Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Govt Scam in tailoring training for women with Sewing machines1
కుట్టు స్కీమ్‌.. రూ. 150 కోట్ల స్కామ్‌!

తొలుత రూ.వంద కోట్లతో మాత్రమే ప్రతిపాదన..! ఆపై అంచనాలు అమాంతం రూ.257 కోట్లకు పెంపు..! టెండర్‌ నుంచి శిక్షణ వరకు దోపిడీకి వీలుగా పథకం..! అనంతరం పదుల సంఖ్యలో కూడా లేని లబ్ధిదారులను భారీగా ఉన్నట్టు చూపించి.. అరకొరగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి.. వారికి పరికరాలు, మెషిన్‌ ఇవ్వకుండానే ఇచ్చినట్టు చెప్పుకొంటూ చంద్రబాబు ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపింది. దాదాపు రూ.154 కోట్లకు పైగా దండుకోవడానికి సిద్ధమైంది. కంకిపాడు నుంచి సాక్షి ప్రతినిధి: చంద్రబాబు ప్రభుత్వం తన అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్టు వ్యవహరిస్తోంది. బీసీలు, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌), కాపు మహిళలకు ఇచ్చే కుట్టు శిక్షణలోనూ రూ.154 కోట్లకు పైగా కొల్లగొట్టడానికి పథకం వేసింది. రాష్ట్రంలో 1,02,832 మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించే పేరుతో చేపట్టిన స్కీమ్‌లో దోపిడీకి తెగబడుతోంది. ముఖ్య నేత సమక్షంలో జరిగిన ముందస్తు ఒప్పందాలతోనే ఈ స్కీమ్‌ను తెరమీదకు తెచ్చారని తెలుస్తోంది. ఇందులో ముఖ్య నేత నుంచి సంబంధిత శాఖ మంత్రి, అధికారుల వరకు ఎవరి వాటా ఎంత అనేది ఒప్పందాలు కుదుర్చుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలకు కుట్టు శిక్షణ పథకానికి సంబంధించి ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశోధనలో విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. – అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న రాష్ట్రంలో లక్ష మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 175 నియోజకవర్గాల్లోనూ మూడు నుంచి ఐదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎంపిక చేసిన మహిళలకు శిక్షణ ఇస్తామన్నారు. ఇది జరిగి 45 రోజులు దాటినా 50 నియోజకవర్గాల్లో కూడా శిక్షణ మొదలుకాలేదు. ఆ పేరుతో రూ.వంద కోట్లకుపైగా కొల్లగొట్టే కార్యక్రమం మాత్రం నిర్విఘ్నంగా సాగుతోంది.టెండర్ల దశ నుంచే మాయాజాలంటెండర్లలో తక్కువ మొత్తానికి కోట్‌ చేసిన సంస్థకు కాంట్రాక్టును ఖరారు చేస్తారని తెలిసిందే. కానీ, అందుకు విరుద్ధంగా.. తక్కువ కోట్‌ చేసినవారితో పాటు అంతకంటే ఎక్కువకు కోట్‌ చేసిన మరో రెండు సంస్థలను కలిపి రంగంలోకి దించారు. ప్రి బిడ్‌లో మొత్తం 65 కంపెనీలు పాల్గొంటే 56 సంస్థలను ముందే తిరస్కరించారు. విచిత్రం ఏమంటే.. కుట్టు శిక్షణలో విశేష అనుభవంతో పాన్‌ ఇండియా కంపెనీగా గుర్తింపున్న ఐసీఏ కూడా ఇందులో ఉండడం. మిగిలిన 9 కంపెనీల్లో ఆరు సంస్థల టెండర్లను తెరవకముందే తమదైన శైలిలో పక్కకు తప్పించేశారు. అంటే.. మొత్తం 65 కంపెనీల్లో 62ను తొలగించేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం కావడం గమనార్హం.ఎల్‌1కు 5 శాతమే పని.. చంద్రబాబు ప్రభుత్వం తమవారికి శిక్షణ కాంట్రాక్టు అప్పగించడానికి ఇన్ని అడ్డంకులు పెట్టినా తట్టుకుని.. శ్రీ టెక్నాలజీ తక్కువ మొత్తానికి కోట్‌ చేసి ఎల్‌1గా నిలిచింది. కానీ, దానిని బెదిరించి 5 శాతం పని మాత్రమే అప్పగించారు. కీలక నేత ప్రమేయంతో.. ఎల్‌2, ఎల్‌3గా నిలిచిన సంస్థలకు మాత్రం 95 శాతం పని ఇచ్చారు. ఈ రెండు సంస్థలు (ఎల్‌2, ఎల్‌3) సిండికేట్‌ కావడం మరో ట్విస్ట్‌.శిక్షణ ముసుగులో..ఒక్కో మహిళ (యూనిట్‌) శిక్షణకు రూ.21,798 కేటాయించారు. ఇందులో టైలరింగ్‌లో శిక్షణ, టైలరింగ్‌ కేంద్రానికి అద్దె, మహిళకు కుట్టు మిషన్, ఇతర పరికరాల పంపిణీ వంటివి ఉన్నాయి. ఒక్కో మహిళకు 360 గంటల పాటు ఉచిత శిక్షణ ఇవ్వాలి. రోజుకు 4 గంటలు చొప్పున 90 రోజులు, 6 గంటలు చొప్పున 60 రోజులు, 8 గంటలు చొప్పున 45 రోజులు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కానీ, ఎక్కడా ఇది అమలవడం లేదు. పైగా శిక్షణకు అవసరమైన టేప్, కత్తెర, స్కేల్‌ తదితర పరికరాల కిట్‌ను కూడా లబ్ధిదారులనే తెచ్చుకోమంటున్నారు.–కుట్టు మిషన్లు కూడా ప్రముఖ కంపెనీలైన ఉషా, మెరిట్, సింగార్, పూజా తదితర కంపెనీలవి కాకుండా అతి తక్కువ ధరకు గుజరాత్‌లో తయారు చేసినవి అంటగడుతున్నారు. ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్లే మిగుల్చుకుంటున్నారు.–శిక్షణ కేంద్రాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేశారు. కానీ, వాటిని అద్దెకు తీసుకుని నడుపుతున్నట్లు చెబుతూ కాంట్రాక్టర్లు భారీగా వెనకేసుకుంటున్నారు. శిక్షణ కేంద్రాల్లో మహిళలకు తాగు నీరు, బాత్‌రూమ్‌ కూడా లేవు. –శిక్షణ చాలాచోట్ల శిక్షణ అంతంతమాత్రంగానే జరుగుతోంది. శిక్షకులు లేరనో.. లబ్ధిదారులు తగినంతమంది లేరనో చెబుతున్నారు. వాస్తవం ఏమంటే.. అరకొర సెంటర్లు ఏర్పాటు చేసి, అంతంతమాత్రంగా శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా కాంట్రాక్టర్లు కథ నడిపిస్తున్నారు.ప్రముఖ సంస్థలను తోసిరాజని..కుట్టు శిక్షణ ఇచ్చేందుకు సొసైటీ ఫర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ (సీడాప్‌), ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక, సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ (ఏపీఐటీసీవో)తో పాటు కేంద్ర సంస్థ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ్‌ కౌశల్‌ యోజన (డీడీయూజీకేవై) ఉన్నాయి. వీటికి శిక్షణ కేంద్రాలు, శిక్షణ భాగస్వాములు ఉన్నారు. స్కిల్‌ పోర్టల్స్, అన్ని జిల్లాల్లో పర్యవేక్షణ వ్యవస్థ, సిబ్బంది సైతం ఉన్నారు. అయినా వాటిని కాదని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా స్కీమ్‌ను చేపట్టడం భారీ స్కామ్‌కు మార్గం సుగమం చేసుకోవడమేననే ఆరోపణలు వస్తున్నాయి.ప్రభుత్వ వైఫల్యం.. నిర్లక్ష్యానికి నిలువుటద్దం–సాక్షి క్షేత్ర స్థాయి పరిశీలనలో తేటతెల్లంకృష్ణా జిల్లా కంకిపాడులోని మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్‌) ప్రాజెక్ట్‌ కార్యాలయం పై అంతస్తులోని టైలరింగ్‌ శిక్షణ కేంద్రాన్ని ‘సాక్షి’ పరిశీలించింది. ఇక్కడ 140 మందిని ఎంపిక చేసి ఉదయం 70, మధ్యాహ్నం 70 మందికి శిక్షణ ఇస్తున్నట్టు చెబుతున్నారు. ‘సాక్షి’ ప్రతినిధి ఏప్రిల్‌ 19న ఉదయం 11 గంటలకు వెళితే 16 మందే ఉన్నారు. మిషన్లు కూడా 20 మాత్రమే. బాగా పాతవైన ఇవి తుప్పుపట్టాయి. వచ్చినవారిలో ముగ్గురు అరగంటలోనే వెళ్లిపోయారు. మరో అరగంటకు 9 మంది వచ్చారు. శిక్షణ లేకపోవడంతో కబుర్లు చెప్పుకొంటూ కనిపించారు. కనీసం క్లాత్‌ కటింగ్‌కు బల్ల కూడా లేదు. కోలవెన్ను నుంచి రోజూ ఆటోలో వచ్చి వెళ్లడానికి రూ.వంద అవుతోందని పలువురు వాపోయారు. – కృష్ణా జిల్లా బంటుమిల్లిలో 138 మందిని ఎంపిక చేసినట్టు చెబుతున్నా.. కనీసం కుట్టు మిషన్లు కూడా లేవు. ఈ సెంటర్‌కు ఒక శిక్షకురాలితో పాటు వచ్చింది ఇద్దరే. మచిలీపట్నంలో మరీ చిత్రం ఐదు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఏ ఒక్క కేంద్రంలోనూ శిక్షణ మొదలులేదు.ఎమ్మెల్యే కార్యాలయంలోనే శిక్షణ కేంద్రం పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ ఏకంగా తన కార్యాలయంలోనే దర్జీ శిక్షణ కేంద్రం పెట్టుకున్నారు. శిక్షణ ఇవ్వకున్నా ఎవరూ అడగరని, తమ పార్టీ వాళ్లకే ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వొచ్చని ఇలా చేశారని అంటున్నారు. కుట్టు శిక్షణ కేంద్రం ఎక్కడుందని పెనమలూరు ఎంపీడీవో బండి ప్రణవిని వివరణ కోరగా ఎమ్మెల్యే కార్యాలయంలో అని చెప్పడం గమనార్హం.రూ.257 కోట్లు స్కీ (స్కా)మ్‌ ఇలా.. –మొదట యూనిట్‌కు రూ.25 వేలు చొప్పున మొత్తం రూ.257 కోట్లు ప్రతిపాదించారు–టెండర్‌లో యూనిట్‌కు రూ.21,500 వంతున 1,02,832 మంది మహిళలకు మొత్తం రూ.221,08,88,000–ఇందులో ఒక్కో కుట్టు మిషన్‌ రూ.4,300 లెక్కన: రూ.44,21,77,600–ఒక్కొక్కరికి శిక్షణ కోసం రూ.3 వేలు చొప్పున: రూ.30,84,96,000–ఒక్కొక్కరికి కుట్టు మిషన్, శిక్షణ కలిపి: రూ.7,300. ఈ ప్రకారం మొత్తం అయ్యేది 75,06,73,600.–రూ.221,08,88,000 కోట్లలో రూ.75,06,73,600 కోట్లు పోగా 146,02,14,400 స్కామ్‌ ఒక్క కుట్టు మిషన్‌కు ఏ సంస్థ ఎంతకు కోట్‌ చేసిందంటే..?–శ్రీ టెక్నాలజీ ఇండియా(ఎల్‌ఎల్‌పీ)–హైదరాబాద్‌ రూ.21,798–సోషల్‌ ఏజెన్సీ ఫర్‌ పీపుల్స్‌ ఎంపవర్‌మెంట్‌–హైదరాబాద్‌ రూ.23,400–సెంటర్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌–హైదరాబాద్‌ రూ.23,500మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ఇవ్వండి.. పంచుకుందాంనిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లకు ముందస్తు చెల్లింపునకు సిద్ధంఒప్పందంలో లేకున్నా రూ.25 కోట్ల అడ్వాన్సులకు ప్రతిపాదనలుమంత్రి సంతకం మాత్రమే మిగిలింది.. తర్వాత పంచుకు తినడమే శిక్షణ పేరుతో 50 రోజుల్లోనే మొత్తం దండుకునేందుకు సిద్ధంరాష్ట్రవ్యాప్తంగా ఇంకా పూర్తిస్థాయిలో కుట్టు శిక్షణే ప్రారంభం కాలేదు. మొబిలైజేషన్‌ అడ్వాన్సు కింద రూ.25 కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. స్కీమ్‌కు సంబంధించి టెండర్‌ ఖరారై ఒప్పందం కుదిరిన మరుక్షణం నుంచే అడ్వాన్సుల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలుత రూ.60 కోట్ల అడ్వాన్సుల కోసం ప్రయత్నించి భంగపడిన కాంట్రాక్టర్లు తాజాగా రూ.25 కోట్లను రాబట్టుకోబోతున్నారు. ఈ మేరకు కాంట్రాక్టర్లు పొలిటికల్‌ బాస్‌కు రాయబారం పంపి అనుకున్నది సాధించారు. తద్వారా తమ వాటాల వసూలుకు ముఖ్య నేతలు మార్గం సుగమం చేసుకుంటున్నారని సమాచారం. నీకింత.. నాకింత తరహాలో పంచుకోవడానికి కాంట్రాక్టర్లతో కలిసి ముఖ్య నేతలు సిద్ధమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అడ్వాన్సులిస్తే తమ మెడకు చుట్టుకుంటుందని అధికారులు ససేమిరా అంటున్నా.. వారిని దారికి తెచ్చుకుని పని చక్కబెట్టడానికి ‘పొలిటికల్‌ బాస్‌’ సరే అన్నారని సమాచారం. టెండర్‌ నిబంధనలకు విరుద్ధంగా..వాస్తవానికి బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు మహిళలకు టైలరింగ్‌ శిక్షణ ప్రారంభమైన 15 రోజులకు 33 శాతం, 30 రోజులకు మరో 33 శాతం, 50 రోజులకు మిగిలిన 33 శాతం బిల్లులు చెల్లించేలా టెండర్‌లో పేర్కొన్నారు. అంటే.. శిక్షణ పేరుతో 50 రోజుల్లోనే మొత్తం బిల్లులు కింద లాగేసేందుకు పథకం రూపొందించారు. పై నుంచి ఆమోదం లభించడంతో బీసీ, కాపు కార్పొరేషన్ల అధికారులు మొబిలైజేషన్‌ అడ్వాన్సుల కోసం ఫైల్‌ పెట్టారు. ఉన్నతాధికారులు సైతం రూల్‌ పొజిషన్‌కు సంబంధించి ఏ కామెంట్లు లేకుండానే యథాతథంగా మంత్రి సవితకు పంపారు. ఆమె సంతకం చేస్తే కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సులు చెల్లిస్తారు. ఇక నీకింత.. నాకింత అని పంచుకోవడమే అని పలు శాఖల సిబ్బంది చెబుతున్నారు.

