గ్యాస్ కొరత తీవ్రం.. కొత్త కనెక్షన్ల జారీ నిలిపివేత! | lpg shortage new connections ban india gas crisis | Sakshi
Sakshi News home page

గ్యాస్ కొరత తీవ్రం.. కొత్త కనెక్షన్ల జారీ నిలిపివేత!

Apr 14 2026 7:37 AM | Updated on Apr 14 2026 8:01 AM

lpg shortage new connections ban india gas crisis

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ పరిణామాలు సామాన్యుల వంటగదిలో అగ్గి రాజేస్తున్నాయి. ఎల్పీజీ దిగుమతుల్లో నెలకొన్న అనిశ్చితి నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు గ్యాస్‌ కొరత, రీఫిల్‌ బుకింగ్‌ గడువు పెంపు ప్రభావం కొత్త కనెక్షన్ల డిమాండ్‌ను ఒక్కసారిగా పెంచేసింది. అయితే చమురు సంస్థలు డొమెస్టిక్‌ కనెక్షన్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త కనెక్షన్ల జారీపై అప్రకటిత నిషేధాన్ని విధించాయి. 

ఎల్పీజీ దిగుమతుల్లో సుమారు 90 శాతం హర్మూజ్‌ జలసంధి మార్గం ద్వారానే రావాలి. కానీ, ప్రస్తుత యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఆ మార్గంలో నౌకల రాకపోకలు స్తంభించాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 10,611 మెట్రిక్‌ టన్నుల నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని కేవలం పాత వినియోగదారులకు ప్రాధాన్యం ఇచ్చి సర్దుబాటు చేయాలని చమురు సంస్థలు నిర్ణయించాయి. కొత్త కనెక్షన్లు ఇవ్వడం వల్ల డిమాండ్‌ మరింత పెరిగి నిల్వలు సరిపోక సిస్టమ్‌ ‘కొలాప్స్‌’అయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నాయి.  కొత్త కనెక్షన్ల అప్లికేషన్ల ప్రక్రియను ఏజెన్సీలస్థాయిలో నిలిపేసినట్లు తెలుస్తోంది.  

ఉమ్మడి కుటుంబాల్లో ‘గ్యాస్‌’గుబులు 
గతంలో సిలిండర్‌ బుక్‌ చేసిన 15 రోజులకు మరో బుకింగ్‌కు వెసులుబాటు ఉండగా, ప్రస్తుతం అర్బన్‌లో 25 రోజులకు, రూరల్‌ ప్రాంతాల్లో 45 రోజులకు పెరిగింది. బుక్‌ చేసిన తర్వాత డెలివరీకి మరో 10 నుంచి 15 రోజులు పడుతోంది. ఉమ్మడి కుటుంబాల్లో ఒక్క కనెక్షన్‌ సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో ఇంట్లోని ఇతర సభ్యుల పేర్ల మీద కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేస్తున్నారు. కొత్తగా విడిపోయిన చిన్న కుటుంబాలు, విద్యార్థులు, వలస కారి్మకుల నుంచి కూడా దరఖాస్తుల తాకిడి సాధారణం కంటే మూడు రెట్లు పెరగడం కొత్త కనెక్షన్ల నిలుపుదలకు ప్రధాన కారణమైంది. సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా నెలకు 40 వేల దరఖాస్తులు వస్తుండగా, ప్రస్తుతం కేవలం పది రోజుల్లోనే ఆ సంఖ్య దాటిపోయినట్లు తెలుస్తోంది.

డబుల్‌ సిలిండర్‌ కోసం క్యూ 
సింగిల్‌ సిలిండర్‌ ఉన్న వినియోగదారులు ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సిలిండర్‌ ఖాళీ అయితే నెలరోజుల వరకు కొత్తది వచ్చే పరిస్థితి లేకపోవడంతో రెండో సిలిండర్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇవి సాధారణంగా వచ్చే దరఖాస్తులు కంటే ఐదింతలు దాటాయి. అయితే, నిల్వల కొరత సాకుతో వీటిని కూడా ఏజెన్సీలు పెండింగ్‌లో పెడుతున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement