
సరుకులు స్టాక్ పాయింట్‌లోనే..
తాడిపత్రి రూరల్: అంగన్‌వాడీ కేంద్రాలంటే కూటమి ప్రభుత్వానికి అలుసుగా మారింది. ఇప్పటికే రెండు నెలల జీతం, అద్దెలు, ఇతర బిల్లుల మంజూరులో మీనమేషాలు లెక్కిస్తూ అంగన్‌వాడీ కార్యకర్తల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం తాజాగా మరో వివాదానికి తెరతీసింది. సకాలంలో లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయకుండా తన చేతకానితనాన్ని మరోసారి బయటపెట్టుకుంది.
మొదటి వారంలోనే సరుకుల పంపిణీ..
ప్రతి నెలా మొదటి వారంలోనే అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులకు బియ్యం, కందిబేడలు, నూనె, కోడిగుడ్లు, పాలు, బాలసంజీవిని, బాలామృతం కిట్లు పంపిణీ చేస్తారు. ఈ నెల 6వ తేదీ వచ్చినా ఇప్పటి వరకూ ఒక్క సరుకు కూడా అంగన్‌వాడీ కేంద్రాలకు చేరలేదు. ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు పంపిణీ చేయాలో తెలియక అంగన్‌వాడీ టీచర్లు సతమతమవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25 అంగన్‌వాడీ ప్రాజెక్టుల పరిధిలో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా ఒకటో తేదీన చౌకధాన్యపు డీలర్లకు లారీల్లో అందే సరుకులను అక్కడి నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు టీచర్లు ఆటోల ద్వారా తరలిస్తుంటారు.
అయోమయంలో 3.20 లక్షల మంది..
ఉమ్మడి జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 5,125 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 3.20లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. 8వేల మందికి పైగా గర్భిణులు, 24వేల మందికి పైగా పాలిచ్చే తల్లులు, 0–6 వయస్సు గల పిల్లలు 2.60 లక్షల మంది ఉన్నారని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి నెలా నాలుగు విడతలుగా అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా అవుతాయి. గర్భిణులు, బాలింతల కోసం ప్రతి నెలా మూడు కిలోల బియ్యం, కిలో కందిబేడలు, అర కిలో నూనె, 25 కోడిగుడ్లు, తల్లులకు 5 లీటర్ల పాలు, చిన్నారులకు 2.5 లీటర్ల పాలు, బాలసంజీవిని కిట్‌లను పంపిణీ చేస్తారు. అయితే ఈ నెల ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని పౌరసరఫరాల స్టాక్‌పాయింట్లకు పదిరోజుల క్రితమే చేరుకున్న సరుకులు అక్కడే నిలిచిపోయాయి.
రిలీజ్ ఆర్డర్ లేకుండానే డిస్పోజ్ ఆర్డర్!
స్టాక్ పాయింట్ల నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులను రవాణా చేయడానికి ఉన్నతాధికారుల నుంచి ముందుగా రిలీజ్ ఆర్డర్ ఉండాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఈ సారి రిలీజ్ ఆర్డర్ లేకుండానే ఏకంగా డిస్పోజ్ ఆర్డర్ అందడంతో కింది స్థాయి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విషయాన్ని కమిషనరేట్ దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నాలు విఫలమైనట్లు సమాచారం.
కేంద్రాల చుట్టూ తిరుగుతున్న
లబ్ధిదారులు..
ప్రతి నెలా 1వ తేదీ నేరుగా డీలర్ల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు పంపిణీ చేస్తుంటారు. నెలలో నాలుగు విడతలుగా కోడిగుడ్లను కాంట్రాక్టర్లు సరఫరా చేయాల్సి ఉండగా రవాణా ఖర్చుల భారం కారణంగా రెండు పర్యాయాలు చొప్పున నెలలో 1వ తేదీ, 15వ తేదీల్లో రవాణా చేస్తున్నారు. అయితే ఈ సారి అంగన్‌వాడీ కేంద్రాలకు బాలసంజీవని, కోడిగుడ్లు, పాలు, బాలామృతం ప్యాకెట్లు సరఫరా కాలేదు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో సరుకులు నిండుకున్నాయి. సరుకుల కోసం రోజూ బాలింతలు, గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. వారికి సరుకులు రాలేదని చెప్పలేక అంగన్ వాడీ టీచర్లు ఇబ్బంది పడుతున్నారు.
10 రోజులైనా అంగన్‌వాడీ కేంద్రాలకు చేరని వైనం
ఉమ్మడి జిల్లా వ్యాఫ్తంగా నిలిచిపోయిన రవాణా
సరుకుల కోసం ఎదురుచూస్తున్న
అంగన్‌వాడీ లబ్ధిదారులు
సాంకేతిక సమస్యతోనే..
సాంకేతిక సమస్య కారణంగా రిలీజ్ ఆర్డర్ (ఆర్‌ఓ)లు అందలేదు. దీంతో స్టాక్ పాయింట్ల నుంచి సరుకులు అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా కాలేదు. సమస్య పరిష్కారం కాగానే సరుకులను అంగన్‌వాడీ కేంద్రాలకు చేరుస్తాం.
– రమేష్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాలశాఖ
అధికారి, అనంతపురం

సరుకులు స్టాక్ పాయింట్‌లోనే..