Sakshi Editorial On Chandrababu Govt Amaravati Capital Event2
వేదనలో రాజ్యం... వేడుకలో రాజధాని!

‘‘ఠండా మతలబ్‌ కోకాకోలా...’’ ఇండియాలో బాగా పాపులరయిన వాణిజ్య ప్రకటనల్లో ఒకటి. మరి కోకాకోలా మతలబు? రెండొందల మిల్లీలీటర్ల కోక్‌ తయారు చేయడానికి గరిష్ఠంగా యాభై పైసలు ఖర్చవుతాయని మార్కెట్‌ టాక్‌. పది పైసల కంటే ఎక్కువ కాదనే వాళ్లు కూడా ఉన్నారు. కానీ మనం గరిష్ఠాన్నే లెక్కేసుకుందాం. దానికి పదింతలు ఎక్కువ ఖర్చు పెట్టి మార్కెటింగ్‌ నైపుణ్యాన్ని జోడిస్తారు. వినియోగదారుకు ఇరవై రూపాయలకు అమ్ముతారు. రవాణా ఖర్చులు, కమీషన్లు తీసేసినా మినిమమ్‌ నూటా యాభై శాతం లాభాలు కంపెనీ గల్లా పెట్టెలో పడతాయి. దీన్నే బ్రాండ్‌ బిల్డింగ్, మార్కెటింగ్‌ టెక్నిక్‌ వంటి పేర్లతో ఘనంగా చెప్పుకుంటారు.ఈ ధోరణి రాజకీయాల్లోకి, ప్రభుత్వ పాలనలోకి కూడా దిగుమతయింది. ఇందులో ఉద్దండులైన ఇద్దరు అగ్ర నాయ కులు నిన్న ఉద్దండరాయునిపాలెం సమీపంలో అమరావతి బ్రాండ్‌ షూటింగ్‌ను పునఃపునఃప్రారంభించారు. ప్రధాని సంగతి తెలిసిందే. భారతీయ వ్యాపార రంగంలో ఆరితేరిన వారైన గుజరాతీల ముద్దుబిడ్డ. అంతటా దొరికే వస్తువుపై కూడా అరుదైన సరుకుగా ముద్రవేసి అమ్మగల నేర్పరులు వారు. లేకపోతే, ఓ పిడికెడు మంది మినహా సమస్త ప్రజల్లో ఉండే సహజ లక్షణాలైన దేశభక్తి, దైవభక్తి వంటి అంశాలపై కూడా తమకే పేటెంట్‌ హక్కులున్నాయని ఎలా ప్రకటించు కోగలరు?ఏపీ ముఖ్యమంత్రి కూడా ప్రధానికి దీటైనవారే. నిజం చెప్పాలంటే కొంచెం ఎక్కువ కూడా! మీడియా ప్రచారంతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగవచ్చన్న కిటుకును ఆయన తొలి రోజుల్లోనే కనిపెట్టారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మీద, సెల్‌ఫోన్‌ల మీదా తనకే పేటెంట్‌ దక్కాలని చిరకాలంగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి అమరావతి షోలో పాల్గొని అమరా వతి బ్రాండ్‌ వ్యాల్యూ పెంచే ప్రయత్నాన్ని చేశారు. ఈ షో జరగడానికి ముందునుంచే అమరావతి ప్రమోషన్‌ కార్యక్రమాన్ని ఏకసూత్ర పథకంగా భావించి, పరిపాలన సైతం పక్కన పెట్టి చంద్రబాబు ప్రయాసపడుతున్నారు. అప్పిచ్చువాడి కోసం డప్పు కొడుతూనే ఉన్నారు. ప్రపంచబ్యాంకూ, మరో రెండు సంస్థలూ 31 వేల కోట్ల షరతులతో కూడిన అప్పును మంజూరు చేసిన వెంటనే 47 వేల కోట్లకు టెండర్లను పిలవనే పిలిచారు. ఇందులో భారీ కమీషన్ల కోసం అంచనాలను అసహజంగా పెంచేశారన్న విమర్శలు వినిపించాయి.ఇందులో చాలా పనులకు ఏడేళ్ల కింద కూడా టెండర్లను పిలిచారు. అప్పటి అంచనా వ్యయానికీ, ప్రస్తుతానికీ పోలికే లేదు. ఒక్క సెక్రటేరియట్‌ టవర్ల అంచనాయే నూరు శాతం పెరిగింది. 2018లో సెక్రటేరియట్‌ నాలుగు టవర్లూ, సీఎం కార్యాలయానికి కలిపి అంచనా వ్యయం 2,271 కోట్లుంటే ఇప్పుడది 4,688 కోట్లకు ఎగబాకింది. ఏడేళ్లలో నూరు శాతం ద్రవ్యోల్బణం పెరిగిందా? నిర్మాణ రంగంలో ప్రధాన పద్దులైన సిమెంటు, ఇనుము ధరలు పెరక్కపోగా అంతో ఇంతో తగ్గాయని మార్కెట్‌ సమాచారం. అమరావతి బ్రాండ్‌ బాజా మిరు మిట్లలో ఇటువంటి వాస్తవాలు మరుగున పడిపోవాలని పాల కుల ఉద్దేశం కావచ్చు.అమరావతి కాసుల వేటలో పడి ప్రజాపాలనను పడకేయించిన పర్యవసానం ఎలా ఉన్నదో మచ్చుకు ఒక సన్నివేశాన్ని పరిశీలిద్దాం. రైతు పండించిన పంటలకు మార్కెట్‌లో పలికిన ధరలేమిటో ఒకసారి గమనించండి. మిరపకు జగన్‌ పాలనలో పలికిన సగటు ధర 24 వేల రూపాయలైతే, ఇప్పుడు 6,500. పత్తికి నాడు 10,500 పలికితే నేటి సగటు ధర 4,900. కందులు నాడు 11 వేలు, నేడు 5,850. పసుపు, మినుము, పెసలు, శనగలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, పొగాకు, చీనీపండ్లు, అరటి, బొప్పాయి, టమాటా, ఉల్లి... ఇలా ఏ వ్యవసాయిక ఉత్పత్తినైనా తీసుకొని పరిశీలించండి. ఒకే రకమైన రాజధాని పనులకు ఏడేళ్ల కాలంలో కాంట్రాక్టర్లకు ఇస్తున్న సొమ్ము నూరు శాతం ఎట్లా పెరిగింది? ఆరుగాలం కష్టించిన రైతన్నకు లభిస్తున్న ధర ఏడాది కాలంలోనే నూరు శాతం ఎట్లా పడి పోయింది? ఇదేమి రాజ్యం? అదేమి రాజధాని? పైగా అది ప్రజా రాజధానట! జన జీవితాల మీద ఇంతకంటే క్రూరమైన పరిహాసం ఇంకొకటి ఉంటుందా?ఈ రాజధాని నిర్మాణానికి అర్జెంటుగా ఇంకో 47 వేల కోట్లు కావాలట! మరో 44 వేల ఎకరాలు సమీకరించాలట! అప్పుడు గానీ ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాదట! పనుల పునఃప్రారంభం నాటికే రాష్ట్ర వ్యవసాయ రంగం వెన్ను విరిగింది. ఆ పనులన్నీ కొలిక్కి వస్తే ఇంకెన్ని దారుణాలు చూడాలో! గిట్టుబాటు ధర లేకపోవడం ఒక్కటే కాదు. రైతు కుటుంబాల మీద ఏడాది పొడుగునా పిడుగులే కురుస్తున్నాయి. రైతు భరోసా లేదు. అప్పిచ్చువాడి గడప తొక్కక తప్పలేదు. పంటల బీమా లేదు. దేవుడి మీదే భారం. ఇన్‌పుట్‌ సబ్సిడీ, కరువు సాయం బకాయీల ఊసెత్తితే ఒట్టు. ఆర్‌బీకేలు అలంకార ప్రాయంగా మారి ఆసరా ఇవ్వడం లేదు. ఒక్క అమరావతి కలవరింత తప్ప, సాధారణ పరిపాలనపైన కూడా ఈ ప్రభుత్వం పట్టు కోల్పో యింది. విజయవాడ వరదలు, తిరుపతి తొక్కిసలాట, సింహా చలం దుర్ఘటన వగైరాలు పాలనా వైఫల్యానికి నిదర్శనాలు.అదే రాష్ట్రం, అవే వనరులు, అదే ఆదాయం. ఏ ఖర్చయినా అందులోంచే పెట్టాలి. ఏ అప్పయినా అందులోంచే చెల్లించాలి. లేదంటే మరిన్ని అప్పులు చేయాలి. ఎన్నికల ముందు చంద్ర బాబు హామీ ఇచ్చిన అద్భుతం ఆవిష్కృతం కాలేదు. సంపద సృష్టి జరగలేదు. ఎప్పుడు సృష్టిస్తారో కూడా చెప్పడం లేదు. రాజధాని మీద లక్ష కోట్ల దాకా ఖర్చు పెట్టాలని చెబుతున్నారు. ఆ ఖర్చుకు అప్పులే మార్గం. ఉన్న ఆదాయ వనరుల్లోంచే ఈ అప్పులు తీర్చాలి. అమరావతే తన అప్పుల్ని తీర్చుకుంటుందని మొదట్లో ఊదరగొట్టారు. ఎన్ని వేల ఎకరాలను అభివృద్ధి చేసి అమ్మితే అంత అప్పును తీర్చాలి? అన్ని వేల ఎకరాలను ఎగబడి కొనేందుకు ఎవరు ముందుకొస్తారు? ఇది జరగడానికి ఎన్ని పుష్కరాలు పడుతుంది? ఇటువంటి సందేహాలకు సమాధానా లేవీ ఇంతవరకు రాలేదు.ఈలోగా ఒక్క ఏడాదిలోనే వ్యవసాయ రంగం కుదేలైంది. రాజధాని కోసం భూములను ‘త్యాగం’ చేసిన 28 వేల మంది రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లయినా దక్కుతాయని చెబు తున్నారు. కానీ, అమరావతి పేరుతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతుల త్యాగానికి ఎవరు వెల కట్టాలి? వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న ఎం.ఎస్‌. ఎం.ఈ. రంగంలో ఈ సంవత్సరం 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని పార్లమెంటుకిచ్చిన సమా ధానంలో కేంద్రం తెలియజేసింది. ఈ లెక్కన అమరావతి నిర్మాణం కోసం ఇంకెన్ని సెక్షన్లు బలవ్వాలి? ఎంత విధ్వంసం జరగాలి? ‘‘మా కండలు పిండిన నెత్తురు, మీ పెండ్లికి చిలికిన అత్తరు’’ అన్నాడు ఒక కవి. అమరావతి కోసం ఆంధ్రదేశమంతా ఈ పాట పాడుకోవాలేమో?శుభమా అని రాజధాని పనులు ప్రారంభిస్తుంటే ఈ కుశంకలేమిటనే వారు లేకపోలేదు. కుశంకలు కావు, వాస్తవాల పునా దులపై తలెత్తుతున్న సందేహాలు ఇవి. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, ఇల్లాలు ఏడ్చిన ఇల్లు బాగుపడవంటారు. రైతు ఇప్పుడు దుఃఖిస్తున్నాడు అన్నది ఒక వాస్తవం. రాష్ట్రంలోని మహిళలకు ‘సూపర్‌ సిక్స్‌’ పేరుతో పాలక కూటమి ఎన్నో ఆశలు పెట్టిందన్నది ఒక వాస్తవం. ఏడాది తర్వాత కూడా వారి ఆశలు అడియాసలుగానే మిగిలాయన్నది ఒక వాస్తవం. సంపద సృష్టి పేరు చెప్పి ఎడాపెడా అప్పులతో రాష్ట్రాన్ని ఊబి లోకి తోస్తున్న మాట వాస్తవం. ఈ అప్పుల ఊబి నుంచి బయట పడే మార్గం ఏమిటో ఇప్పటిదాకా ప్రభుత్వం విడమరచి చెప్ప లేకపోయిన మాట కూడా వాస్తవం.రమారమి 500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిన్న అమరా వతిలో ‘పునరపి జననం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రిని తీసుకొచ్చి పొగడ్తల్లో ముంచారు. స్తోత్రకై వారాలు గావించారు. ఈ దేశ ప్రధానిని గౌరవించడం తప్పేమీ కాదు. గౌరవించాలి కూడా! అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కూడా రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలబడాలి. తమ నాయకుడు సాగిలపడ్డంత పనిచేయడాన్ని, నంగి నంగి మాట్లాడటాన్ని ప్రజలు హర్షించరు. బిల్లు మంజూరు చేసే అధి కారి తనిఖీకి వచ్చినప్పుడు చిన్నపాటి కాంట్రాక్టర్లు వ్యవహరించినట్టుగా బాడీ లాంగ్వేజ్‌ ఉండకూడదు. బహిరంగ సభల్లో బీజేపీ నాయకులు జనం చేత మూడుసార్లు ‘వందేమాతరం’ అనిపించడం చాలాకాలంగా వస్తున్న సంప్రదాయం. ఆ దీక్షను కూడా చంద్రబాబు ఈ సభలో స్వీకరించారు. నిజానికి తెలుగు దేశం పార్టీలో ఈ ఆచారం లేదు.ఆరేళ్ల క్రింద నరేంద్ర మోదీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన విపరీత విమర్శలు చాలామందికి ఇంకా గుర్తున్నాయి. కానీ, అటువంటిదేమీ జరగనట్టుగానే సభలో ఆయన ప్రవర్తన కనిపించింది. సాధారణంగా ఐటీ రంగానికి సంబంధించినంత వరకు ఘనత అంతా తనకే దక్కాలని కోరుకుంటారు. దాన్ని ఇంకెవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆశ్చర్యకరంగా నిన్నటి సభలో ‘‘టెక్నాలజీ అంటే మోదీ, మోదీ అంటే టెక్నాలజీ’’ అని పొగిడేశారు. ఈ భజన కార్యక్రమం వెనుకనున్న ఉద్దేశం ఏమిటో గాని ప్రధాని మాట్లాడుతున్నప్పుడు అమరావతి కోసం అదనంగా తానేం చేస్తానన్నది మాత్రం చెప్పలేదు. చంద్రబాబు పొగడ్తలకు పొగడ్తలతోనే ఆయన సమాధానం చెప్పారు. మొదటి ప్రారంభానికి వచ్చినప్పుడు మట్టి–నీళ్లు తెచ్చిన ప్రధాని, ఈసారి పవన్‌ కల్యాణ్‌కు మాత్రమే ఒక చాక్లెట్‌ తీసుకువచ్చారు.ఏదో వ్యూహం ప్రకారమే లోకేశ్‌తో ఈ సభలో మాట్లాడించి నట్టుగా కనిపించింది. తన కుమారుడికి మోదీ ఆశీస్సులు లభించవలసిన సమయం ఆసన్నమైందని బాబు భావిస్తుండవచ్చు. ప్రసంగం ప్రారంభానికి ముందు లోకేశ్‌ ‘నమో నమః’ అంటూ మూడుసార్లు సంబోధించారు. ఆ నమస్కారం మోదీ కోసమే అనే సంగతి ఆయనకు అర్థమైందో లేదోనన్న అనుమానం కలిగి నట్టుంది. మోదీని గురించి చెప్పాల్సిన ప్రతి చోట ‘నమో గారు, నమో గారు’ అంటూనే మాట్లాడారు. ‘‘వంద పాకిస్తాన్లు దండెత్తి వచ్చినా నమో మిస్సైల్‌ ముందు బలాదూర్‌’’ అన్నారు. ప్రధాన మంత్రిని లోకేశ్‌ పొగుడుతున్నంతసేపు చంద్రబాబు ఉత్కంఠగా కనిపించారు. లోకేశ్‌ పొగడ్తలు ప్రధానికి అర్థమవుతున్నాయో లేదో తెలుసుకోవాలన్న కుతూహలం ఆయన మోములో కనిపించింది. అనూహ్యంగా ఆయన చాలాసార్లు చిరునవ్వులు చిందించారు. ఇటువంటి సైడ్‌ లైట్స్‌ తప్ప ఈ సభ గురించి చెప్పు కోవడానికి ఇంకో విశేషం లేదు. అమరావతికి బ్రాండ్‌ వ్యాల్యూ పెంచడానికి జరిగిన ఒక ఈవెంట్‌గా మాత్రమే ఇది చరిత్రలో మిగిలిపోతుంది. రాజ్యమంతటా ఆవేదన అలుముకుంటున్న వేళ వేడుకలు చేసుకున్న రాజధానిగా కూడా చరిత్రలో అమరా వతి స్థానం సంపాదించుకుంటుంది.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

