
అవమాన భారంతో ‘హంద్రీ–నీవా’లో దూకాడు!
ఆత్మకూరు: ఓ మహిళ చెప్పుతో కొట్టడంతో గ్రామంలో పరువు పోయిందంటూ మనోవేదనకు లోనై ఓ వ్యక్తి హంద్రీనీవా కాలువలో దూకాడు. ఈత రాకపోవడంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... ఆత్మకూరు మండలం పంపనూరు తండాలో శనివారం కుళాయి గేట్‌వాల్వ్‌కు సంబంధించి లక్ష్మీనారాయణకు ఆయన పక్కింటి వారి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ సమయంలో లక్ష్మీనారాయణను పక్కింటి మహిళ చెప్పుతో కొట్టింది. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మీనారాయణ ఘటనపై ఫిర్యాదు చేయడానికి వెళితే... ‘ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టుకుని వస్తుంటావు’ అంటూ పోలీసులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో మనోవేదనకు లోనైన లక్ష్మీనారాయణ అదే రోజు సాయంత్రం ఆత్మకూరు నుంచి పంపనూరు తండా వరకూ నడుచుకుంటూ వెళ్లాడు. తనను చెప్పుతో కొట్టారని.. ఊళ్లో వాళ్లకి ముఖం చూపించలేనంటూ మార్గమధ్యంలో హంద్రీ–నీవా కాలువలో దూకాడు. ఈత రాకపోవడంతో ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు. అతని వెనకాలే ఉన్న కుమారుడు, బామ్మర్ది కేకలు వేసినా చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఫలితం లేకపోయింది. విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా వారు సకాలంలో స్పందించలేదని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆదివారం ఉదయం గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బందితో లక్ష్మీనారాయణ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. కాగా, లక్ష్మీనారాయణకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.