
కృష్ణానదిలో మునిగి గత ఈతగాడు మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రమాదవశాత్తు కృష్ణానదిలో మునిగి గజ ఈతగాడు మృతిచెందాడు. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కృష్ణలంక, వల్లూరి వారి వీధిలో నివాసం ఉంటున్న ఒడుగు కృష్ణ(35) అనే వ్యక్తి చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి వివాహమైంది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అతను గజ ఈతగాళ్ల డ్యూటీలో చేరాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు డ్యూటీకి వెళ్లాడు. డ్యూటీలో భాగంగా శనైశ్వరస్వామి గుడి వెనుక నదిలో బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో బట్టలు శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి కనిపించలేదు. గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టినా కృష్ణ ఆచూకీ లభించలేదు. మునిగిన ప్రదేశంలోనే శుక్రవారం ఉదయం నీటిలో తేలుతూ శవమై కనిపించాడు. మృతదేహాన్ని నదిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని సోదరుడు ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈతకు వెళ్లి యువకుడు దుర్మరణం
నందిగామ రూరల్: స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు పట్టణంలోని అనాసాగరానికి చెందిన కర్రి శ్రీనివాసరావు కుమారుడు నరేష్ (28) గురువారం ముగ్గురు స్నేహితులతో కలిసి మండలంలోని పల్లగిరి సమీపంలోని మున్నేరులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నరేష్‌తో పాటు అతని స్నేహితులు నీటిలో గల్లంతయ్యారు. అయితే ముగ్గురు స్నేహితులు సురక్షితంగా బయటకు వచ్చినప్పటికీ నరేష్ ఆచూకీ లభించకపోవటంతో మున్నేటిలో ముమ్మరంగా గాలించారు. నరేష్‌ను వెతికి బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అభిమన్యు తెలిపారు.