
ఈ–నామ్ పద్ధతి మాకొద్దు
● వ్యాపారులతో యార్డు సెక్రటరీ కుమ్మక్కు
● నష్టపోతున్నామని చీనీ రైతుల ఆందోళన
పులివెందుల రూరల్ : ఈ–నామ్ పద్ధతి మాకొద్దంటూ చీనీ రైతులు ఆందోళన చేపట్టారు. సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సెక్రటరీ శ్రీధర్‌రెడ్డి ఈ–నామ్ పద్ధతిలో చీనీ కాయల వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో చీనీ కాయల ధర తక్కువగా పలుకుతుండటంతో.. ఇలాగైతే తాము నష్టపోతామని రైతులు వ్యాపారస్తులను, మార్కెట్ యార్డు సిబ్బందిని ప్రశ్నించారు. ఎప్పుడూ లేని విధంగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ–నామ్ పద్ధతి ద్వారా ఎలా వేలం పాట నిర్వహిస్తారని రైతులు ప్రశ్నించారు. దీంతో మార్కెట్ యార్డ్ సెక్రటరీ, రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మార్కెట్ యార్డ్ సెక్రటరీ శ్రీధర్‌రెడ్డి వ్యాపారస్తులతో కుమ్మకై ్క తమకు అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. తమకు ముందు పద్ధతిలోనే వేలం పాట నిర్వహించాలన్నారు. వ్యాపారస్తులతో ఇప్పటికే చాలా వరకు నష్టపోయామని, ఇలా నష్టపరిచే బదులు కాస్త విషమిస్తే తాగి చచ్చిపోయేది మేలు అన్నారు. ఇదిలా ఉంటే వ్యవసాయ మార్కెట్ యార్డ్ సెక్రటరీ ‘అంతా మా ఇష్టం మేము చెప్పినట్లే వినాలి మీరు చెప్పినట్లు వినమంటూ’ చీనీ రైతులను బెదిరించారు. దీంతో కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోపోద్రిక్తులైన రైతులు మార్కెట్ యార్డు సెక్రటరీ కార్యాలయానికి తాళాలు వేశారు. సీఐ సీతారామిరెడ్డి చీనీ కాయల మార్కెట్‌కు చేరుకుని రైతులను శాంతింపచేసి సంప్రదింపులు జరిపారు. ఈ–నామ్ పద్ధతిలో వేలంపాట నిర్వహిస్తామని, తమకు ముందే సమాచారం ఇస్తే మార్కెట్‌కు చీనీ కాయలను తీసుకొచ్చేవారం కాదని, వ్యాపారస్తులతో సెక్రటరీ మాట్లాడుకుని తమకు నష్టం వచ్చే విధంగా చూస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ సీతారామిరెడ్డి జోక్యం చేసుకోవడం వల్ల వ్యాపారస్తులు, రైతులు సమస్యల సర్దుమణగడంతో యథావిధిగా చీనీ కాయల వేలం పాట నిర్వహించారు.