
పశుగ్రాస వెతలకు చెక్
చింతలపూడి: రైతులకు వ్యవసాయంతో పాటు పశు పోషణ ఆర్థికంగా తోడ్పాటునిస్తుంది. ఈ నేపథ్యంలో పశు పోషణలో పశుగ్రాసం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. మెట్ట ప్రాంతంలో పాడి పశువులను పెంచుకునే రైతులు పశుగ్రాసం పండించడంలో మెలకువలు తెలుసుకుంటే మేలు జరుగుతుందని వ్యవసాయ సహాయ సంచాలకులు వై.సుబ్బారావు చెబుతున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన సందర్భాల్లో పశువులకు పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ దశలో గ్రామీణ ప్రాంతాల్లో పాడిని నమ్ముకున్న రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పశు పోషణలో 70 శాతం ఖర్చు మేతకే అవుతుందని తెలిసిందే. ఈ దశలో ప్రభుత్వం సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వర్షాకాలంలో పశుగ్రాసం పండించుకుంటే వేసవిలో పశువుల పోషణకు ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.
ఖాళీ ప్రదేశాల్లో..
ముఖ్యంగా మెట్ట ప్రాంతంలోని పండ్ల తోటల్లోని మొక్కల మధ్య ఖాళీ ప్రదేశాల్లో పప్పు జాతి పశుగ్రాసాలు అలసంద, ఉలవ, పిల్లిపెసర, జనుము, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేయడం వల్ల పశుగ్రాసం కొరతను అధిగమించడంతో పాటు భూమిలో నత్రజని స్ధిరీకరించబడి భూసారం పెరిగే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు.
జనుము
ఇది కాయజాతి పశుగ్రాసం. అన్ని నేలల్లోనూ అన్ని కాలాల్లో కొద్దిపాటి నీటితో కూడ పండించుకోవచ్చు. ఎకరానికి 12 కిలోల విత్తనాలను 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్‌తో కలిపి చల్లాలి. విత్తిన తరువాత 40, 50 రోజులకు కోతకు వస్తుంది. ఈ మేతను పూత దశలో కోసి ఎండు మేతగా వినియోగించుకుంటే ఉపయోగం ఉంటుంది.
పిల్లి పెసర
వరి సాగు చేసే అన్ని భూముల్లో అంతర పంటగా దీన్ని సాగు చేసుకోవచ్చు. సాధారణ భూములకు పచ్చి రొట్టగా వాడితే భూమికి బలం చేకూరుతుంది. శీతాకాలంలో రబీ పంటగా ఈ పశుగ్రాసాన్ని సాగు చేసుకోవచ్చు. ఈ పశుగ్రాసం వేర్లలో నత్రజని బుడిపెలు ఉండటం వల్ల భూమి సారవంతమవుతుంది. వరి పంట కోయడానికి 3,4 రోజుల ముందు అంటే భూమిలో తేమ ఉన్నప్పుడే ఎకరానికి 10–15 కిలోల విత్తనాలను 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్‌తో కలిపి చల్లుకోవాలి. 50 రోజుల్లో కోతకు వచ్చే ఈ పశుగ్రాసం వల్ల ఎకరానికి 10 నుండి 12 టన్నుల పచ్చి మేత లభిస్తుంది.
ఇతర రకాలు
ఇక పశుగ్రాస మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్ రకం జె 1006–రకం, విజయ కాంపోజిట్ రకాలు 85 రోజులకు ఒకే సారి కోతకు వస్తాయి. పండ్ల తోటలు, పామాయిల్ తోటల్లో కూడ సాగు చేసుకోవచ్చు. రైతులకు అధిక పశుగ్రాసా దిగుబడులను అందిస్తాయి. పప్పు జాతి రకాలైన అలసంద(బొబ్బర్లు) రష్యన్ జైంట్, బుందేల్ లోబియ 1,2, ఇసి 4216–5287, కెబీసీ 2 మొదలైన రకాలు 55 నుండి 60 రోజుల్లో ఒకే కోతలో నాణ్యమైన పశుగ్రాసాన్ని అందిస్తాయి.
వై సుబ్బారావు –వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
తోటల్లో ఖాళీ ప్రదేశాలను
ఉపయోగించుకోవాలంటున్న నిపుణులు

పశుగ్రాస వెతలకు చెక్

పశుగ్రాస వెతలకు చెక్