
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ కోలుకున్నారు. ఇవాళ బాలుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అనంతరం బాలుడిని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. అయితే ప్రస్తుతం శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని.. 15 రోజుల నుంచి లిక్విడ్స్ నోటి ద్వారా తీసుకుంటున్నాడని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ వెల్లడించారు. మనుషుల్ని గుర్తు పట్టట్లేదని.. ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ 4 నెలల 25 రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 146 రోజుల తర్వాత డిశ్చార్జ్ అవుతున్నారు. శ్రీ తేజకు 15 రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించి ఇంటికి తీసుకెళ్లొచ్చవని వైద్యులు సూచించారు.
గతేడాది డిసెంబర్‌లో ఘటన
కాగా.. గతేడాది డిసెంబర్ 4న పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ తన కుటుంబంతో కలిసి అల్లు అర్జున్‌ను చూసేందుకు వెళ్లింది. అయితే విపరీతమైన క్రౌడ్ రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్‌కు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌ను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.