
శాఖల సమన్వయం... పటిష్టమైన బందోబస్తు
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలోని అన్ని శాఖల సమన్వయం, పటిష్టమైన పోలీసు బందో బస్తుతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం చేసుకోగలుగుతున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు అన్నారు. జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశతో కలిసి సీపీ రాజశేఖరబాబు మంగళవారం క్యూలైన్‌లను పరిశీలించారు. అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేయడమే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. మూలా నక్షత్రం సందర్భంగా మరో 1400 మంది పోలీసు సిబ్బందితో 200 రోప్ పార్టీలను ఏర్పాటు చేసి భక్తులు ఎక్కడా తొక్కిసలాట జరగకుండా ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం అయ్యే విధంగా బందోబస్తును ముందు రోజు అర్ధరాత్రి నుంచి స్వయంగా పర్యవేక్షించామన్నారు.
భవానీలకు ఏర్పాట్ల పరిశీలన
భవానీలు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనం నిమిత్తం వస్తారన్న అంచనాతో సీపీ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో కలిసి బస్ స్టాండ్, మున్సిపల్ కార్యాలయం, సీతమ్మ వారి పాదాలు, వినాయక టెంపుల్ పరిసర ప్రాంతాలలోని హోల్డింగ్ ఏరియాలను, క్యూలైన్లను నడుచు కుంటూ వెళ్లి పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నందున భక్తులు ఎవరూ నదిలోనికి వెళ్లకుండా కేవలం జల్లు స్నానాలు వినియోగించే విధంగా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కేశఖండన శాల పరిసర ప్రాంతాలలో రద్దీ లేకుండా ఎప్పటికప్పుడు పంపించే విధంగా సిబ్బంది తగు సూచనలు ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. హోల్డింగ్ ఏరియాలలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్ని వసతులు అందుతున్నాయా లేదా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అనే విషయాన్ని గమనించి వెంటనే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. మున్సిపల్ కమిషనర్ హెచ్‌ఎం ధ్యాన్‌చంద్ డీసీపీలు కె.తిరుమలేశ్వరరెడ్డి, ఎస్.వి.డి.ప్రసాద్ , ఏడీసీపీ జి.రామకృష్ణ, సౌత్ ఏసీపీ పావన్ కుమార్, రామచంద్ర రావు, ఇతర శాఖల అధికారులు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం
సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు
భవానీల రాక సందర్భంగా
ఏర్పాట్ల పరిశీలన