
కోతలకు వానలతో ఆటంకం
చేలల్లో నిలుస్తున్న నీరు.. బురద నేలల్లో యంత్రాలతో కోయలేని పరిస్థితి చైన్ మిషన్ల కోసం నిరీక్షణ..
భైంసా/భైంసారూరల్: జిల్లాలో సోయా పంట చేతికి వచ్చింది. కోతలు మొదలయ్యాయి. ఈ సమయంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు చేలల్లో నీరు నిలిచి చిత్తడిగా మారుతున్నాయి. దీంతో యంత్రాలతో కోయలేని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా 1.05 లక్షల ఎకరాల్లో సాగు చేసిన సోయా పెద్ద ఎత్తున దెబ్బతింది. మొత్తం 72,300 మంది రైతులు ఈ సీజన్‌లో ఆశతో పంట వేసినా, గత నెల రోజులుగా కుండపోత వానలకు దిగుబడి ఆశలు తగ్గిపోయాయి.
వానలే అడ్డంకి
ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన వర్షం సోమవారం వేకువజామున మరింత వేగం అందుకుంది. భైంసా డివిజన్‌తోపాటు పలు మండలాల్లో వర్షం.. సోయా కోతలకు అడ్డంకిగా మారింది. ఎండిపోయిన చేలు వర్షాలకు బురదమయమై పంట కోయడం చిక్కుగా మారింది. ఆకులు రాలిన మొ క్కలు తడిసి ఉబ్బిపోతుండటంతో గింజలు నల్ల బడుతున్నాయి.
చైన్ మిషన్‌లే ఆధారం
రైతులు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి చైన్ మిషన్‌లను అద్దెకు తెచ్చుకొని కో త కొనసాగిస్తున్నారు. గంటకు రూ.2,400 నుంచి రూ.2,800 చెల్లించి బురద నేలల్లోనూ పంట కోయిస్తున్నారు. సాధారణ హార్వెస్టర్లు బరువుతో బురదలో ఇరుక్కుపోతుండగా, తేలికై న చైన్ మిషన్‌లు పనిచేయడం సులభమవుతోంది. ఒక్కో ఎకరానికి గంట నుంచి రెండు గంటల సమయం పడుతోంది.
ఇంకా 70% కోత మిగిలే ఉంది
జిల్లాలో 70 శాతం భూముల్లో కోత ఇంకా పూర్తికాలేదు. కోసిన గింజల్లో తేమశాతం పెరిగిపోవడంతో రంగు మారిపోతుంది. వర్షాల కారణంగా కొద్దిసేపట్లోనే నల్లబడిన గింజలు మార్కెట్ విలువ కోల్పోతున్నాయి. వర్షం తగ్గితేనే రైతులు మిగిలిన పంట కోసి, ఆరబెట్టి, అమ్మకాలకు సిద్ధం చేసే అవకాశం ఉంటుంది.
కుంటాలలో భారీ వర్షం..
కుంటాల: మండలంలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పంటలకు నష్టం వాటిల్లింది. కోత దశకు వచ్చిన సోయా దెబ్బతింది. కల్లాల్లో ఉంచిన సోయా తడిసి ముద్దయింది. ఆరబెట్టేందుకు రైతులు ఇబ్బంది పడ్డారు. ఏరాల్సిన పత్తి పంటలో వర్షపు నీరు నిలవడంతో దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 24 గంటల్లో 21.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఏఎస్‌వో సాయికృష్ణ తెలిపారు.
పంట ఆరబెట్టే సమస్య
కోత అనంతరం కల్లాలపై లేదా గ్రామ సమీప రహదారుల పక్కన సామూహికంగా సోయాను ఆరబెడుతున్న రైతులు వానలతో మళ్లీ ఇబ్బంది పడుతున్నారు. టర్పాలిన్‌లు ఉంచినా లోపలికి నీరు చేరి గింజలు నాని మొలకెత్తుతున్నాయి. దీంతో రైతులు రోజంతా జాగరణ చేసి వర్షం ఆగగానే టర్పాలిన్‌లు తొలగించి గింజలు ఆరబెడుతున్నారు. నీరు నిలవకుండా కల్లాల చుట్టూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రోజంతా కల్లాల వద్దే..
పంట కోతలకు వర్షం ఆటంకంగా మారింది. మరోవైపు కోసిన పంట ఆరబెట్టినా.. వర్షానికి తే మ పెరుగుతోంది. గింజ లు రంగు మారుతున్నా యి. దీంతో కుటుంబమంతా కల్లాల వద్దే ఉండి ఆరబెట్టాల్సి వస్తోంది. కొత్త టార్పాలిన్‌లు కొని కింద వేసి పంటను ఆరబెడుతున్నాం. ప్రతీరోజు సోయా కుప్పలను ఒకచోటు నుంచి మరోచోటుకు మారుస్తున్నాం. – దత్త, రైతు మాంజ్రి
వర్షాలు తగ్గే వరకు ఆగాలి..
జిల్లా వ్యాప్తంగా ప్రతీరోజు ఏదో ఒకచోట వర్షం కురుస్తూనే ఉంది. తుపాను ప్రభావంతో భారీ వర్షం కురిసింది. వర్షంతో చేలన్నీ తేమగా ఉన్నాయి. ఎండలు కాస్తే తేమశాతం తగ్గుతుంది. వర్షాలు తగ్గే వరకూ పంట కోయకపోవడమే మంచిది. ఇప్పుడు పంట కోసినా.. కోసిన పంట ఎండాలన్న ఇబ్బందులు తప్పవు.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి

కోతలకు వానలతో ఆటంకం