
ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సీఈఓల గురించి తెలుసుకునే చాలామంది.. మొదట సెర్చ్ చేసే విషయం జీతమే. ఎందుకంటే వారి వేతనాలు కోట్ల రూపాయల్లో ఉంటాయి. ఇప్పుడు తాజాగా 2024లో సుందర్ పిచాయ్ జీతానికి సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆల్ఫాబెట్ 2025 ప్రాక్సీ స్టేట్‌మెంట్ ప్రకారం, సుందర్ పిచాయ్ వేతనం 2024లో 10.73 మిలియన్ డాలర్లు (రూ. 91.4 కోట్లు). ఇందులో ఎక్కువ భాగం స్టాక్ అవార్డ్స్, ఇతర పరిహారాల రూపంలో అందింది. కాగా ఈయన బేసిక్ శాలరీ 2 మిలియన్ డాలర్లు (రూ. 17.04 కోట్లు). సాధారణ ఉద్యోగి జీతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 2023లో పిచాయ్ వేతనం 8.8 మిలియన్ డాలర్లు మాత్రమే.
జీతం విషయం పక్కన పెడితే.. సుందర్ పిచాయ్ భద్రత కోసం ఆల్ఫాబెట్ కంపెనీ ఏకంగా 8.27 మిలియన్ డాలర్లను (రూ. 70.45 కోట్లు) ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఏడాది సంస్థ భద్రత కోసం చేసిన ఖర్చు 6.78 మిలియన్ డాలర్లు. అంటే సెక్యూరిటీ కోసం.. కంపెనీ అంతకు ముందు సంవత్సరం కంటే 22 శాతం ఎక్కువ ఖర్చు చేసింది.
ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..
కంపెనీ అందించే భద్రతా ప్యాకేజీలో.. ఇంటి నిఘా, ప్రయాణ రక్షణ, వ్యక్తిగత డ్రైవర్లు వంటివన్నీ ఉంటాయి. అయితే దీనిని సంస్థ సుందర్ పిచాయ్ వ్యక్తిగత ప్రయోజనంగా కాకుండా.. ఉద్యోగ భద్రతలో భాగంగానే భావిస్తుంది. నిజానికి, సీఈఓ సుందర్ పిచాయ్ జీతం సగటు ఉద్యోగి జీతం కంటే దాదాపు 32 రెట్లు ఎక్కువ.