అధిక వడ్డీ.. తీస్తోంది ప్రాణం | - | Sakshi
Sakshi News home page

అధిక వడ్డీ.. తీస్తోంది ప్రాణం

Oct 7 2025 4:17 AM | Updated on Oct 7 2025 4:17 AM

అధిక

అధిక వడ్డీ.. తీస్తోంది ప్రాణం

ప్రొద్దుటూరులో వడ్డీ మాఫియా అరాచకం

అనుమతులు లేకుండానే ఆఫీసుల నిర్వహణ

బలైన ఫైనాన్షియర్‌ వేణుగోపాల్‌రెడ్డి,

శనగల వ్యాపారి ఓబులళరెడ్డి

దాడులు నిర్వహిస్తున్న పోలీసులు

ప్రొద్దుటూరు క్రైం : ధనం మూలం ఇదం జగత్‌.. ఇది మనం ఎప్పటి నుంచో వింటున్న గొప్ప సూక్తి. డబ్బు లేకపోతే ఈ ప్రపంచం మనుగడ సాగించదు, ప్రజలు తమ జీవితాలను కొనసాగించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనది, ఈ ప్రపంచాన్ని నడిపించేదే డబ్బు అని ఈ వాక్యం సూచిస్తుంది. డబ్బున్న వాడికే నేటి ఈ సమాజం గౌరవిస్తోందనేది జగమెరిగిన సత్యం. ఆ డబ్బును ఎలా సంపాదించారనేది ఎవరూ పట్టించుకోరు. అతని వద్ద డబ్బుండటమే ప్రధానం. చాలా మంది ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలనే ధోరణితో అనేక మార్గాలను వెతుకుతున్నారు. వాటిలో వడ్డీ వ్యాపారం ప్రధానమైంది. నేటి సమాజంలో ధర్మ వడ్డీ, తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చే వారు కూడా అక్కడక్కడా ఉన్నారు. ఇలాంటి వాళ్లు ఉండబట్టే అత్యవసర సమయంలో మధ్య తరగతి వర్గాలు, సామాన్యులకు తక్కువ వడ్డీకి డబ్బు సమకూరుతోంది. అయితే ఇలా ధర్మ వడ్డీ, తక్కువ వడ్డీకి అప్పులిచ్చేవారు బహు అరుదని చెప్పొచ్చు. ఇప్పుడు ఎటు చూసినా అమాయకుల అవసరాలను క్యాష్‌ చేసుకుంటూ దందా సాగించే వడ్డీ వ్యాపారులే అఽధికంగా ఉన్నారు. జలగల్లా రక్తం పీల్చే ఇలాంటి వడ్డీ వ్యాపారుల చేతిలో చాలా ప్రాంతాల్లో సామాన్యులు, చిరు వ్యాపారులు బలైపోతున్నారు. ప్రొద్దుటూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో వడ్డీ వ్యాపారులు ఉన్నారు. వీరు ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రధాన రహదారులు, కూడళ్లలో ఫైనాన్స్‌ ఆఫీసులు పెట్టుకొని నిర్వహిస్తున్నారు. ఆయా ఆఫీసుల్లోనే నిత్యం రూ.కోట్లలో లావాదేవీలు నిర్వహిస్తున్నా సంబంధిత అధికారులు కన్నెత్తి కూడా చూడకుండా వారి అక్రమ వడ్డీ వ్యాపారానికి పరోక్షంగా సహకారాలు అందిస్తున్నారు. ఏదైనా ఘటన జరిగిన సందర్భంలో పోలీసులు ఒకటి, రెండు రోజులు హడావుడి చేస్తారు అంతే.

వడ్డీ వ్యాపారానికి బలైన వేణుగోపాల్‌రెడ్డి, ఓబుళరెడ్డి

ప్రొద్దుటూరు, జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఆగడాలకు ఎంతో మంది బలైపోయారు. అయితే పోలీస్‌స్టేషన్‌ల వరకు వచ్చిన ఈ తరహా ఘటనలు కొన్ని మాత్రమే అని చెప్పొచ్చు. వడ్డీకి డబ్బు తీసుకున్న వారు నిత్యం ఎక్కడో ఒక చోట బలైపోతూనే ఉన్నారు. గత నెల 19న ప్రొద్దుటూరులోని బొల్లవరం ప్లాట్‌లలో నివాసం ఉంటున్న ఫైనాన్షియర్‌ వేణుగోపాల్‌రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన హత్యకు వడ్డీకి అప్పులు ఇవ్వడమే కారణమని పోలీసులు నిర్ధారించారు. ఆయన వద్ద అప్పు తీసుకున్న వ్యక్తులు డబ్బు తిరిగి చెల్లించే విషయంలో మనస్పర్థలు రావడమే ఇందుకు ప్రధాన కారణం. అలాగే ఆగస్టు 5న పట్టణంలోని భాకరాపేటకు చెందిన ఉండేల ఓబుళరెడ్డి అనే శనగల వ్యాపారి వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో విష గుళికలు తిని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొన్నేళ్ల క్రితం జిల్లా ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో ఓ వడ్డీ వ్యాపారిని హత్య చేశారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు, తరచూ వడ్డీ వ్యాపారుల వేధింపులకు సంబంధించి పోలీసులకు వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని ప్రొద్దుటూరులోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో వడ్డీ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసుల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆయా ఇళ్లు, ఆఫీసుల్లోని బాకీదారుల ప్రామిసరి నోట్లు, ఇతర పత్రాలను పరిశీలించారు. అప్పు ఇచ్చిన వ్యాపారులు అధిక వడ్డీల కోసం బాకీదారులను ఇబ్బంది పెట్టరాదని, ఇబ్బంది పెట్టినట్లు తమ దృష్టికి వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలో పెద్ద మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్న పలువురు ఫైనాన్షియర్లను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. పోలీసుల దాడులు, హెచ్చరికల నేపథ్యంలో స్థానికంగా కొందరు వడ్డీ వ్యాపారులు కొన్ని రోజుల పాటు తమ కార్యాలయాలకు తాళం వేశారు. కాగా గతంలో ప్రొద్దుటూరుతోపాటు జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులు రుణ గ్రహితలను వేధిస్తున్నట్లు పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. వాటిని పోలీసులు పరిశీలిస్తున్నారు.

ప్రొద్దుటూరులో వడ్డీ మాఫియా ఆగడాలు

రాయలసీమలోనే ప్రొద్దుటూరు వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. బంగారు వ్యాపారంలో రెండో ముంబైగా ప్రొద్దుటూరుకు పేరు. తర్వాత వస్త్ర వ్యాపారాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతాయి. చిన్న చిన్న దుకాణాలైతే లెక్కలేనన్ని ఉన్నాయి. ఆయా దుకాణాల్లో వేల సంఖ్యలో కార్మికులు, గుమస్తాలు పని చేస్తున్నారు. ఇక్కడ రూ. వెయ్యి మొదలుకొని రూ.వందల కోట్లలో అప్పులు ఇచ్చే ఫైనాన్షియర్లు చాలా మందే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని సినీ పరిశ్రమకు ప్రొద్దుటూరు ఫైనాన్షియర్లు ఫైనాన్స్‌ ఇస్తున్నారంటే ప్రొద్దుటూరు రేంజ్‌ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. వ్యాపారాలకు తగ్గట్టుగానే ఇక్కడ వడ్డీ వ్యాపారులు పెద్ద ఎత్తున ఉన్నారు. కొందరు ఇళ్లలోనే ఆఫీసులు పెట్టుకొని వ్యాపారం జరుపుతుండగా.. ఇంకొందరు పట్టణంలోని అనేక ప్రాంతాల్లో విలాసవంతమైన ఆఫీసులు ఏర్పాటు చేసుకొని దందా చేస్తున్నారు. వీటికి ఎలాంటి అనుమతులు లేకున్నా బహిరంగంగా వడ్డీ వ్యాపారం సాగిస్తున్నారు.

