
భద్రాద్రి కొత్తగూడెం,సాక్షి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రోటోకాల్ రగడ అధికార కాంగ్రెస్‌లో చర్చాంశనీయంగా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ కరువైంది. దమ్మపేట మండలం పూసికుంటలో మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పర్యటనలో గిరిజన ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు అవమానం జరిగింది.
కోట్లాది రూపాయల పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు ఆహ్వానం అందలేదు. అధికారులు సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యేని పట్టించుకోలేదు. ఆహ్వానం అందకపోయినా కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల సమక్షంలో అధికారుల తీరుపై జారే మండిపడ్డారు. తీవ్ర ఆవేదనతో మాట్లాడారు. ఎమ్మెల్యే చచ్చిపోయాడనుకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో శంకుస్థాపన నిలిపివేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..ఎమ్మెల్యే జారె ఆదినారాయణను సముదాయించేందుకు తన కారులోకి తీసుకెళ్లారు. ఎలాగోలా సముదాయించి ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో శంకుస్థాపన చేయించారు. అయినప్పటికీ ఎమ్మెల్యే జారె వర్గీయులు వెనక్కి తగ్గలేదు. అధికారుల నిర్లక్క్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.