Weekly Horoscope In Telugu From 04-05-2025 To 10-05-20253
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం...ముఖ్యమైన పనులలో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. కళారంగం వారికి అవార్డులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.వృషభం...చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు సానుకూలం. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. నూతనోద్యోగాలు దక్కించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు.. సుబ్రహ్మణ్యస్తోత్రాలు పఠించండి.మిథునం...అనుకున్న సమయానికి డబ్బు సమకూరక కొంత ఇబ్బందిపడవచ్చు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు మరింత పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులు, మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా కొనసాగుతాయి. కొన్ని వివాదాలు నెలకొన్నా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగేవీలుంది. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, నీలం రంగులు.. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కర్కాటకం...ఆర్థిక వ్యవహారాలు కొంత సామాన్యంగా ఉన్నా అవసరాలకు లోటు రాదు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి విషయంలో చిక్కులు తొలగి లబ్ధి చేకూరుతుంది. మీ ఆశయాలు నెరవేరతాయి. చాకచక్యంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఉన్నతశ్రేణి వారితో పరిచయాలు ఏర్పడవచ్చు.. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. నిర్ణయాలలో మార్పులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.సింహం...అనుకున్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి విషయాలలో సోదరుల నుంచి అనుకూల సంకేతాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకుని కుటుంబసభ్యులను ఆశ్చర్యపరుస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. రాజకీయవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.కన్య...కొన్ని పనులలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అందరిలోనూ ప్రత్యేకతను చాటుకుంటారు. మీ ప్రజ్ఞాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకోని హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు పురస్కారాలు అందుతాయి. వారం చివరిలో ఆరోగ్య, కుటుంబసమస్యలు. ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.తుల...ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. కొన్ని నిర్ణయాలు బంధువులను ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కుటుంబసభ్యులు మీపై మరింత ఆదరణ చూపుతారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. నేరేడు, తెలుపు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.వృశ్చికం..అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీ వ్యూహాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. వ్యాపారాలలో ఊహించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. వ్యయప్రయాసలు. గులాబీ, పసుపు రంగులు. గణేశాష్టకం పఠించండి.ధనుస్సు..ఆర్థికంగా కొంత పురోగతి కనిపించినా రుణాలు సైతం చేస్తారు. మిత్రులు, బంధువులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ఆస్తుల విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత శ్రమ తప్పదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో శుభవార్తలు. స్వల్ప అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఈశ్వరారాధన మంచిది.మకరం......వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువులకు మీ మనస్సులోని భావాలను వెల్లడిస్తారు. అందరిలోనూ గౌరవానికి లోటు ఉండదు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తుల విషయంలో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా సర్దుబాటు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కుతాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త విధుల్లో చేరవచ్చు. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు దక్కే అవకాశం. వారం మధ్యలో ఆరోగ్యభంగం. మిత్రులతో వివాదాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.కుంభం.....ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలవు. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఒడ్డున పడతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. మీ అభిప్రాయాలు, మనోగతాన్ని కుటుంబసభ్యులు గౌరవిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. శత్రువులను సైతం ఆదరిస్తారు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన కష్టం కొలిక్కి వస్తుంది. వ్యాపార లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి సత్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఎరుపు, నేరేడు రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.మీనం...నూతనంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు. సభలు, సమావేశాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వివాహయత్నాలు తుది దశకు చేరుకుంటాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు కొంతవరకూ లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. వ్యయప్రయాసలు. ఎరుపు, తెలుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