రూ.10 నుంచి రూ.15 వరకు వడ్డీ

‘వడ్డీ ముందు గుర్రం కూడా పరుగెత్తలేదు’ అనే సామెత ఎప్పుడో మన తాతలు, ముత్తాతల కాలం నాటిది. ఇప్పటి పరిస్థితులను చూస్తే ‘వడ్డీ ముందు బుల్లెట్‌ ట్రైన్‌ కూడా పరుగెత్తలేదు’ అనే సామెతను చెప్పుకోవాల్సి వస్తోంది. నేడు ధర్మ వడ్డీ అనే మాట మచ్చుకై నా వినిపించదు. అమాయకుల అవసరాలను క్యాష్‌ చేసుకుంటూ వడ్డీ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు వడ్డీ వ్యాపారులు. బాధితుల అత్యవసరాన్ని బట్టి అధిక వడ్డీలు వసూలు చేస్తూ జేబులు నింపుకొటున్నారు. చిరువ్యాపారులే టార్గెట్‌గా చేసుకొని రూ.10–15 వరకు వడ్డీ వసులు చేస్తున్నారు. ఇక అప్పు తీసుకున్న వారు వడ్డీ ఇవ్వడం ఆలస్యమైతే.. వారి నడ్డి విరగొట్టి మరీ వసూ లు చేస్తున్నారు. భౌతిక దాడులకు కూడా వెనకాడటం లేదు. ప్రొద్దుటూరులో క్రికెట్‌ బెట్టింగ్‌, మట్కా, గ్యాంబ్లింగ్‌ పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. వీటిని నిర్వహించే జూదరులకు కొందరు ఫైనాన్షియర్లు రూ.15–20 వడ్డీకి అప్పు ఇస్తున్నారు.

ఆత్మహత్యలకు దారి తీస్తున్న అప్పులు

అవసరానికి అప్పు ఇవ్వడం తప్పుకాదు. కానీ వడ్డీకి అప్పులిచ్చిన వారు వసూలు కోసం అనేక విధాలుగా బలవంతం చేయడంతో వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అవసరాలకు అధిక వడ్డీకి అప్పు తీసుకొని.. తర్వాత తీర్చలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. స్థానికంగా ఉన్న చిరు వ్యాపారులు, రోజు వారి కూలీలు, వివిధ రంగాల్లో పని చేసే కార్మికులు, సామాన్య ప్రజలను వనరులుగా మలుచుకొని వడ్డీ వ్యాపారులు దందాలు సాగిస్తున్నారు. సామాన్యులు, చిరు వ్యాపారులు, రైతులకు పెను శాపంగా మారిన అధిక వడ్డీదారుల నుంచి రక్షించేందుకు ప్రొద్దుటూరు పోలీసు అధికారులు రంగంలోకి దిగారు.

అధిక వడ్డీలకు అప్పులిస్తే చర్యలు

పట్టణంలో ఎవరైనా అధిక వడ్డీలకు అప్పులిస్తే చర్యలు తీసుకుంటాం. రూ.3, రూ.5, రూ. 10 ఇలా ఎక్కువ వడ్డీకి అప్పులిచ్చినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఖాళీ ప్రామిసరి నోట్‌ మీద సంతకం చేయించుకొని డబ్బు ఇవ్వరాదు. డబ్బు వసూలుకు ఇళ్ల వద్దకు రౌడీలను పంపితే తీవ్ర పరిణామాలు తప్పవు. పట్టణంలో అధిక వడ్డీకి అప్పులిచ్చే వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరిస్తున్నాం. వీరిపై ఫిర్యాదులు వస్తే మాత్రం కేసులు నమోదు చేస్తాం.

– పి.భావన, డీఎస్పీ, ప్రొద్దుటూరు

అధిక వడ్డీ.. తీస్తోంది ప్రాణం1
1/1

అధిక వడ్డీ.. తీస్తోంది ప్రాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement