
‘గుంటూరు’పై ‘అనంత’ విజయం
అనంతపురం: ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా ఆదివారం ప్రారంభమైన జర్నలిస్టు రాష్ట స్థాయి క్రికెట్ లీగ్ పోటీల్లో గుంటూరు జట్టుపై అనంతపురం జట్టు విజయం సాధించింది. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు సాగే ఈ టోర్నీని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. తొలి మ్యాచ్‌ను అనంతపురం, గుంటూరు జట్ల మధ్య నిర్వహించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అనంతపురం సుధీర్ జట్టు 15 ఓవర్లకు గాను 109 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన గుంటూరు జట్టు 15 ఓవర్లలో 88 పరుగుల వద్ద చతికిలపడింది. దీంతో అనంతపురం సుధీర్ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రితో పాటు ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ విశిష్ట అతిథులుగా హాజరై మాట్లాడారు. వృత్తి నిర్వహణలో ఎన్నో ఒత్తిళ్లతో సతమతమవుతున్న జర్నలిస్టులకు క్రీడలు మనో వికాసానికి దోహదపడతాయన్నారు. జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జేశాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, గౌరవాధ్యక్షుడు రేపటి రామాంజనేయులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కృష్ణంరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.