
రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
పత్తికొండ: అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంగాటి శ్రీదేవి విమర్శించారు. మంగళవారం పత్తికొండ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరులతో సమావేశంలో ఆమె మాట్లాడుతూ..
వైఎస్సార్‌సీపీ అధికారంలోనే హోసూరు రహదారిలో టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజకీయ కారణాలతో మరో చోటుకు మార్చడంతో పాటు ఆరు నెలల్లో పూర్తి చేశామని ప్రారంభ సమయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రగల్బాలు పలికారన్నారు. ఇంకా ఇప్పటికీ పనులు పునాదులు దశలోనే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో పత్తికొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు రూ. 30 కోట్లతో ప్రారంభిస్తే టీడీపీ లీగల్ సెల్ నాయకుడు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారన్నారు. ఇప్పటికై నా కూటమి నాయకులు రోడ్డు పనులు ప్రారంభించి ప్రజలకు మేలు చేయాలని హితవు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా గ్రామాల్లో బెల్ట్‌షాపుల్లో నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఉల్లి, టమాట రైతులు భారీగా నష్టపోతున్నా ప్రభుత్వంలో కనిస స్పందన లేకపోవడం దారుణమన్నారు. రైతులు దిగుబడిని పొలంలోనే పశువులకు మేతగా వదిలేస్తున్నారని, ఇలాంటి పరిస్థితిని కూడా పార్టీలకు ఆపాదించడం వారి కూటమి నేతల అవివేకమన్నారు. ఉల్లి, టమాట పంటలను వైఎస్సార్‌సీపీకు చెందిన రైతులు మాత్రమే సాగు చేయలేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తలా.. తోక లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. గిట్టుబాటు ధర కల్పించ డం చేతగాక టమాట నాణ్యతపై మాట్లాడటం మంత్రి స్థాయిలో తగదన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మేధావుల ఫోరం అధికార ప్రతినిధి శ్రీరంగడు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, ఎంపీపీ నారాయణ్‌దాస్, ఎస్టీ సెల్ జిల్లా ఆధ్యక్షుడు భాస్కర్‌నాయ క్,మండల కన్వీనర్ కారం నాగరాజు, సీనియర్ నాయకులు టీఎమ్‌డీ హుశేన్, జిట్టా నాగేష్, భాస్కర్‌రెడ్డి, కోతిరాళ్ల అంజినయ్య, పులికొండ తిప్పన్న, కారుమంచి నజీర్, సాబ్డిన్ నూర్‌బాషా, అట్లా గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.