
శేష వాహనంపై శ్రీవారు
తాడిపత్రి రూరల్: వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తాడిపత్రిలోని చింతల వేంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం శేష వాహన సేవలు అంగరంగ వైభవంగా సాగాయి. ఉదయం చింతల వేంకటరమణస్వామి, లక్ష్మీ అమ్మవారి మూలవిరాట్‌లకు అర్చకులు మురళీస్వామి బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత చింతల వేంకటరమణస్వామి ఉత్సవ మూర్తులను శేషవాహనంపై అధిష్టింపజేసి పురవీధుల్లో ఊరేగించారు. దేవేరులతో కలసి శ్రీకృష్ణుడి అలంకరణలో శ్రీవారు దర్శనమివ్వడంతో భక్తులు పులకించిపోయారు.