
‘కూలి’న బతుకులు
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు.. బతుకుదెరువు కోసం వలస వెళ్లారు.
దొరికిన పనులతో కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చారు. ఊరిలో జాతర చూసి
తిరుగుపయన మయ్యారు. మార్గంమధ్యలో మృత్యువు వారిని కబళించింది.
కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
రామసముద్రం : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఎర్రబోయినపల్లికి చెందిన దంపతులు కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రబోయినపల్లికి చెందిన రామాంజులు(33), కళావతి(28) దంపతులు బతుకుదెరువు కోసం కర్ణాటక రాష్ట్రం వెళ్లారు. అక్కడ కేఆర్ పురం వద్ద కూలీ పనులు చేసుకుంటుండే వారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం గ్రామంలో అమ్మవారి జాతర ఉండటంతో ఇద్దరు పిల్లలను అక్కడే ఇంటి యజమాని వద్ద వదిలి.. సొంత గ్రామానికి వచ్చారు. జాతర ముగించుకుని సోమవారం ద్విచక్ర వాహనంలో కర్ణాటకకు వెళ్లే నేపథ్యంలో.. కళావతికి ఆరోగ్యం బాగలేకపోవడంతో మదనపల్లికి చేరుకుని చికిత్స చేయించుకుని కర్ణాటకకు బయలుదేరారు. మార్గంమధ్యలోని రాయల్పాడు వద్ద టిటి వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. వారి మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం శ్రీనివాసపురం ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బతుకుదెరువు కోసం వెళ్లి
కర్ణాటకలో మృత్యువాత
రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు
దుర్మరణం
శోకసంద్రంలో కుటుంబం

‘కూలి’న బతుకులు

‘కూలి’న బతుకులు