YS Jagan Mohan Reddy Fire on TDP Govt4
అన్నం పెట్టే రైతులకు సున్నమా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధర లభించక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా, టీడీపీ కూటమి ప్రభుత్వంలో పట్టించుకునే వారు కరువయ్యారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఒక్క ఎకరాకు సంబంధించి ఒక్క క్వింటాల్‌ కూడా కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రికార్డు స్థాయిలో మార్కెట్‌లో ధర లేని పంట ఉత్పత్తుల సేకరణ ద్వారా రైతులను ఆదుకునేందుకు మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద రూ.7,796 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.చరిత్రాత్మక నిర్ణయాలతో కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. ‘మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా?’ అని ప్రశ్నిచారు. రాష్ట్రంలో రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ‘ఎక్స్‌’ వేదికగా శనివారం ఆయన ఎండగట్టారు. ఆ పోస్ట్‌లో ఇంకా ఏమన్నారంటే.. కనీస బాధ్యతను విస్మరించారు⇒ చంద్రబాబు గారూ.. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు­పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం వారి వైపు కన్నెత్తి కూడా చూడక పోవడం ధర్మమేనా? ⇒ మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశనగ, టమాటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధర రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? ⇒ మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్‌ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాకు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కానీ, ఒక్క ఎకరాకు సంబంధించి కానీ, ఒక్క క్వింటాల్‌ గానీ కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. ఇది వాస్తవం కాదా?⇒ మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7,796 కోట్లు ఖర్చు చేశాం. చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ⇒ ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60 శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండి పడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలి. కనీస మద్దతు ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని, మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలి.

Pak Soldier Detained By BSF In Rajasthan5
బోర్డర్‌లో టెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ అదుపులో పాక్‌ సైనికుడు

న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దుల వద్ద పాక్‌ ఆర్మీ అధికారి ఒకరు బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు పట్టుబడ్డారు. అతడిని వెంటనే కస్టడీలోకి తీసుకున్నామని బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. పదిహేను రోజుల క్రితం, ఏప్రిల్‌ 23న బీఎస్‌ఎఫ్‌ జవాను పూర్ణం కుమార్‌ పాక్‌ భూభాగంలోకి పొరపాటున ప్రవేశించి అక్కడి జవాన్లకు దొరికిపోవడం తెల్సిందే. భారత బలగాలు తీవ్ర నిరసన తెలిపినప్పటికీ ఆయన్ను తిరిగి అప్పగించేందుకు పాక్‌ అధికారులు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా.. భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో పాకిస్తాన్‌ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా పదో రోజు కూడా దాయాది ఆర్మీ కాల్పులు జరిపింది. వాస్తవాధీన రేఖ వద్ద కుప్వారా, ఫూంచ్‌ర, అక్నూర్‌ సెక్టార్‌లో పాకిస్తాన్‌ ఆర్మీ కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపులకు దిగింది. దీంతో, భారత సైన్యం పాకిస్తాన్‌ కాల్పులను తిప్పికొట్టింది. ధీటుగా బదులిచ్చింది. రెచ్చగొట్టేలా పాక్‌ క్షిపణి పరీక్షలు..మరోవైపు.. పహల్గాం ఉగ్ర దాడితో అసలే దెబ్బ తిన్న పులిలా ఉన్న భారత్‌ను మరింత రెచ్చగొట్టేలా పాక్‌ వ్యవహరిస్తోంది. ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ క్షిపణి పరీక్షలకు దిగింది. 450 కి.మీ. రేంజ్‌తో కూడిన అబ్దాలీ సర్ఫేస్‌ టు సర్ఫేస్‌ బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థను పరీక్షించినట్టు పాక్‌ సైన్యం శనివారం ప్రకటించుకుంది. పైగా, ఇది ‘సింధూ విన్యాసా’ల్లో భాగమంటూ గొప్పలకు పోయింది. ఇది అద్భుతమంటూ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ, ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ సైన్యాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఈ ఉదంతంపై భారత్‌ మండిపడింది. దీన్ని కచ్చితంగా రెచ్చగొట్టే చర్యగానే పరిగణిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

Modi meets Angolan President Lourenco6
ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు

న్యూఢిల్లీ: భారత్, ఆఫ్రికన్‌ యూనియన్‌ ప్రగతిశీల భాగస్వామ్యపక్షాలు అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. గ్లోబల్‌ సౌత్‌కు ఇరుపక్షాలు మూలస్తంభాలని చెప్పారు. ఆయన శనివారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సోతో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంప్రదాయ వైద్యం, వ్యవసాయం, సాంస్కృతిక సహకారం వంటి రంగాల్లో భారత్‌–అంగోలా మధ్య అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అనంతరం ఇరువురు నేతలు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ మరోసారి తేల్చిచెప్పారు. పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ముష్కరులను, వారి మద్దతుదారులను శిక్షించడం తథ్యమని స్పష్టంచేశారు. ఉగ్రవాదులపై దృఢమైన, నిర్ణయాత్మక చర్యలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాలు, అంతరిక్ష సాంకేతికత వంటి అంశాల్లో ఇండియా శక్తిసామర్థ్యాలను అంగోలాతో పంచుకుంటామని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, వజ్రాల ప్రాసెసింగ్, ఎరువులు, ఖనిజాల విషయంలో అంగోలాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అంతకుముందు అంగోలా అధ్యక్షుడు లోరెన్సోకు రాష్ట్రపతి భవన్‌ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మా గాంధీకి లారెన్సో ఘనంగా నివాళులర్పించారు. భారత్‌–అంగోలా మధ్య దౌత్య సంబంధాలు 1985లో ప్రారంభమయ్యాయి. ఆఫ్రియన్‌ యూనియన్‌కు ఈ ఏడాది అంగోలా దేశమే నేతృత్వం వహిస్తోంది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం లోరె న్సో గురువారం భారత్‌కు చేరుకున్నారు. అంగోలా సైనిక దళాల ఆధునీకరణకు రూ.1,691 కోట్ల రుణం అంగోలా సైనిక దళాల ఆధునీకరణకు తమ వంతు సహకారం కచ్చితంగా అందిస్తామని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఇందుకోసం 200 మిలియన్‌ డాలర్లు(రూ.1,691 కోట్లు) రుణంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడు లోరెన్సో పర్యటన భారత్‌–అంగోలా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశను నిర్దేశిస్తుందని, భారత్‌–ఆఫ్రికా నడుమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

Plenty of water even in summer with construction of check dams7
కరువు ఎరుగని 'కృషీవలురు'!

కొడిమ్యాల మండలం పూడూరు వాగుపై 7 చెక్‌ డ్యాంలు ఉన్నాయి. వాగుకు ఇరువైపులా మోటార్లు పెట్టుకుని రైతులు ఈ నీటితో పంటలు సాగు చేసేవారు. ఇటీవల వాగు పూర్తిగా ఎండిపోవటంతో ఆరెపల్లి, అప్పారావుపేట, పూడూరు గ్రామ రైతులు చందాలు వేసుకొని దాదాపు రూ. లక్ష జమచేసి 40 పైపులు కొనుగోలు చేసి, కొండాపూర్‌ మైసమ్మ చెరువు మత్తడి నుంచి సాగు నీటిని తరలించారు. దీంతో కొడిమ్యాల పెద్దవాగుతోపాటు పూడూరు వాగుపై ఉన్న ఏడు చెక్‌ డ్యాంలు నిండి పొంగిపోర్లుతున్నాయి. ఈ నీటితో ఆ చుట్టుపక్కల 500 ఎకరాల వరి పంట ఎండిపోకుండా రైతులు కాపాడుకున్నారు.సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: వేసవికాలం వచ్చిందంటే చాలాచోట్ల ఎండిన పంటలు.. పశువుల మేతకు వదిలేసిన పొలాల చిత్రాలే కన్పిస్తాయి. ఎండిపోయిన వాగులు.. ఒట్టిపోయిన బావులు సర్వసాధారణం.. కానీ, కొన్నిచోట్ల ప్రభుత్వం వాగులు, వంకలపై నిర్మించిన చిన్నచిన్న చెక్‌డ్యాంలు అన్నదాతల తలరాతలను మార్చేశాయి. మండు వేసవిలోనూ నిండైన జలకళతో పచ్చని పంటలకు ప్రాణం పోస్తున్నాయి. మరికొన్నిచోట్ల అన్నదాతలు సరికొత్త ఆలోచనలతో సొంతంగానే నీటిని ఒడిసిపట్టి మండు వేసవిలో బంగారు పంటలు పండిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కన్నీటి జీవితాలను ప‘న్నీటి’గా మార్చుకున్న పలువురు రైతుల విజయగాథలివీ... ఐదేళ్లుగా కరువు ఎరగని వీణవంక పల్లె కరీంనగర్‌ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం.. ఆ ప్రాంతంలో కరువును దూరం చేసింది. ఒకప్పుడు తాగు, సాగు నీటికి అల్లాడిన అక్కడి ప్రజలు.. చెక్‌డ్యాం వల్ల గత ఐదేళ్లుగా నిశ్చింతగా బతుకుతున్నారు. మండల కేంద్రానికి అర కిలోమీటర్‌ దూరంలోనే ఉన్న వాగులో వృథాగా పోతున్న నీటిని నిల్వ చేసేందుకు 2018లో రూ.1.54 కోట్లతో 15 ఎకరాల విస్తీర్ణంతో చెక్‌డ్యాంను నిర్మించారు. ఈ చెక్‌డ్యాం వీణవంకతోపాటు, బ్రాహ్మణపల్లి, రెడ్డిపల్లి, రామక్రిష్ణాపూర్‌ గ్రామాల ప్రజలకు తాగు, సాగు నీరు అందిస్తోంది. సుమారు 220 ఎకరాల భూమి దీని కింద సాగవుతోంది. సొంత భూమిలో చెరువు తవ్వించి.. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మున్సిపల్‌ విలీన గ్రామం శ్రీనివాస్‌నగర్‌కు చెందిన పుట్ట బాబు తన పంట పొలంలో 2 ఎకరాల విస్తీరణంలో 15 ఏళ్ల క్రితమే చెరువును తవ్వించి నీటి సంరక్షణ చేపట్టారు. వర్షం నీటితో పాటు ఆరు బోరు బావులతో చెరువును నింపుతున్నాడు. ఈ చెరువు ద్వారా 12 ఎకరాల్లో వర్షాకాలం, యాసంగీ సీజన్లలో వరి పంట సాగుచేస్తున్నాడు. చెరువు గట్టు చుట్టూ కొబ్బరి, మామిడి, సీతాఫలంచెట్లు పెంచి అదనపు ఆదాయం పొందుతున్నాడు. వట్టిపోని వట్టివాగు.. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలంలోని కాట్రపల్లి, వెంకటగిరి, అర్పణపల్లి, ఉప్పరపల్లి, పెనుగొండ గ్రామాల మీదుగా వెళ్లే వట్టివాగు ఇప్పుడు మండు వేసవిలోనూ నిండుకుండలా కనిపిస్తోంది. ఇటీవల యాసంగి పంటల కోసం కొంత ఆలస్యంగా ఎస్సారెస్పీ జలాలను వట్టి వాగులోకి మళ్లించటంతో వెంకటగిరి, అర్పణపల్లి, ఉప్పరపల్లి గ్రామాల పరిధిలో వాగుపై నిర్మించిన చెక్‌ డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో చుట్టుపక్కల వ్యవసాయ బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరిగాయి. 9 చెక్‌డ్యాంలతో నీటి సమస్య దూరం మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని ఊక చెట్టు వాగులో గతంలో నీరు ఉండక భూగర్భ జలాలు అడగంటేవి. గత ప్రభుత్వం ఈ వాగుపై 9 చెక్‌డ్యాంలు నిర్మించటంతో నీటి నిల్వ పెరిగి, చుట్టుపక్కల భూగర్భ జలాల పైపైకి వచ్చాయి. దీంతో సాగు, తాగు నీటి సమస్య దూరమైంది. సమీపంలోని బండ్రపల్లి, పల్లమరి, లాల్‌ కోట, నెల్లికొండి, పెద్ద వడ్డేమాన్, చిన్న వడ్డేమాన్, ఏదిలాపురం, చిన్న చింతకుంట, మద్దూరు, అల్లిపురం, కురుమూర్తి, అమ్మాపురం, గూడూరు, అప్పంపల్లి, ముచ్చింతల తదితర గ్రామాలలో 7,000 ఎకరాలలో రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. వర్షపు నీటిని గుంతల్లో నిల్వ.. నల్లగొండ జిల్లా చండూరులో వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు రైతు పాల్వాయి సత్యనారాయణరెడ్డి తన భూమిలోనే కందకాలు తవ్వించాడు. ఆరేళ్ల క్రితం తనకున్న దాదాపు 100 ఎకరాలలో పలు చోట్ల కందకాలు తవ్వించాడు. గొల్లగూడకు వెళ్లే దారిలో గల 50 ఎకరాలలో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో వర్షపు నీటి గుంతలను తవ్వారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నా ఈ గుంతల్లో నీరు పుష్కలంగా ఉండటం గమనార్హం. ఈ నీటివల్ల భూగర్భ జలాలు పెరిగి పంటకు నీటి కరువు తీరింది. వాననీటిని ఒడిసి పట్టి.. మెదక్‌ జిల్లా రత్నాపూర్‌ గ్రామానికి చెందిన నింబాద్రిరావు అనే రైతు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు సరికొత్త ఆలోచన చేశారు. తన ఏడు ఎకరాల భూమి చుట్టూ స్ట్రెంచ్‌ కొట్టించి, వర్షాకాలంలో పడిన వర్షం నీరు భూమిలోకి ఇంకేలా ఏర్పాట్లు చేశాడు. దీనికి రాళ్లు, సిమెంట్‌ లైనింగ్‌ చేసి నీటిని నిలువ చేస్తున్నాడు. ఈ నీటి ద్వారా ఎండా కాలంలోనూ పంటలకు నీరందేలా ఏర్పాటు చేసుకున్నాడు. డ్రిప్‌ ద్వారా మామిడి పంటకు నీళ్లు పారిస్తున్నాడు. ఒకప్పుడు బీడుగా ఉన్న భూమిని ఇప్పుడు బంగారు పంటలు పండే సారవంతమైన భూమిగా తీర్చి దిద్దుకుని ఆదర్శంగా నిలుస్తున్నాడు. జహీరాబాద్‌ ప్రాంతంలో జలకళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో గతంలో చేపట్టిన వాటర్‌షెడ్‌ పనులు ఇప్పుడు రైతులకు జల సిరులు పారిస్తున్నాయి. ప్రముఖ ఇంజనీర్‌ హన్మంత్‌రావు ఇక్కడ చతుర్విద జల ప్రక్రియను ఆవిష్కరించారు. జహీరాబాద్‌ నియోజకవర్గంలోని గొట్టిగారిపల్లి గ్రామంలో 2001లో వాటర్‌షెడ్‌ పథకానికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా నేడు 30 వేల ఎకరాలకు నీటి కొరత తీరింది. ఏడాది పొడువునా మూడు పంటలు పండుతున్నాయి.

