
టీడీపీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
బూదవాడ(జగ్గయ్యపేట): పాతకక్షల నేపథ్యంలో టీడీపీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని బూదవాడ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గడ్డం ఏసుబాబు, మరో నాయకుడు శీలం లక్ష్మయ్యకు గత కొన్ని రోజులుగా పాతకక్షలున్నాయి. ఈ నేపథ్యంలో దసరా పండుగ కావటంతో లక్ష్మయ్య వర్గానికి చెందిన పల్లపాటి తిరుపారావు, పోతుమర్తి సాయి రాత్రి సమయంలో గ్రామంలోని బ్రిడ్జిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అదే సమయంలో ఏసుబాబు వర్గానికి చెందిన గడ్డం సత్యనారాయణ, గడ్డం లక్ష్మణ ఎదురవటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పక్కనే ఉన్న మధ్యం సీసాలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో పల్లపాటి తిరుపారావు, పోతుమర్తి సాయిలకు తీవ్ర గాయాలు కాగా సత్యనారాయణ, లక్ష్మణ్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ తరలించారు. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలుండటంతో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఘర్షణకు సంబంధించి ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తోట సూర్య శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో మరోసారి ఘర్షణలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.