ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని ఈనెల 7వ తేదీన ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ నిర్వహించనున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. 7వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 5:55 గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితార సెంటర్, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్‌రావు నగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రాహ్మణ వీధి మీదుగా గిరిప్రదక్షిణ సాగుతుందని తెలిపింది. ఆదిదంపతుల ఉత్సవ మూర్తులతో పాటు దేవస్థాన ప్రచారరథం, భక్తజనుల కోలాట నృత్యాల మధ్య సాగే గిరిప్రదక్షిణలో భక్తులందరూ పాల్గొనాలని దేవస్థాన అధికారులు కోరారు.
అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): మండలంలోని అనిగండ్లపాడు ఆయుర్వేద వైద్యశాల రాష్ట్రస్థాయి స్వచ్ఛాంధ్ర అవార్టుకు ఉత్తమ స్వచ్ఛ ఆయుష్ కేంద్రంగా ఎంపికై ంది. వైద్యశాల పరిసరాల పరిశుభ్రత, ఆవరణలో వివిధ రకాల ఔషధ మొక్కల ఏర్పాటు, టాయిలెట్, ఫ్లోరింగ్, హాండ్ వాష్, డస్ట్‌బిన్స్ తదితర అంశాలలో పలు రకాల తనిఖీల అనంతరం వైద్య శాలను రాష్ట్రస్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డుకు ఎంపిక చేశారని వైద్యాధికారి డాక్టర్ రత్నప్రియదర్శిని తెలిపారు. సోమవారం విజయవాడలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకోనున్నట్టు తెలిపారు. ఈ వైద్యశాలకు వై.రత్న ప్రియదర్శిని వైద్యాధికారిగా వచ్చినప్పటినుంచి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందటంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులలకు చికిత్స, పంచకర్మ సేవలు అందుబాటులోకి వచ్చాయని రోగులు చెపుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలువురు హర్షం వెలిబుచ్చారు. డాక్టర్ ప్రియదర్శినికి అభినందనలు తెలియజేశారు.
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని శనివారం న్యూఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృతివెంటి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు.
ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు
తిరువూరు: ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు సూచించారు. తిరువూరు వాహినీ ఇంజినీరింగ్ కళాశాలలో 2025 డీఎస్సీలో ఎంపికై న నూతన ఉపాధ్యాయులకు నిర్వహించే వారం రోజుల శిక్షణా తరగతులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ విద్యాలయాలు బలోపేతానికి ఉపాధ్యాయుల కృషే కీలకమన్నారు. మారుతున్న విద్యార్థుల అభిరుచుల కనుగుణంగా బోధనల మెళకువలను పెంపొందించుకుని మంచి ఫలితాల సాధనకు తోడ్పడాలని సూచించారు. ఉపాధ్యాయుడు కూడా నిరంతర విద్యార్థేనని, బోధనలో నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే రాణిస్తారని పేర్కొన్నారు. రెసిడెన్షియల్ విధానంలో 250 మంది నూతన ఉపాధ్యాయులకు తిరువూరులో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు డీఈవో తెలిపారు.
7న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