
గంజాయి సాగు ధ్వంసం
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సమితి పరిధిలో గల తలపంగ, పురుణాసాహి, నువాసాహి, మహాదీమ్, తదితర అటవీ ప్రాంతాల్లో అక్రమంగా గంజాయి సాగవుతుందన్న సమాచారం మేరకు జిల్లా పోలీసులు, అబ్కారీ, అటవీ శాఖలకు చెందిన అధికారులు మంగళవారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరు ఎకరాల విస్తీర్ణంలో సాగు అవుతున్న గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. గంజాయి అక్రమ రవాణా, సాగుపై ఉక్కుపాదం మోపిన జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ మేరకు విస్తృతంగా దాడులను నిర్వహిస్తోంది.
బస్సులో కత్తితో వీరంగం
భువనేశ్వర్ : పూరీ జిల్లా కొణాస్ బింధాన్ చౌరస్తా వద్ద లక్ష్మీ ప్రైవేటు బస్సులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. కత్తితో దాడికి పాల్పడటంతో ఏడుగురికి గాయాలయ్యాయి. మొదట కత్తితో ఒక వ్యక్తిపై దాడి చేశాడు. తోటి ప్రయాణికులు అడ్డుకోవడంతో వారిపైనా కత్తి ఝులిపించి గాయపరిచాడు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. హరసపడా నుంచి సుకొలొ వస్తున్న మో బస్సులో ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న కొణాస్ స్టేషన్ పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. నిందితుడు కొణాస్ బింధాన్‌కు చెందిన తపన్ భోయిగా గుర్తించారు.
కటక్‌లో కర్ఫ్యూ ఎత్తివేత
భువనేశ్వర్: కటక్ నగరంలో అల్లర్లు చెలరేగడంతో 36 గంటలు కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరం ప్రశాంత వాతావరణం నెలకొనడంతో కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. కర్ఫ్యూ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని జంట నగరాల పోలీస్ కమిషనర్ ఎస్.దేవదత్త సింగ్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలలో దాదాపు 50 ప్లాటూన్ల పోలీసు బలగాలు మోహరించడంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుందన్నారు. అయితే, పుకార్లు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా సోషల్ మీడియా, ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు అమలులో ఉన్నాయని స్పష్టం చేశారు. పరిస్థితి పూర్తిగా స్థిరపడే వరకు భద్రత కట్టుదిట్టంగా ఉంటుందని తెలిపారు.
బాల్య వివాహం అడ్డగింత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసు స్టేషన్ పరిధిలో చితపారి పంచాయతీలో బాల్య వివాహాన్ని జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది మంగళవారం అడ్డుకున్నారు. బలిమెల పోలీసులకు బాల్య వివాహాం జరుగుతున్నట్లు సమాచారం వచ్చింది. ఐఐసీ ధీరజ్ పట్నాయక్ వెంటనే జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారి నారాయణ దాస్‌కు సమాచారం ఇచ్చారు. నారాయణదాస్ తన సిబ్బందితో చితపరి గ్రామానికి వెళ్లారు. అదు దోర అనే వ్యక్తి తన కుమారుడికి బాలికతో వివాహా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పెళ్లి కుమారుడికి, కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలికను మల్కన్‌గిరి బాలల ఆశ్రమ గృహానికి తరలించారు. ఈ మేరకు పెళ్లి కుమారుడు, కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని కళ్లేపల్లి గ్రామంలో ఎరువుల పంపిణీపై ‘ఎరువుల కోసం టీడీపీ నేత ఇంటి వద్ద క్యూ’ శీర్షికతో సాక్షి పత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి మండల వ్యవసాయ అధికారి నవీన్ కుమార్ ఒక ప్రకటనలో స్పందించారు. కళ్లేపల్లి గ్రామంలోని 196 మంది రైతులకు డీసీఎంఎస్ ద్వారా 333 యూరియా బస్తాలు వచ్చిన విషయం వాస్తవమేనన్నారు. వాటిని రైతుసేవ కేంద్రం ద్వారా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, అక్కడ వైఫై పని చేయకపోవడంతో ఎదురుగా ఉన్న గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇంటి నుంచి వైఫై కనెక్షన్ తీసుకొని తర్వాత రైతుసేవ కేంద్రం నుంచే ఎరువులు పంపిణీ చేశామన్నారు. సాంకేతిక కారణం వలనే ఇలా చేసినట్లు తెలియజేశారు.
హిరమండలం: పశువుల అక్రమ రవాణాను హిరమండలం పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం హిరమండలంలో ఎస్‌ఐ వెంకటేష్ వాహనాలు తనిఖీలు చేస్తుండగా, ఎటువంటి అనుమతులు లేకుండా పశువులను బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తుండంతో పట్టుకున్నారు. కొత్తూరు మండలం బలద సంతలో కొని అలమండ తరలిస్తుండగా పట్టుకున్నారు. దీంతో కొత్తవలసకు చెందిన జనార్ధనరావు, గణపతిరావులపై కేసు నమోదు చేశారు. బొలేరో వాహనాన్ని సీజ్ చేశామని, ఎనిమిది పశువులను గుర్ల గోశాలకు తరలించామని ఎస్‌ఐ వెల్లడించారు.

గంజాయి సాగు ధ్వంసం