
క్రెడిట్ కార్డు లిమిట్ పెంపు పేరుతో సైబర్ మోసాలు
ఫోన్‌కాల్స్, ఈ మెయిల్స్ ద్వారా వివరాలు అడిగి దోపిడీ
కార్డు నంబర్, సీవీవీవివరాలు అడిగితే ఇవ్వద్దు
వినియోగదారులకు పోలీసుల సూచన
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలు, డబ్బు సర్దుబాటు కోసం ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు వాడకం సర్వసాధారణంగా మారింది. అయితే, క్రెడిట్ కార్డుల వాడకంలో వినియోగదారుల్లో ఉన్న అవగాహన లేమిని ‘సొమ్ము’చేసుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. మీ క్రెడిట్‌కార్డు లిమిట్‌ను పెంచుతామని, మీ పేరిట ఫలానా ఆఫర్లు వచ్చాయని, మీ క్రెడిట్‌కార్డు ప్రొటెక్షన్‌ను ఎనేబుల్ చేసుకునేందుకు వివరాలు ఇవ్వాలని, కేవైసీ అప్‌డేట్ చేసుకోకపోతే క్రెడిట్‌కార్డు పనిచేయదని.. ఇలా ఎన్నో రకాలుగా వినియోగదారులను ఫోన్‌కాల్స్‌లో బెదిరించే ఘటనలు పెరుగుతున్నాయి.
ఇవన్నీ సైబర్ నేరగాళ్ల మోసపూరిత కాల్స్ అని, కస్టమర్ కేర్ నుంచి క్రెడిట్‌కార్డు కంపెనీ చేసే నిజమైన కాల్స్ కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. క్రెడిట్‌కార్డు లిమిట్ పెంచుతామని వచ్చే ఫోన్‌కాల్స్ నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు. ఇలాంటి అనుమానాస్పద ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు వస్తే వెంటనే మీ బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
ఈ మోసాల నుంచిఎలా రక్షించుకోవాలి?
» ఫోన్‌కాల్స్ ద్వారా లేదంటే ఈమెయిల్స్ ద్వారా వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని అడిగితే అది సైబర్ మోసగాళ్ల పనే అని అనుమానించి జాగ్రత్తపడాలి.
» మీ క్రెడిట్ కార్డు వివరాలు, పిన్ నంబర్, సీవీవీ లేదా ఓటీపీని ఎవరికీ చెప్పవద్దు.
» ఈ వివరాలు బ్యాంకు ప్రతినిధుల పేరిట కాల్ చేసి అడిగితే అస్సలే ఇవ్వవద్దు.
» మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి.
» ఈ–మెయిల్‌లు లేదా ఎస్‌ఎంఎస్‌లలో అనుమానాస్పద లింక్‌లు లేదాఅటాచ్‌మెంట్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాటిపై క్లిక్ చేయవద్దు.
» మీ ఆన్‌లైన్ బ్యాంకు ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలి.