
కూలిన మట్టి మిద్దె
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పురపాలక సంఘం పరిధిలోని వినాయకనగర్ కాలనీలో నివాసం ఉండే షేక్ గౌసియా ఇంటిపై కప్పు వర్షం వల్ల మట్టి తడిసి దూలాలు విరిగి పోయి సోమవారం తెల్లవారుజామున కూలి పోయింది. ఆ సమయంలో గౌసియా ఇంటిలో లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సందర్భంగా బాధితురాలికి న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మాడిశెట్టి శివకుమార్ వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించి తహసీల్దార్ శోభన్‌బాబుకు ఆధారాలతో కూడిన వినతి పత్రం అందించారు. బాధితురాలు బాడుగ ఇంటిలో ఉంటుందని, మిద్దె కూలడంతో ఇంటిలోని విలువైన సామగ్రితోపాటు సరుకులు దెబ్బతిన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు సూర్యమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భార్యపై భర్త దాడి
మదనపల్లె : భార్యపై భర్త దాడి చేసిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక శేషప్పతోటలో కాపురం ఉంటున్న కేవీ రమణ భార్య శశికళ (50) గత 20 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. పిల్లలకు వివాహమై స్థిరపడ్డారు. ఈ క్రమంలో తరచూ కేవీ రమణ భార్య కోసం ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. వారి మధ్య ఏం జరిగిందో కానీ ఉదయం శశికళ వంట చేస్తుండగా భర్త, మరిది దాడి చేసి గాయపరిచారు. బాధితురాలిని స్థానికులు వైద్యం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కారు ఢీకొని రైతు దుర్మరణం
కురబలకోట : మండలంలోని దొమ్మన్నబావి సర్కిల్ వద్ద సోమవారం కారు ఢీకొన్న సంఘటనలో తూగువారిపల్లెకు చెందిన రైతు రఘునాథరెడ్డి (55) దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని తూగువారిపల్లెకు చెందిన రఘునాథరెడ్డి మరో ఇద్దరితో కలసి మోటార్ సైకిల్‌పై అంగళ్లు వైపు రాసాగాడు. దొమ్మన్నబావి సర్కిల్ వద్ద బైపాస్ మీదుగా వేగంగా వస్తున్న కారు వీరిపైకి ఒక్కసారిగా దూసుకు వచ్చింది. వేగంగా ఢీకొంది. దీంతో రైతుకు తీవ్ర గాయాలై రెప్పపాటులోనే అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెనుక కూర్చుని వస్తున్న మరో ఇద్దరికి గాయాలు కాగా వారు కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
యువకులకు గాయాలు
రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని అనంతరాజుపేట కట్టాపుట్టాలమ్మ ఆలయం వద్ద ప్రధాన రహదారిపై బొమ్మవరానికి చెందిన వెంకటరమణ, శంకర సోమవారం రాత్రి ద్విచక్రవాహనంలో వెళ్తుండగా తిరుపతికి వెళ్తున్న కారు ఢీకొని తీవ్ర గాయాలు పాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు.