ఆ ఇద్దరు మావోలు ఎక్కడ? | Two Woman Maoists Missing In Telangana | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు మావోలు ఎక్కడ?

Apr 14 2026 10:51 AM | Updated on Apr 14 2026 10:51 AM

Two Woman Maoists Missing In Telangana

సాక్షి, సిద్దిపేట: తెలంగాణ ఉద్యమం.. మావోయిస్టు ఉద్యమాల్లో మెతుకుసీమది కీలకపాత్ర. నక్సల్స్‌, పీపుల్స్‌వార్‌, జనశక్తి, మావోయిస్టు ఉద్యమాలతో సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల ప్రాంతాలకు విడదీయరాని బంధం ఉంది. దుబ్బాక, నర్సాపూర్‌, గిరాయిపల్లి, ఇందుప్రియాల్‌, భూపతి, పద్మక్క దళాలుగా ఇక్కడ పీపుల్స్‌వార్‌ పనిచేసింది. అదే విధంగా కూడవెల్లి, మంజీర దళాలతో జనశక్తి సైతం కొనసాగింది. డీజీపీ ఇటీవల ప్రకటించిన వారిలో రాష్ట్రానికి చెందిన ఐదుగురు మావోయిస్టులు మాత్రమే ఉన్నారని ప్రకటించారు. అందులో ప్రకటించిన రూపీ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. డీజీపీ ప్రకటించని మరో ఇద్దరు ఎక్కడ ఉన్నారోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

కానరాని అరుణ, స్వరూప
జిల్లా నుంచి ముగ్గురు మావోయిస్టులు ఉండగా అందులో ఒకరు మిరుదొడ్డి మండలం ధర్మారానికి చెందిన భాగ్య అలియాస్‌ రూపీ ఛత్తీస్‌గఢ్‌ మాచపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సోమవారం మృతి చెందినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. పోలీసుల లెక్కల ప్రకారం ఎవరు అజ్ఞాతంలో లేనట్లే. అరుణ, స్వరూపలు అజ్ఞాతంలోకి వెళ్లి 25 ఏళ్లు దాటిపోయింది. అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన కాశబోయిన స్వరూప 25ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. దండకారణ్యం సభ్యురాలిగా ఉన్న ఆమైపె రూ.3లక్షల వరకు రివార్డు ఉన్నట్లు గతంలో పోలీసులు పేర్కొన్నారు. తన చిన్ననాడే తల్లిదండ్రులు చనిపోతే నానమ్మ, తాత వద్ద పెరిగారు. పదో తరగతి చదువుతున్నప్పుడే ఉద్యమానికి ఆకర్షితురాలై అడవి బాట పట్టారు. 

ఆమె నానమ్మ, తాత చనిపోగా గ్రామస్తులే చందాలు వేసి అంత్యక్రియలు చేశారు. ప్రస్తుతం తనకు చెల్లె మాత్రమే ఉంది. ఇక నంగునూరు మండల కేంద్రానికి చెందిన రంగు అరుణ అలియాస్‌ పద్మక్క 20 ఏళ్లుగా మావోయిస్టుల్లో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం స్పెషల్‌ జోన్‌ కమిటీలో యాక్షన్‌ టీం మెంబర్‌గా ఉన్న పద్మక్కపై రూ.3లక్షల రివార్డు ఉన్నట్లు అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. ఎక్కడ ఉందో ఎలా ఉందో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

లొంగిపోయారా..? లేదా?  
అక్కన్నపేటకు చెందిన కాశబోయిన స్వరూప, నంగునూరుకు చెందిన రంగు అరుణల ఆచూకీ తెలియరావడం లేదు. పోలీసులు సైతం వీరి గురించి స్పష్టంగా చెప్పడం లేదు. వీరు అజ్ఞాతంలోనే ఉన్నారా? ఉంటే ఎక్కడ? లేక లొంగిపోయారా?.. లొంగిపోతే ఎక్కడ జీవనం గడుపుతున్నారు? లేకపోతే ఎప్పుడైనా ఎన్‌కౌంటర్‌లో తమ ప్రాణాలు కోల్పోయారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీరి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే తమ బిడ్డలు క్షేమంగా ఉన్నారా?.. లేదా? అనే ఆవేదనతో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement