
‘రెవెన్యూ’ మాయాజాలం
● ఒకరి భూమి మరొకరిపై ఆన్‌లైన్
● హక్కుదారుడు నిలదీయడంతో..
మళ్లీ అతని పేరుపై..
● పాసుపుస్తకం మంజూరులో జాప్యం
● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
గోపవరం : చేయి తడిపితే ఎలాంటి పనినైనా చేయగల సత్తా ఒక రెవెన్యూ శాఖలోనే ఉంది. దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ ఆ శాఖ అధికారుల తీరులో.. ఎలాంటి మార్పులేదు. ఫలితంగా భూ వివాదాలు పేట్రేగిపోతున్నాయి. ఏ శాఖలోనైనా కొంత మేరకై నా సమస్యలు పరిష్కారమవుతాయి గానీ రెవెన్యూశాఖలో మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం సాక్షాత్తు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే కలెక్టర్ల సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇందుకు నిదర్శనం సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్న తీరే. పైసలిస్తే పట్టా భూమిని కూడా మార్చివేస్తున్న రెవెన్యూ అధికారులు.. గతంలో కోట్లు విలువ పలికే డీకేటీలు సైతం ఆన్‌లైన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఓ లబ్ధిదారుడి పట్టా భూమిని కూడా నకిలీ అగ్రిమెంటుతో మరొకరి పేరుతో ఆన్‌లైన్‌లో ఎక్కించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గోపవరం రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 107/1ఎ లో మందల జయరామయ్యకు ఒక ఎకరం పట్టా భూమి ఉంది. ఈ భూమిని ఒంగోలు వెంకటరెడ్డి దగ్గర 27–05–2002లో కొనుగోలు చేశారు. బద్వేలు సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో అప్పట్లో రిజిస్టర్ కూడా అయింది. డాక్యుమెంట్ నంబర్ 557/2002.
హక్కుదారుడు ఊరిలో లేనిది చూసి..
జయరామయ్య వృత్తి రీత్యా మరొక చోట నివాసం ఉంటున్నాడు. సదరు పట్టా భూమిని శ్రీనివాసపురం గ్రామానికి చెందిన వెంకటసుబ్బమ్మ అనే మహిళ జయరామయ్య తనకు అగ్రిమెంటు రాయించినట్లుగా ఒక అగ్రిమెంటును సృష్టించింది. సదరు మహిళకు ఆన్‌లైన్ కావాలంటే రిజిస్టర్ డాకుమెంట్ తప్పనిసరి. ఎలాగైనా అగ్రిమెంటు మీద ఆన్‌లైన్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఎంత ఖర్చు అయినా భరిస్తామని చెప్పడంతో స్థానిక రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్ చేసేందుకు సిద్దపడ్డారు. ఇక పైసలిస్తే రెవెన్యూలో ఎలాంటి పనైనా జరుగుతుందనే విషయం తెలిసిందే. ఒక రేటు మాట్లాడుకుని సదరు మహిళ వద్ద ఒప్పందం కుదుర్చుకున్నారు. వెంటనే అగ్రిమెంటు మీదనే తహసీల్దారు.. వెంకటసుబ్బమ్మ పేరుతో ఆన్‌లైన్ చేశారు. ఇదే అదునుగా భావించిన వెంకటసుబ్బమ్మ ఇది మరొకరికి మారితే బలం చేకూరుతుందనే విషయం గ్రహించి.. తన కుమార్తె కలవకూరి ప్రశాంతికి గిఫ్ట్ రూపంలో 2024 జనవరి1న రిజిస్టర్ చేయించింది. డాక్యుమెంట్ నంబర్ 452/2024. ఇంతటితో తన వ్యూహం ముగిసిందనే లోపే అసలు లబ్ధిదారుడు జయరామయ్య తన భూమికి సంబంధించి ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవడం జరిగింది. ఆన్‌లైన్‌లో తన పేరుకు బదులు వెంకటసుబ్బమ్మ పేరు ఉండటంతో కంగుతిన్నాడు. ఒకరి పేరుతో ఉన్న పట్టా భూమి కూడా మరొకరి పేరుతో మారుతుందా అని సందేహపడ్డారు. హుటాహుటిన గోపవరం తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని తహసీల్దారును నిలదీశారు. అక్కడ సరైన సమాధారం రాకపోవడంతో 2024 డిసెంబర్16న బద్వేలు ఆర్డీఓకు అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీ పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారుల నుంచి తహసీల్దారుపై ఒత్తిడి పెరిగింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా తహసీల్దారు రంగంలోకి దిగి.. ఫేక్ అగ్రిమెంటుపై రిజిస్టర్ చేయించుకున్న వారిని సంప్రదించి రిజిస్టేషన్‌ను రద్దు చేయించుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చారు. వారు పలకకపోవడంతో రెవెన్యూ అధికారులే 2025 జనవరి 2వ తేదీన బద్వేలు సబ్ రిజిస్ట్రారు కార్యాలయానికి వెళ్లి.. 2024 నవంబర్ 22న ప్రశాంతి పేరు మీద జరిగిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని సబ్ రిజిస్ట్రారును కోరారు. అందుకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని చెప్పడంతో ఎట్టకేలకు రిజిస్టర్‌ను రద్దు చేశారు. రద్దు చేసిన డాక్యుమెంట్ నంబర్ 15/2025.
తిరిగి లబ్ధిదారుడి పేరు మీదికి మార్చికి..
ప్రశాంతి రిజిస్ట్రేషన్ రద్దు అయిన వెంటనే, వెంకటసుబ్బమ్మ పేరుతో ఉన్న ఆన్‌లైన్‌ను తిరిగి.. జయరామయ్య పేరు మీద మార్చారు. 2025 మార్చి7న జయరామయ్య పేరుతోనే పట్టా భూమి ఉందని స్వయంగా తహసీల్దారే ఎండార్స్‌మెంట్ ఇవ్వడం జరిగింది. ఈలోపే జయరామయ్య ఆరోగ్య పరిస్థితి బాగ లేకపోవడంతో 2025 ఫిబ్రవరి10న తన భార్య దొరసానమ్మ పేరుతో రిజిస్టర్ చేయించారు. రిజిస్టర్ డాక్యుమెంట్ నంబర్ 469/2025. రిజిస్టర్ కార్యాలయంలోనే దొరసానమ్మ పేరుతో ఆటోముటేషన్ అయింది. తన పేరు మీద పాసుపుస్తకం కావాలని డాక్యుమెంట్లతో పాటు మూడు దఫాలుగా మీసేవ చలానా కట్టడం జరిగింది. కానీ తహసీల్దారు మాత్రం ఇప్పటి వరకు పాసుపుస్తకాలు మంజూరు చేయలేదని స్థానిక రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అగ్రిమెంటు మీద ఆన్‌లైన్ చేసిన తహసీల్దారు స్వయంగా పట్టాదారుని పేరుకే పాసుపుస్తకాలు మంజూరు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారంటే ఆయన వ్యవహారశైలి ఏవిధంగా ఉందోనని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను మీసేవలో మూడు దఫాలు చలానా కట్టినా పాసుపుస్తకాలు మంజూరు కాకపోవడంతో.. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని లబ్ధిదారురాలు చెప్పిడం జరిగింది. జరిగిన పూర్తి సమాచారంపై తహసీల్దారు త్రిభువన్‌రెడ్డిని సాక్షి వివరణ కోరగా అగ్రిమెంట్ మీద ఆన్‌లైన్ చేయడం జరిగిందని, తిరిగి జరిగిన తప్పిదాన్ని సరిచేసినట్లు తెలిపారు.