
గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు
వజ్రకరూరు: ఐదు రోజుల క్రితం హంద్రీ–నీవా కాలువలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ ఎం.రామాంజనేయులు ఈ నెల 1న ఛాయాపురం వద్ద ఉన్న హంద్రీనీవా ప్రధాన కాలువలో గల్లంతైన విషయం తెలిసిందే. రెండు రోజులుగా రెవెన్యూ అధికారులు, అగ్పిమాపక సిబ్బంది, పోలీసులు గాలింపు చేపట్టిన ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో ఆదివారం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి. ఛాయాపురం నుంచి రాగులపాడు లిప్ట్ వరకూ హంద్రీ–నీవా ప్రధాన కాలువలో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలించాయి. చీకటి పడుతున్నా ఆచూకీ లభ్యం కాలేదు. గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా, ఐదు రోజులవుతున్నా వ్యక్తి ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.