కడప అర్బన్ : కడప నగర వినాయక నగర్ సర్కిల్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే కడప ట్రాఫిక్ సీఐ డీకే జావీద్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వల్లూరు మండలం బీచ్ వారిపల్లి గ్రామానికి చెందిన ఇరగబోయిన రామ్మోహన్ (39) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 14 ఏళ్ల క్రితం ఆయనకు వివాహం కాగా భార్య, ఇరువురు ఆడబిడ్డలు ఉన్నారు.
ఉదయం 11:30 గంటలకు ఇంటి నుంచి కడపకు ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. వినాయక నగర్ జంక్షన్ సమీపానికి రాగానే, రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.