శాంతియుత ఉద్యమాల పితామహుడు గాంధీజీ
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన శాంతియుత పోరాటానికి జాతిపిత మహాత్మాగాంధీ ఆద్యులు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కొనియాడారు. మహాత్మాగాంధీ 156వ జయంతి సందర్భంగా పాతబస్తీ గాంధీపార్కులోని గాంధీ విగ్రహం వద్ద జయంతి వేడుకలను సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ ఏనాడూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనని ఆర్‌ఎస్‌ఎస్ లాంటి సంస్థను ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజ్ పోరాటం చేశారు తప్ప ఆర్‌ఎస్‌ఎస్ పాల్గొనలేదన్నారు. సుమారు 4,500 మంది కమ్యూనిస్టులు నాటి పోరాటంలో రక్తతర్పణ చేశారని అన్నారు. ఈ పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ పాల్గొందని స్వయంగా దేశ ప్రధాని పేర్కొనటం చరిత్రను వక్రీకరించటమేనని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శివర్గ సభ్యులు బుట్టిరాయప్ప, తాడి పైడియ్య, అప్పురబోతు రాము, సంగుల పేరయ్య తదితరులు పాల్గొన్నారు.


