
కోసిగిలో భారీ చోరీ
కోసిగి: మండల కేంద్రంలోని సాయిబాబా గుడి సమీపంలో అర్ధరాత్రి ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు.. స్థానిక ఉరుకుంద మెయిన్ రోడ్డులో మధు, లీలావతి దంపతులు నివాసం ఉంటున్నారు. సోమవారం కౌతాళంలో బంధువు చనిపోగా మధు అంత్యక్రియలకు వెళ్లాడు. రాత్రి వేళ ఇంట్లో ఒంటరిగా ఉండలేక లీలావతి గ్రామంలోనే ఉంటున్న అమ్మ వద్దకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగులు అర్ధరాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి చొరబడి బీరువాలోని సొమ్మును దోచుకెళ్లారు. ఉదయం దంపతులు ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలో ఉంచిన 6 తులాల బంగారు నగలు, కేజీ వెండి, రూ.లక్ష నగదును దుండగులు దోచుకెళ్లినట్లు బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. బయటి వ్యక్తులకు చెందిన బంగారు తాకట్టు పెట్టుకుని డబ్బు వడ్డీకి ఇచ్చినట్లు దంపతులు తెలిపారు. ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా క్లూస్ బృందం వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఆ ప్రాంతంలోని సీజీ ఫుటేజీ పరిశీలించగా ఇద్దరు దుండగులు మూఖా నికి గుడ్డ కట్టుకొని చోరీకి పాల్పడినట్లు తెలిసింది. వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు రాత్రి వేళ గస్తీ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
ట్రావెల్స్ బస్సు బోల్తా
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని సిరాలదొడ్డి సబ్‌స్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్స్ అదుపుతప్పి బోల్తాపడింది. బస్సులోని ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ స్వల్ప గాయాలతో బయట పడటంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్లకుండా తెల్లవారుజామునే ఎవరికి వారు ఇతర వాహనాలలో ఆదోనికి వెళ్లిపోయినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారని పోలీసులు చెప్పారు.

కోసిగిలో భారీ చోరీ