
పులకించిన పోరుగడ్డ
ఘనంగా కుమురంభీం 85వ వర్ధంతి జోడేఘాట్‌లో సంప్రదాయ పూజలు మంత్రులు జూపల్లి, అడ్లూరి హాజరు ‘కోడ్’తో వేదిక ఎక్కని అమాత్యులు సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం
కెరమెరి(ఆసిఫాబాద్): జల్.. జంగల్.. జమీన్ కోసం పోరుసలిపి అసువులు బాసిన ఆదివాసీ పోరాట యోధుడు కుమురంభీం స్మరణతో పోరుగడ్డ పులకించింది. రణభూమి జోడేఘాట్‌లో వీరుడి 85వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరై భీం విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన సమాధిపై పూలు చల్లి నివాళులర్పించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వేదికపైకి ఎవరూ వెళ్లలేదు. దర్బార్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరికి వారుగా వచ్చి నివాళులర్పించి వెళ్లిపోయారు.
భీం ఆశయాలు నెరవేర్చుతాం: మంత్రులు
కుమురం భీం ఆశయాలు నెరవేర్చుతామని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివాసీలను సంఘటితం చేసి వారి హక్కు ల సాధనకు పోరాడిన వీరుడు కుమురంభీం అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన స్ఫూర్తి ఎంతో ఉందని పేర్కొన్నారు. 1935 నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి వారి బలగాలను ఎదురించారని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధికి రూ.740 కోట్లతో రోడ్లు, గిరిజన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని చెప్పారు. విద్య, ఆశ్రమ పాఠశాలలను మరింత తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా వేదికపై మాట్లాడలేకపోతున్నామని చెప్పారు.
భీం స్ఫూర్తితో ముందుకు సాగుదాం: కలెక్టర్
ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన మహనీయుడు కుమురం భీం స్ఫూర్తితో ముందుకు సాగుదామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాటుపడతామని పేర్కొన్నారు. భీం వర్ధంతికి ఉచిత బస్సు సౌకర్యం, భోజనం తదితర వసతులు కల్పించామని చెప్పారు. అనంతరం భీం మనుమడు కుమురం సోనేరావు కుటుంబానికి కలెక్టర్ నూతన వస్త్రాలు అందించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
పాటగూడ, జోడేఘాట్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గుస్సాడీ నృత్యాలు కనువిందు చేశాయి. ఐసీడీఎస్, రెవెన్యూ, ఐటీడీఏ, సఖీ, వైద్యారోగ్యశాఖ, కొలాం అభివృద్ధి, ఇప్పుపూలు, విస్తరాకుల తయారీ తదితర స్టాళ్లు ఎంతోగానో ఆకట్టుకున్నాయి.
భీంకు సంప్రదాయపూజలు
కుమురంభీంకు ఆయన వారసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సంప్రదాయ పూజలు నిర్వహించారు. భీం సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. ముందుగా ఆచార, వ్యవహారాలతో పాత జెండాలు తీసేసి కొత్త జెండాలు ఆవిష్కరించారు. అంతా వరుసక్రమంలో నిల్చుని జెండాలకు మొక్కారు. ధూప, దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. కోడి, మేకలతో జాతకం చూశారు.
నివాళులర్పించినవారిలో..
‘స్థానిక’ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దర్బార్ రద్దు చేయగా భీం ఆరాధికులు అనుకున్న స్థాయిలో హాజరు కాలేదు. మంత్రులు, కలెక్టర్‌తోపాటు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్‌పాటిల్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఏఎస్పీ చిత్తరంజన్, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, ఆర్డీవో లోకేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, డీడీ రమాదేవి, ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, భీం మనుమడు కుమురం సోనేరావు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణ, నాయకులు విశ్వప్రసాద్, శ్యాంనాయక్ తదితరులు భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినవారిలో ఉన్నారు.

పులకించిన పోరుగడ్డ