20 వరకూ ఇగ్నో పరీక్ష గడువు పెంపు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) డిసెంబర్ –2025లో నిర్వహించే టర్మ్ ఎండ్ పరీక్షలకు ఆన్‌లైన్ ద్వారా చెల్లించే పరీక్ష ఫీజు గడువు తేదీని ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె.సుమలత తెలిపారు. ఈనెల 21 నుంచి 26వ తేదీ వరకు రూ.1100 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలని పేర్కొన్నారు. డిసెంబర్ సెషన్‌కు సమర్పించే అసైన్‌మెంట్ తేదీని ఈ నెల 31 వరకు పొడిగించినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వారికి కేటాయించిన అధ్యయన కేంద్రాలలో సమర్పించాలని ఆమె తెలిపారు. ఇతర వివరాలకు విజయవాడ కొత్తపేటలోని హిందూ హైస్కూల్ ప్రాంగణంలో గల ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని స్వయంగా గాని లేదా 0866–2565253 ఫోన్ నంబర్ ద్వారా గాని సంప్రదించవచ్చని తెలియజేశారు.
గుడివాడరూరల్: కృష్ణాజిల్లా గుడివాడ మండలంలోని రామనపూడి గ్రామంలో ఓ చిన్నారిని వీధి కుక్కలు సోమవారం రాత్రి తీవ్రంగా గాయపరిచాయి. గ్రామానికి చెందిన గూడపాటి నాగేంద్రబాబుకు ఇద్దరు కుమార్తెలు. ఆరేళ్ల చిన్న కుమార్తె మోక్షిత ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు మీద పడి దాడి చేశాయి. చిన్నారి ఎడమ కాలి తొడ పట్టుకుని కుక్కలు వదలకపోవడంతో అక్కడే ఉన్న స్థానికులు చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించారు. వారిపై కూడా దాడి చేసేందుకు కుక్కలు ప్రయత్నించాయి. కొంత సమయానికి మరికొంతమంది అక్కడకు వచ్చి కుక్కలను తరిమి కొట్టారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే కుటుంబ సభ్యులు గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కలు పెరిగిపోయాయని, పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