India decides to completely ban imports from Pakistan8
దిగుమతులు బంద్‌

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: పహల్గాం దుస్సాహసానికి ము ష్కరులను ప్రేరేపించిన దాయాదికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పాకిస్తాన్‌ నుంచి దిగుమతులను పూర్తిగా నిషేధిస్తూ భారత్‌ శనివారం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులకూ ఇది వర్తిస్తుంది. ఈ మేరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాక్‌లో ఉత్పత్తయ్యే, ఆ దేశం గుండా ఎగుమతయ్యే అన్ని రకాల వస్తువులు, ఉత్పత్తుల ప్రత్య క్ష, పరోక్ష దిగుమతులను పూర్తిగా నిషేధిస్తున్నట్టు పేర్కొంది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. అంతేగాక పాక్‌ నౌకలకు భారత్‌లోకి అనుమతి నిషేధించింది. ఆ దేశానికి సముద్ర రవాణా మార్గాలను పూర్తిగా మూసేసింది. దీని ప్రభావం కూడా పాక్‌పై తీవ్రంగా ఉండనుంది. ఇక పాక్‌కు అన్నిరకాల పార్సిల్, పోస్టల్‌ సేవలను కూడా సంపూర్ణంగా నిలిపేశారు. ఈ నిర్ణయాలన్నీ తక్షణం అమల్లోకి వచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. పాక్‌కు మన గగనతలాన్ని ఇ ప్పటికే మూసేయడం తెలిసిందే. అంతేగాక సింధూ జల ఒప్పందం నిలిపివేత, పాక్‌ పౌరులకు వీసాల రద్దు వంటి పలు కఠిన చర్యలు కూడా కేంద్రం ఇప్పటికే తీసుకుంది. దివాలా ముంగిట ఉన్న పాక్‌కు ఆర్థికంగా ప్రాణాధారం వంటి 700 కోట్ల ఐఎంఎఫ్‌ రుణాన్ని అడ్డుకునే ప్రయత్నాలకు కూడా పదును పెట్టింది. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాక్‌ను గ్రే లిస్టులో చేర్చి రుణాలు, ఆర్థిక సాయాలు పూర్తిగా నిలిపేయాలని అంతర్జాతీయ సంస్థలకు శుక్రవారం విజ్ఞప్తి చేయడం తెలిసిందే. తద్వారా దాయాది ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేలా కేంద్రం వ్యూహరచన చేస్తోంది. దీనిపై పాక్‌ శనివారం గగ్గోలు పెట్టింది. రాజకీయ దురుద్దేశాలతోనే ఐఎంఎఫ్‌ రుణానికి భారత్‌ మోకాలడ్డుతోందంటూ ఆక్రోశించింది. దిగుమతులు అంతంతే పాక్‌ నుంచి దిగుమతుల నిషేధం ప్రభావం మనపై ఏమీ ఉండదు. పుల్వామా దాడుల నేపథ్యంలో 2019 నుంచే ఆ దేశంతో వాణిజ్య కార్యకలాపాలను భారత్‌ దాదాపుగా తగ్గించుకుంది. గతేడాది దాయాది నుంచి మనం దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ కేవలం 4.2 లక్షల డాలర్లు! ప్రధానంగా సేంద్రియ లవణంతో పాటు ఫార్మా ఉత్పత్తులు, పళ్ల వంటివి వీటిలో ఉన్నాయి. అదే సమయంలో పాక్‌కు మన ఎగుమతుల విలువ ఏకంగా 44.8 కోట్ల డాలర్లుగా ఉంది. పాక్‌ ఉత్పత్తులపై భారత్‌ ఇప్పటికే 200 శాతం విధిస్తోంది. పహల్గాం దాడి నేపథ్యంలో పాక్‌కు అన్ని ఎగుమతులనూ భారత్‌ ఇప్పటికే నిలిపేయడం తెలిసిందే. తొమ్మిదో రోజూ కాల్పులు సరిహద్దుల వెంబడి పాక్‌ దుశ్చర్యలు వరుసగా తొమ్మిదో రోజూ కొనసాగాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం శనివారం కూడా కాల్పులకు తెగబడింది. వాటికి దీటుగా బదులిచి్చనట్టు సైన్యం ప్రకటించింది. పహల్గాంలో 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం వేట సాగుతోంది. కశీ్మర్‌ను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. శనివారం శ్రీనగర్‌లో ఐదుచోట్ల ముమ్మర తనిఖీలు కొనసాగాయి. రెచ్చగొట్టేలా పాక్‌ క్షిపణి పరీక్షలుఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్ర దాడితో అసలే దెబ్బ తిన్న పులిలా ఉన్న భారత్‌ను మరింత రెచ్చగొట్టేలా పాక్‌ వ్యవహరిస్తోంది. ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ క్షిపణి పరీక్షలకు దిగింది. 450 కి.మీ. రేంజ్‌తో కూడిన అబ్దాలీ సర్ఫేస్‌ టు సర్ఫేస్‌ బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థను పరీక్షించినట్టు పాక్‌ సైన్యం శనివారం ప్రకటించుకుంది. పైగా, ఇది ‘సింధూ విన్యాసా’ల్లో భాగమంటూ గొప్పలకు పోయింది. ఇది అద్భుతమంటూ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ, ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ సైన్యాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఈ ఉదంతంపై భారత్‌ మండిపడింది. దీన్ని కచ్చితంగా రెచ్చగొట్టే చర్యగానే పరిగణిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ‘సింధూ’ నిర్మాణాలను పేల్చేస్తాం పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ప్రేలాపనలు ఇస్లామాబాద్‌: సింధూ నదీ వ్యవస్థపై భారత్‌ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా పేల్చేస్తామంటూ పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ప్రేలాపనలకు దిగారు. వాటిని తమపై దురాక్రమణ చర్యగానే పరిగణిస్తామన్నారు. ‘‘నదీ జలాలను ఆపేస్తే మేం ఆకలిదప్పులతో అలమటిస్తాం. అందుకే అలాంటి పరిస్థితి రానివ్వబోం’’అని చెప్పుకొచ్చారు. సింధూ ఒప్పందం నిలిపివేతపై అంతర్జాతీయ వేదికలను ఆశ్రయిస్తున్నట్టు చెప్పారు.

YSRCP Public Interest Litigation in High Court on Chandrababu Govt9
రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ చర్యలను అడ్డుకోండి

