తెలుగుదేశం గ్రాఫ్‌ పడిపోయింది.. ‘రాయచోటి’లో అభ్యర్థుల్లేరు | TDP graph has fallen There are no candidates in Rayachoti | Sakshi
Sakshi News home page

తెలుగుదేశం గ్రాఫ్‌ పడిపోయింది.. ‘రాయచోటి’లో అభ్యర్థుల్లేరు

Apr 14 2026 5:44 AM | Updated on Apr 14 2026 5:46 AM

TDP graph has fallen There are no candidates in Rayachoti

మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు  

టీడీపీ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎన్నికలపై చేతులెత్తేసిన మంత్రి  

ఇతర పార్టీలతో పొత్తు దెబ్బతీసిందన్న అమాత్యుడు  

సాక్షి అమరావతి: ‘టీడీపీ గ్రాఫ్‌ పడిపోయింది. రాయచోటి మున్సి­పాలిటీ ఎన్నికల్లో పోటీచేసేందుకు పదుల వార్డుల్లో మనకు అభ్యర్థులే లేరు. కూటమికి సానుకూల వాతావరణం ఉన్న గత సార్వత్రిక ఎన్నికల్లోనే 89 పోలింగ్‌ బూత్‌లలో మైనస్‌ కనిపించింది. ఇతర పార్టీలతో పొత్తు టీడీపీని దెబ్బతీస్తోంది..’ అంటూ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేకెత్తించాయి. రాయచోటిలో ఆదివారం జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేయలేని హామీ­లతో అధికారంలోకి రావడంతోపాటు పాలనలో అన్ని విధాలుగా విఫల­మయ్యారంటూ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. 

మహిళలకు రక్షణ కరువైంది. ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. అమరావతి పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ప్రచారం క్షేత్రస్థాయికి చేరడంతో ఆ పార్టీ నాయకులకే భయం పట్టుకుంది. ఇదే సమయంలో స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉండాలన్న అధినేతల సూచనలు మంత్రులు, ఎమ్మెల్యేల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకత స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుందని గ్రహించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుగానే చేతులెత్తేసే దశకు చేరుకుంటున్నారు. రాష్ట్ర రవాణా, క్రీడా, యువజనశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలోనే రాయచోటి మున్సిపాలిటీలో పదుల సంఖ్యలో వార్డుల్లో పోటీచేయడానికి పార్టీకి అభ్యర్థులే లేరంటూ వ్యాఖ్యానించడమే దీనికి ఉదాహరణ. 

2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తువల్లే భారీ మెజారిటీతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇంతకంటే మెజార్టీ ఎప్పుడూ రాలేదని, ఇకపై రాదని కూడా పేర్కొన్నారు. అలా గెలిచిన నియోజకవర్గాల్లో రాయచోటి కూడా ఉందన్నారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని బూత్‌లలో చెత్తగా ఫలితాలు వచ్చాయని నిషూ్టరంగా మాట్లాడుతూనే ఇక్కడ (ముస్లింలు, దళితులు, క్రిస్టియన్‌) కులాలు, మతాలకు ఇంకా ఓ పార్టీ (వైఎస్సార్‌సీపీ)తో ప్రేమలు చావలేదంటూ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల చాలా పోలింగ్‌ కేంద్రాల్లో దెబ్బతిన్నామంటూ  పరోక్షంగా బీజేపీని విమర్శించారు. ఆ పార్టీ కారణంగానే 89 బూత్‌లలో టీడీపీకి తక్కువ ఓట్లు పడ్డాయని చెప్పారు.  

మన పార్టీ వారే శత్రువులుగా తయారయ్యారు   
అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చడంతో రాయచోటిలో టీడీపీ గ్రాఫ్‌ దారుణంగా పడిపోయిందని చెప్పారు. సొంత పార్టీ వారే శత్రువులుగా తయారయ్యారంటూ పరోక్షంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబుపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాయచోటి మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీకి అన్ని వార్డులకు అభ్యర్థులు ముందుకొచ్చేలా సిద్ధం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. పార్టీ ఓడిపోతే వచ్చే కష్టాలను ఊహించుకుని కార్యకర్తల్లో చిత్తశుద్ధిని పెంచాలని కోరారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు.  

టీడీపీ నేతల్ని కలవరపరుస్తున్న ప్రజావ్యతిరేకత  
రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత టీడీపీ నేతల్లో కలవరం కలిగిస్తోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలన్న నేతల పిలుపుతో మరింత ఆందోళన చెందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా ఉండవనే స్పష్టమైన అంచనాకు వచ్చిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా స్థానిక ఎన్నికల బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement