
పీజీఆర్‌ఎస్‌కు ‘రెవెన్యూ’ సమస్యలే అధికం
మహారాణిపేట: కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ శాఖకు సంబంధించిన వినతులే అధికంగా వస్తున్నాయి. అయితే వాటి పరిష్కారం మాత్రం ఆలస్యమవుతోంది. సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 248 వినతులు అందగా, అందులో 86 రెవెన్యూ సమస్యలకు సంబంధించినవి కాగా, జీవీఎంసీకి 66, పోలీస్ శాఖకు 16, ఇతర విభాగాలకు 80 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల సంఖ్య తగ్గకపోవడంపై కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. తహసీల్దార్లకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించినా, పీజీఆర్‌ఎస్‌కు మళ్లీ మళ్లీ అర్జీదారులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జీవీఎంసీ పరిధిపై ఫిర్యాదులు ఎక్కువ అనుకున్నా, ఇప్పుడు 11 తహసీల్దార్ కార్యాలయాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని గుర్తించారు. అధికారులు అర్జీలను 24 గంటలలోపు ఓపెన్ చేసి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. అధికారులు అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి, సమస్య పూర్వాపరాలు తెలుసుకుని సంతృప్తికర పరిష్కారం చూపాలని, తద్వారా అర్జీలు పునరావృతం కాకుండా ఉంటాయని తెలిపారు. ఎండార్స్‌మెంట్‌ను సక్రమంగా ఇవ్వకపోవడం వల్లనే దరఖాస్తులు రీ–ఓపెన్ అవుతున్నాయని, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో వచ్చిన అర్జీలను చూడని అధికారులపై, అలాగే పరిష్కారంలో అలసత్వం వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వారికి, రానివారికి మెమోలు జారీ చేయాలని డీఆర్‌వోను ఆదేశించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.