సాక్షి, అమరావతి: అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న రాజ్యాంగ విరుద్ధ చర్యలపై వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా రూ.9 వేల కోట్లను బాండ్ల రూపంలో సేకరించడంలో భారీ అవకతవకలు ఉన్నాయంటూ ప్రజా ప్రయో­జన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి వచ్చే నిధులను.. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా బాండ్ల కొనుగోలుదారులకు మళ్లించేందుకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి ఈ పిల్‌ వేశారు. రాష్ట్రంలోని 436 మైనర్‌ మినరల్‌ క్వారీల లీజులను, ఖనిజాల హక్కులను పూర్తిగా ఏపీఎండీసీకి నామినేషన్‌ ప్రాతిపదికన అప్పగిస్తూ ప్రభుత్వం ఏప్రిల్‌ 24న జారీ చేసిన జీవో 69ను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఈ జీవో అమలుకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. అలాగే ఏపీఎండీసీ తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ జారీ చేసిన జీవో 33ని కూడా అప్పిరెడ్డి తన వ్యాజ్యంలో సవాల్‌ చేశారు. తన పరిధిలోకి వచ్చిన 436 మైనర్‌ మినరల్‌ క్వారీల లీజులను, ఖనిజాల హక్కులను ఏపీఎండీసీ తన ఆస్తులుగా అప్పు ఇచ్చేవారికి గ్యారెంటీగా చూపనుందని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఏపీఎండీసీ షెడ్యూల్‌ ప్రకారం చెల్లింపులు చేయకపోతే గనులు తాకట్టులో పెట్టుకున్న ప్రైవేటు వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ట్రెజరీ నుంచి డబ్బు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోందన్నారు. గనులను తాకట్టు పెట్టుకున్న వ్యక్తులు ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా ఇతరులకు లీజుకు ఇచ్చేందుకు, అమ్ముకునేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని అప్పిరెడ్డి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.ఇది దోపిడీ కిందకే వస్తుంది..ప్రభుత్వంతో సంబంధం లేకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను నేరుగా బాండ్ల కొనుగోలుదారులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం దారుణం అని అప్పిరెడ్డి అభివర్ణించారు. బాండ్లు కొన్నవారికి చెల్లింపుల నిమిత్తం నిర్దేశిత ఖాతాల్లో మొదటి నెలలోనే 30 శాతం చొప్పున ప్రతి నెల ఉంచాలని, ఏ కారణంతోనైనా ఖజానాలో నిధులు తగ్గిపోతే ఆర్‌బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు నేరుగా బాండ్ల కొనుగోలుదారులకు వెళ్లిపోతాయని చెప్పారు. ప్రైవేటు వ్యక్తులు రాష్ట్ర ట్రెజరీ నుంచి డబ్బులు నేరుగా తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని, ఇలాంటి వెసులుబాట్లు చరిత్రలో ఎప్పుడూ లేవన్నారు. ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ నిధులను విచక్షణారహితంగా దోచిపెట్టడానికే ఈ జీవో తెచ్చారని, ఇది దోపిడీ కిందకే వస్తుందని ప్రజా విశ్వాసానికి, నిర్వర్తించాల్సిన బాధ్యతలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. బాండ్ల జారీతో సహా ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ చర్యలను అడ్డుకోవాలని హైకోర్టును కోరారు.

SBI Q4 Results: Net profit drops 10 Percent to RS 18642. 5 crore10
ఎస్‌బీఐ లాభం రూ. 19,600 కోట్లు

న్యూఢిల్లీ: నికర వడ్డీ మార్జిన్లు క్షీణించిన ప్రభావంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన సుమారు 8 శాతం క్షీణించింది. రూ. 19,600 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 21,384 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 1,64,914 కోట్ల నుంచి రూ. 1,79,562 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 32 బేసిస్‌ పాయింట్లు తగ్గి 3.15 శాతానికి పరిమితమైంది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన చూస్తే లాభం వార్షికంగా రూ. 20,698 కోట్ల నుంచి సుమారు 10 శాతం తగ్గి రూ. 18,642 కోట్లకు చేరింది. మార్చి క్వార్టర్‌లో మొత్తం ఆదాయం రూ. 1,28,412 కోట్ల నుంచి రూ. 1,43,876 కోట్లకు ఎగిసింది. 2024–25కి గాను బ్యాంకు ఒక్కో షేరుపై రూ. 15.90 మేర డివిడెండును ప్రకటించింది. పెట్టుబడులపై టారిఫ్‌ల అనిశ్చితి ప్రభావం.. ‘భారత ఎకానమీపై టారిఫ్‌ల ప్రభావం పెద్దగా ఉండనప్పటికీ, సుంకాలపై అనిశ్చితి కారణంగా ఎకానమీ, అలాగే పెట్టుబడులపై మాత్రం ప్రభావం పడొచ్చు‘ అని ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి తెలిపారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండటంతో తదుపరి మరింతగా రేట్ల కోత ఉండొచ్చని భావిస్తున్నట్లు శెట్టి వివరించారు. తమ రుణాల్లో 27 శాతం భాగం రెపో రేటుతో అనుసంధానమై ఉండటం, ఆర్‌బీఐ రేట్లను తగ్గించే అవకాశాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఐఎంలపై ఒత్తిడి కొనసాగవచ్చని శెట్టి చెప్పారు. నిర్దిష్ట అంశం వల్ల క్రితం ఆర్థిక సంవత్సరం బ్యాంకు లాభం అధికంగా నమోదైందని, దానితో పోల్చి చూస్తే ప్రస్తుతం తగ్గిందని పేర్కొన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో 12–13 శాతం రుణ వృద్ధిని అంచనా వేస్తున్నామన్నారు. టారిఫ్‌ యుద్ధాల ప్రభావం రుణ వృద్ధిపై కూడా పడే అవకాశం ఉందని శెట్టి వివరించారు. వాణిజ్య విధానాల్లో మార్పులతో అంతర్జాతీయ ఎకానమీలో అనిశ్చితి నెలకొన్నందున కంపెనీలు తమ పెట్టుబడుల ప్రణాళికలను నెమ్మదిగా అమలు చేసే అవకాశం ఉందన్నారు. దీనితో బ్యాంకులపరంగా రుణ వృద్ధిపైనా ప్రభావం పడుతుందని శెట్టి చెప్పారు. అసెట్‌ క్వాలిటీ మరింత కాలం మెరుగ్గానే కొనసాగవచ్చన్నారు. 18వేల కొలువులు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ ఏకంగా 18,000 నియామకాలు చేపట్టనున్నట్లు శెట్టి తెలిపారు. దశాబ్దకాలంలోనే ఇది అత్యధికమని ఆయన పేర్కొన్నారు. ఇందులో 13,400 మంది క్లర్కులు, 3,000 ప్రొబేషనరీ ఆఫీసర్లు, 1,600 మంది స్పెషలిస్టు ఆఫీసర్లు (టెక్నాలజీ తదితర విభాగాల్లో) ఉంటారని వివరించారు. మరిన్ని విశేషాలు.. ⇒ పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2024–25) గాను స్టాండెలోన్‌ చూస్తే ఎస్‌బీఐ నికర లాభం 16 శాతం పెరిగి రూ. 61,077 కోట్ల నుంచి రూ. 70,901 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ. 1,11,043 కోట్ల నుంచి రూ. 1,19,666 కోట్లకు పెరిగింది. అసెట్‌ క్వాలిటీ కూడా మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) పరిమాణం 2024 మార్చి ఆఖరు నాటికి 2.24 శాతంగా ఉండగా తాజాగా 1.82 శాతానికి తగ్గింది. నికర ఎన్‌పీఏలు సైతం 0.57 శాతం నుంచి 0.47 శాతానికి తగ్గాయి. ⇒ 2025–26లో క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్విప్‌)/ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీవో) లేదా ఇతరత్రా మార్గాల్లో ఏకమొత్తంగా లేదా విడతలవారీగా రూ. 25,000 కోట్ల వరకు మూలధనం సమకూర్చుకునే ప్రతిపాదనకు ఎస్‌బీఐ బోర్డు ఆమోదముద్ర వేసింది. ⇒ ప్రస్తుతం ఎస్‌బీఐ కార్పొరేట్‌ రుణాల పైప్‌లైన్‌ (ఇప్పటికే మంజూరైనా ఇంకా విడుదల చేయాల్సినవి, భవిష్యత్‌ అవసరాల కోసం సంప్రదింపుల దశలో జరుపుతున్నవి) రూ. 3.4 లక్షల కోట్లుగా ఉన్నాయి. మౌలిక రంగం, రెన్యువబుల్‌ ఎనర్జీ, డేటా సెంటర్లు, కమర్షియల్‌ రియల్టీ సెగ్మెంట్ల నుంచి రుణాలకు డిమాండ్‌ నెలకొంది. మార్చి త్రైమాసికంలో కార్పొరేట్‌ రుణాల వృద్ధి 9 శాతానికి పరిమితం కాగా, రిటైల్‌ వ్యక్తిగత రుణాలు 11 శాతం పెరిగాయి. ఇందులో గృహ రుణాల వృద్ధి 14 శాతంగా ఉంది. ⇒ అన్‌సెక్యూర్డ్‌ పర్సనల్‌ రుణాల విభాగంలో పెద్దగా సవాళ్లేమీ లేనందున దీనిపై బ్యాంకుపై మరింతగా దృష్టి పెట్టనుంది. భారీ కార్పొరేట్‌ లోన్ల విషయంలోనూ సమస్యేమీ లేకపోవడంతో మరికొన్నాళ్ల పాటు అసెట్‌ క్వాలిటీ మెరుగ్గానే కొనసాగవచ్చు. మొండి పద్దుల నిష్పత్తి రెండు శాతం లోపే కొనసాగవచ్చు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement