
సమస్యలు పరిష్కారమయ్యే వరకు పనులు జరగనివ్వం
వేముల : టైలింగ్ పాండ్‌తో తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు పనులను జరగనివ్వబోమని కె.కె.కొట్టాల గ్రామస్తులు పట్టుబట్టారు. టైలింగ్ పాండ్ వద్ద సోమవారం ఉద్యోగాలు, పరిహారంపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పనులను అడ్డుకుంటామని వారు నిరసన తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టులో ముడి పదార్థాన్ని శుద్ధి చేయగా, వచ్చే వ్యర్థాలను కె.కె.కొట్టాల గ్రామ సమీపంలోని టైలింగ్ పాండ్‌కు తరలిస్తున్నారు. ఈ టైలింగ్ పాండ్ నిండు దశకు చేరుకుంది. దీంతో యురేనియం అధికారులు టైలింగ్ పాండ్ ఎత్తు పెంచే పనులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దీంతో కె.కె.కొట్టాల గ్రామస్తులు టైలింగ్ పాండ్ వద్ద నిరసనకు దిగారు. తమ గ్రామాన్ని, పొలాలు తీసుకుని పరిహారంతోపాటు ఉద్యోగాలు ఇవ్వాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. అంతేకాక గత రెండు రోజులుగా రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా సర్వే చేసి.. తమ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కె.కె.కొట్టాల గ్రామాన్ని, పొలాలను తీసుకుని పరిహారంతోపాటు ఉద్యోగాలు ఇస్తామని యూసీఐఎల్ స్పష్టమైన హామీ ఇవ్వాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. అప్పటి వరకు టైలింగ్ పాండ్ ఎత్తు పెంచే పనులు జరగనివ్వబోమని వారు తెగేసి చెప్పారు.
టైలింగ్ పాండ్ వద్ద గ్రామస్తుల నిరసన