
ఆకట్టుకుంటున్న పట్టాభిషక్తుడైన శివాజీ, మంత్రి మండలి కాంస్య విగ్రహాలు
జీవితచరిత్రపై ఫైబర్ మెటీరియల్‌తో త్రీడీ చిత్రాలు
రాజస్థాన్ మెటీరియల్‌తో ‘శివాజీ ధ్యాన కేంద్రం’ నిర్మాణం
శ్రీశైలం టెంపుల్: శ్రీగిరిలో వెలసిన మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు క్షేత్ర పరిధిలో సందర్శించే స్థలాల్లో శివాజీ స్ఫూర్తి కేంద్రం ఒకటి. దక్షిణ భారత దేశంపై దండయాత్రకు వచ్చిన మొఘలు చక్రవర్తులను మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ తరిమికొట్టారు. ఆయనకు శ్రీశైల క్షేత్రానికి ఎంతో అనుబంధం ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1630లో జన్మించగా హిందూ సామ్రాజ్య స్థాపన కోసం తన 16వ ఏటా నుంచి యుద్ధాలు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా 1677లో దక్షిణ భారతదేశం నుంచి దండయాత్ర మొదలు పెట్టి ముందుగా శ్రీశైలం చేరుకున్నారు. స్వతహాగా అమ్మవారి భక్తుడైన ఆయన అమ్మవారి దర్శనార్థం శ్రీశైలంలోనే 10 రోజుల పాటు బస చేశారు.

శ్రీశైలంలో ప్రస్తుతం నిర్మించిన ధ్యాన కేంద్రం ప్రదేశంలో ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేసుకుని ధ్యానం చేశారు. ఆయన సాధనకు మెచ్చిన భ్రమరాంబాదేవి సాక్షాత్కరించి దివ్య ఖడ్గాన్ని శివాజీకి ప్రసాదించారని, అందుకు సాక్షంగా ఇప్పటికీ శ్రీశైల ఆలయ ప్రాంగణంలో విగ్రహం కూడా ఉంది. శ్రీశైల ఆలయ ఉత్తర గోపురాన్ని శివాజీ 1677లో శ్రీశైలయానికి వచ్చినప్పుడు తన సైన్యంతో నిర్మించారని తెలుస్తోంది. రామచంద్ర పంత్ అనే తన మంత్రిని సుమారు 2 ఏళ్ల పాటు శ్రీశైలంలోనే ఉంచి గోపుర నిర్మాణాన్ని పూర్తి చేయించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. శివాజీ ధ్యానం చేసిన ప్రాచీన కట్టడం శిథిలం కావడం అక్కడే శివాజీ ధ్యాన మందిరాన్ని నిర్మించారు. ఛత్రపతి శివాజీ బస చేసిన ప్రదేశంలో ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు.
శివాజీ స్ఫూర్తి కేంద్రం విశేషాలు ఇవి..
1975లో శ్రీ శివాజీ మెమోరియల్ కమిటీ ఏర్పాటయ్యిది. 1983లో శివాజీ స్ఫూర్తి కేంద్రానికి అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంత దాదా పాటిల్ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి అంచలంచెలుగా నిర్మిస్తూ వచ్చారు. 1994లో పట్టాభిషక్తుడైన శివాజీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2004లో నిర్మాణాలు అన్ని పూర్తయి భక్తులకు అందుబాటులోకి వచ్చింది.

ఈ కేంద్రంలో పట్టాభిషిక్తుడైన ఛత్రపతి శివాజీ (Chatrapati Shivaji) క్యాంస విగ్రహం ఏర్పాటు చేశారు. అలాగే 10 మందితో కూడిన శివాజీ మంత్రి మండలి సాక్షాత్కరించేలా దర్బార్ నెలకొల్పారు. శివాజీ జీవిత చరిత్రను పర్యాటకులు తెలుసుకునేలా ఫైబర్ మెటీరియల్‌తో 23 బ్లాక్‌లలో త్రీడీ చిత్రాలు ఏర్పాటు చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కనడ భాషలలో జీవిత చరిత్ర విశేషాలను వివరించారు.
దర్బార్ హాల్పక్కనే శివాజీ ధ్యానం చేసుకున్న ప్రదేశంగా ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. ధ్యాన కేంద్రాన్ని పూర్తి రాజస్థాన్ మెటీరియల్‌తో నిర్మించారు. ఈ మందిరం పెద్ద కోటను తలపిస్తుండడంతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ధ్యాన కేంద్రంలో శివాజీ ధాన్య ముద్రలో ఉన్న విగ్రహంతో పాటు శివాజీ వినియోగించిన ఖడ్గాన్ని చూడవచ్చు.
శివాజీ కాంస్య విగ్రహాన్ని ముంబాయిలో తయారు చేయించారు. జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ (శిల్పాలు తయారు చేసే) కళాశాలలో ఈ విగ్రహాన్ని ఖాన్ విల్ ఖర్ అనే శిల్పి తయారు చేశారు. ఛత్రంతో కలిపి 12 అడుగుల ఎత్తుతో, 4.5 టన్నుల బరువుతో ఈ కాంస్య విగ్రహాన్ని తయారు చేయించారు.
శివాజీని ఎప్పుడు గుర్రం పైనే చూస్తాం. కానీ శ్రీశైలంలో మాత్రం సింహాసనంపై కూర్చుని, శివాజీ ధరహాసంతో కనిపిస్తారు. శివాజీపైన (ఛత్రం) గొడుగు ఉండడం విశేషం.
చదవండి: సజీవ కళ.. ఆదరణ లేక!
2021లో పుణేకు చెందిన చిత్ర కల్పక్ శిల్ప కళాశాలలో దర్బార్‌హాల్‌లో శివాజీ జీవిత విశేషాలతో ఫైబర్ మెటీరియల్‌తో త్రీడీ పిక్చర్స్‌ను తయారు చేయించి ఏర్పాటు చేశారు.