పోలీస్ గ్రీవెన్స్‌లో 85 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 85 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వృద్ధులు, నడవలేని వికలాంగుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు అందుకున్నారు. గ్రీవెన్స్‌లో భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 36, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 11, కొట్లాటకు సంబంధించి 03, వివిధ మోసాలపై 06, మహిళా సంబంధిత నేరాలపై 09, దొంగతనాలకు సంబంధించి 03, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, సంఘటనలకు సంబంధించినవి 17, ఇలా మొత్తం 85 ఫిర్యాదులను స్వీకరించారు.
ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారమే ధ్యేయం
కోనేరుసెంటర్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు పేర్కొన్కారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మీ కోసంలో మొత్తం 42 అర్జీలు ప్రజల నుంచి అందినట్లు తెలిపారు.


