
స్థానిక ఎన్నికల్లో బూత్‌కమిటీ కన్వీనర్లే కీలకం
కూటమి ప్రభుత్వ వైఫల్యాలనుప్రజల్లోకి తీసుకెళ్దాం
రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
డోన్: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ కమిటీ కన్వీనర్లే కీలకమని రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. తన స్వగృహంలో మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన పట్టణ పార్టీ బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ యంత్రాంగాన్ని పటిష్టపరుచుకుంటే శాసనసభ సాధా రణ ఎన్నికలలో కూడా పార్టీ విజయం సులువవుతుందన్నారు. ఇందుకోసం ప్రతి బూత్ పరిధిలో సుశిక్షితులైన 40 మంది కార్యకర్తలను తయారుచేసుకోవాల్సిన బాధ్యత కన్వీనర్లదేనన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి నాయకులు కృషి చేయాలన్నారు. రానున్న రోజులలో పార్టీ కార్యకర్తలకు నామినేట్ పదవులతో పాటు అన్ని రకాల పదవులలో పెద్దపీట వేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసగించి అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పలు పథకాలనే కొనసాగిస్తూ అన్నిరకాల పథకాల్లో భారీ ఎత్తున కోత విధించిన విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు కూటమి నేతలపై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. విద్యుత్ చార్జీలు పెంచడంతో సామాన్యుల బతుకు భారంగా మారిందన్నారు. ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమంటూనే పురుషుల నుంచి చార్జీలను విపరీతంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. అనేక రకాల పన్నుల భారంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నారన్నారు. నాణ్యమైన మందు, సరసమైన ధర అంటూ కల్తీ మద్యంతో కూటమి నాయకులు ఊరూరా బెల్టుషాపులు ఏర్పాటు చేసి నిలువుదోపిడీ చేయడంతో పాటు ప్రాణాలు తీసేందుకు సిద్ధమయ్యారన్నారు. సమావేశంలో మున్సిప ల్ చైర్మన్ సప్తశైల రాజేష్, ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్‌కుమార్, పార్టీ జిల్లా వలంటీర్ విభాగం అధ్యక్షులు పోసు్ట్రపసాద్, మున్సిపల్ వైస్‌చైర్మన్ జాకీర్‌హుసేన్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో బూత్‌కమిటీ కన్వీనర్లే కీలకం