
వెంకటాపూర్ గ్రామ శివారులో తడిసిన మొక్కజొన్న కంకులు ఆరబెడుతున్న రైతులు
జిల్లాను వరణుడు వీడడం లేదు. నాలుగు రోజులుగా నిత్యం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పంటలు దెబ్బతింటున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం రాత్రి నిర్మల్, నర్సాపూర్, కుంటాల మండలాల్లో భారీ వర్షం కురిసింది. నర్సాపూర్(జి) మండలంలో ఈదురుగాలులతో వర్షం కురవడంతో ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. సోయా, వరి పంటలు దెబ్బతిన్నాయి. నందన్ ఎక్స్‌రోడ్డు వద్ద బీటీరోడ్డు కోతకు గురైంది.
కాళేశ్వరం ప్రాజె క్టు – 27వ ప్యాకేజీలో నిర్మించిన అక్విడెక్ట్ పిల్లర్ కుంగి బీటలు వారింది. నర్సాపూర్ (జి)శివారులో విద్యుత్ స్తంభం విరిగింది. మండలంలో 72.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఏఎస్‌వో శ్రీరామ్ తెలిపారు. నిర్మల్ రూరల్ మండలం అక్కాపూర్, ముఠాపూర్, వెంకటాపూర్, చిట్యాల, ముజ్గి గ్రామాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై ఆరబెట్టిన మక్కలు, మొక్కజొన్న కంకులు తడిసిపోయా యి. సోయా పంట కూడా తడిసింది. వర్షాలకు ముధోల్ మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు పండిస్తున్న పత్తి పంట దెబ్బతింటోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కాయలు ఎర్రబడి రాలిపోతున్నాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు.
– నర్సాపూర్(జి)/ముధోల్/ సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్