువంటి ఆటంకం లేకుండా రోడ్డు పనులు కొనసాగే అవకాశం ఉంది.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కృషి ఎనలేనిది
ఈ రోడ్ల నిర్మాణానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఎంతో కృషి చేశారు. పలుమార్లు సంబంధిత కేంద్ర మంత్రి గడ్కరీకి వినతిపత్రాలు సమర్పిస్తూ సమస్యను వివరిస్తూ రావడంతో ఎట్టకేలకు ఆయన కృషి ఫలించి ఈ రోడ్డు నిర్మాణానికి అడుగులు పడ్డాయి. కడప ఎంపీ కృషి ఫలితం వల్లే నిధులు మంజూరు కావడం జరిగింది. ఆయన చేసిన కృషిని ప్రజలు అభినందిస్తున్నారు.
త్వరితగతిన పూర్తికి చర్యలు
ఎన్‌హెచ్–440 రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. భూ సేకరణ ఆలస్యం కావడం వల్ల పనులకు ఇబ్బంది కలుగుతోంది. సంబంధిత అధికారులతో భూ సేకరణ విషయంపై చర్చించి వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
– ఎస్.సుధాకర్,
ఎన్‌హెచ్ ఈఈ, కడప
త్వరగా పూర్తి చేయాలి
ఎన్‌హెచ్–440 రోడ్డు నిర్మాణ పనులను త్వరగా చేపట్టి పూర్తి చేయాలి. ఎన్నో ఏళ్లుగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాల్సి అవసరం ఉంది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు పనులు కొనసాగించాలి.
– ఎన్.శివ, యాండ్లవాండ్లపల్లె, చక్రాయపేట మండలం
దుమ్ము, ధూళితో అల్లాడుతున్నాం
వేంపల్లె–రాయచోటి నేషనల్ హైవే పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానంగా చక్రాయపేట మండల కేంద్రంలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ రోడ్డుకు సంబంధించిన వాహనాలు తిరగడం వల్ల రోడ్డు గుంతలమయంగామారింది. దుమ్ము, ధూళితో అల్లాడిపోతూ రోగాల బారిన పడుతున్నాం. ఎన్‌హెచ్ అధికారులు చొరవ తీసుకుని రోడ్డు వేయాలి.
– బి.యోగేశ్వర, నాగిరెడ్డిపల్లె, చక్రాయపేట మండలం

రహదారి.. నత్తగా మారి

రహదారి.. నత్తగా మారి

రహదారి.. నత్తగా మారి