
మాధవ్ శింగరాజు
అక్బర్ రోడ్డులోని పార్టీ ఆఫీసులో ఖర్గేజీ, నేను, ‘ఇంకా కొందరం’ సమావేశమై ఉన్నాం. నిజానికి, ఆ ‘ఇంకా కొందరం’ అనేవాళ్లలో కొందరింకా రానే లేదు. ఆ రానివాళ్ల కోసం చూడటం మానేసి, ఖర్గేజీ మాట్లాడటం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను నేను. ఖర్గేజీ ఎంతకూ మాట్లాడటం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు కాకముందు ఆయన ఎలాగైతే ఉన్నారో, కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. ఖర్గేజీ వింతగా మెరిసే వజ్రంలా అనిపిస్తారు నాకెందుకో! బహుశా మా ఇద్దరిదీ ఒకే రాష్ట్రం కావటం వల్లనేమో!
వజ్రం మాట్లాడదు. ఊరికే మెరుస్తూ ఉంటుంది. మాట్లాడని ‘ఖర్గే’ అనే ఈ కాంగ్రెస్ వజ్రాన్ని చూసి ఏ పార్టీ వాళ్లయినా ఎంతో కొంత నేర్చుకోవలసింది తప్పక ఉంటుందని నాకొక నమ్మకం. ముఖ్యంగా మోదీ... ఖర్గేజీని చూసి మౌనంగా ఎలా ఉండాలో, లేదంటే మితంగా ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి.
ప్రధాని ఎంత మితంగా మాట్లాడితే దేశం అంత ప్రశాంతంగా ఉంటుంది. పెద్దాయన చూసుకుంటాడులే అని ప్రజలు ధీమాగా ఉంటారు. పెద్దాయన కూడా మన పొరుగింటి ఆయనలా మాట్లాడేస్తుంటే పాకిస్తాన్‌కు ఏం భయం ఉంటుంది? పాకిస్తాన్‌కు చైనా ఎందుకు సపోర్ట్ చేయకుండా ఉంటుంది?
దేశానికి మోదీజీ పెద్దాయన అయితే,కాంగ్రెస్‌కు ఖర్గేజీ పెద్దాయన. రాహుల్ బాబు, ఆయన బావగారు రాబర్ట్ వాద్రా ఎప్పుడైనా మితం తప్పి మాట్లాడినా, ఖర్గేజీ తన మౌనంతో బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. మౌనంతో ఏదైనా బ్యాలెన్స్ అవుతుంది. అతీ బ్యాలెన్స్ అవుతుంది, మితమూ బ్యాలెన్స్ అవుతుంది.
‘‘విన్నారా ఖర్గేజీ?’’ అన్నాను, ఆయన్ని నా వైపు తిప్పుకునే ప్రయత్నంగా. ‘‘ఏమిటి వినటం?’’ అన్నట్లు చూశారు. ‘‘డెడ్ లైన్ లు చెప్పకుండా మోదీజీ హెడ్ లైన్‌లు చెప్పేస్తున్నారు! దెబ్బకు దెబ్బ అంటున్నారు. ఆ దెబ్బ ఎప్పుడో చెప్పటం లేదు. జనాభా లెక్కలతో పాటే కులాల లెక్కలు అంటున్నారు. ఆ జనాభా లెక్కలు ఎప్పుడో చెప్పటం లేదు’’ అన్నాను.
‘‘చెప్పవలసినవి ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి’’ అన్నారు రాహుల్ బాబు లోనికి ప్రవేశిస్తూ. ఆ వెనుకే ప్రియాంక. ఖర్గేజీ వారిద్దరి వైపూ చూశారు కానీ మాటలతో ఏమీ స్పందించలేదు. అలాగని మౌనంతోనూ స్పందించలేదు. ప్రియాంక పార్టీ జనరల్ సెక్రెటరీగా ఉండి, మీటింగ్‌కి లేట్‌గా రావటం ఆయనకు నచ్చినట్లు లేదు.
‘‘సారీ ఖర్గేజీ... రేఖాగుప్తా సీఎం అయ్యాక ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది. అక్బర్ రోడ్డులో అయితే మరీ ఘోరం. అందుకే మీటింగ్‌కి లేటైంది’’ అన్నారు ప్రియాంక. రాహుల్ సెల్ ఫోన్ చూసుకుంటూ వచ్చి, దొరికిన కుర్చీలో కూర్చొని, ‘‘చెప్పవలసినవి ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి’’ అని మళ్లీ అన్నారు మోదీ గురించి.
‘‘అవును రాహుల్‌జీ, దేశంలో కులగణన చేయించాలని మనం డిమాండ్ చేస్తున్నందుకు మోదీ మనల్ని అర్బన్ నక్సలైట్లు అన్నారు. ఇన్నాళ్లకు వాళ్లూ మన దారిలోకి వచ్చి కులగణన అంటున్నారు. మరి వాళ్లెప్పటి నుండి అర్బన్ నక్సలైట్ అయ్యారో’’ అన్నాను.
అంతా నవ్వారు. ఖర్గేజీ నవ్వలేదు!
‘‘ఇప్పుడైనా... అదే పనిగా కాకుండా, పనిలో పనిగా మాత్రమే కులగణనను చేయిస్తామంటున్నారు’’ అన్నారు రాహుల్.
‘‘అది నిజమే కానీ...’’ అని ఆగారు... ఖర్గేజీ హఠాత్తుగా మౌనం వీడి!
అందరం ఖర్గేజీ వైపు చూశాం.
‘‘... వాళ్లు చేయాలనుకుంటున్నది జనగణనలో భాగంగా కులగణన కాదు. కులగణనలో భాగంగా జనగణన. నేరుగా కులగణన అంటే రాహుల్‌కి క్రెడిట్
దక్కుతుందని జనగణనలో భాగంగా కులగణన అంటున్నారంతే’’ అన్నారు ఖర్గేజీ!!
వజ్రం లాంటి మాట!
ఆ మాటతో మా మీటింగ్ మొదలైంది.