
ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నిబంధనలు పాటించాలి
గోపాలపట్నం: దసరా పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుల యజమానులు అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ ఇన్‌చార్జ్ ఉపరవాణా కమిషనర్ ఆర్సీహెచ్. శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం నగరంలో పలుచోట్ల రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. బస్సులకు నిర్దేశించిన పర్మిట్, పన్ను తప్పనిసరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించకుండా వాహన యజమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో వాహన తనిఖీ ఇన్‌స్పెక్టర్ల బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. 3 రోజుల్లో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వాహనాలపై 28 కేసులు నమోదు చేసి, వాటి ద్వారా రూ.4.82 లక్షల జరిమానాలు వసూలు చేసినట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు.