‘పెగాసస్‌’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు | Nothing wrong Supreme Court on Pegasus row | Sakshi
Sakshi News home page

‘పెగాసస్‌’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Published Tue, Apr 29 2025 2:09 PM | Last Updated on Tue, Apr 29 2025 3:48 PM

Nothing wrong Supreme Court on Pegasus row

న్యూఢిల్లీ: పెగాసస్‌ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్‌(Spyware)ను కలిగి ఉండటం తప్పులేదని పేర్కొంది. అయితే.. అది ఎలా? ఎవరిపై ఉపయోగించారనే విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

దాదాపు నాలుగేళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్‌ను వినియోగించి దేశంలోని ప్రముఖ పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. పెగాసస్‌ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. 

పిటిషన్‌ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందా? లేదా? అనే విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతేగాక, ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపి సాంకేతిక నిపుణుల బృందం నివేదిక కోసం సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఆదేశించిందని, ఇప్పటివరకూ ఆ నివేదిక అందలేదని, దానిని బయట పెట్టాలని ధర్మాసనాన్ని కోరారు. 

జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌తో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. దేశం స్పైవేర్‌ను వినియోగిస్తే గనుక అందులో తప్పేముంది. అయితే, దాన్ని ఎవరిపైన ఉపయోగిస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. పౌర సమాజంపై కాకుండా.. దేశ వ్యతిరేక శక్తులపై దీన్ని వినియోగిస్తే గనుక అందులో ఏ తప్పు లేదు. దేశ భద్రత విషయంలో రాజీపడకూడదు. 

ఒకవేళ సామాన్య పౌరులపై ఉపయోగిస్తే గనుక దాని గురించి మేం దర్యాప్తు జరిపిస్తాం. ఉగ్రవాదులు గోప్యత హక్కును కోరకూడదు. అయితే, సామాన్య పౌరుల గోప్యతకు మేం తప్పకుండా రక్షణ కల్పిస్తాం. ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు(పహల్గాం ఉగ్రదాడి ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ..). కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’’ అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

ఇక, సాంకేతిక బృందం నివేదిక గురించి మాట్లాడుతూ.. ‘‘దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన నివేదికను బహిర్గతం చేయడం సరికాదు. ఒకవేళ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే.. వారికి సమాచారం అందిస్తాం’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

పెగాసస్‌ వ్యవహారం ఏంటంటే.. 
ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అనే సంస్థ ‘పెగాసస్‌’ స్పైవేర్‌ని అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్‌ను ఎన్‌ఎస్‌వో పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ అధీనంలో పనిచేసే సంస్థలకు విక్రయిస్తుంటుంది. అయితే, ఈ పెగాసస్‌ను ఉపయోగించి పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖుల ఫోన్లను హ్యాక్‌ చేశారంటూ 2021లో ఓ అంతర్జాతీయ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. భారత్‌ నుంచి 300 మంది ఫోన్లు హ్యాక్‌ అయినట్లు పేర్కొంది. వీరిలో రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలిపింది. దీంతో ఈ వివాదం దేశ రాజకీయాలను కుదిపేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement