
ట్రావెల్స్ బస్సుకు జరిమానా
డోన్ టౌన్: రాష్ట్రానికి చెల్లించాల్సిన ట్యాక్స్ చెల్లించకుండా రాకపోకలు సాగిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కు రూ.1.91 లక్షల జరిమానా విధించినట్లు డోన్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతికుమార్ మంగళవారం తెలిపారు. సోమవారం అర్ధరాత్రి కర్నూలు రోడ్డులోని అముకతాడు టోల్ ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన శిఖర్వార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆ రాష్ట్రం నుంచి బెంగుళూరుకు వెళుతుండగా అమకతాడు టోల్ గేట్ వద్ద ఆపి తనిఖీ చేయగా ఏపీ చెల్లించాల్సిన ట్యాక్స్ చెల్లించలేదని తెలిసింది. దీంతో వాహనంపై జరిమానా విధించినట్లు ఎంవీఐ తెలిపారు. నంద్యాల అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ నాగేంద్రరావు ఉన్నారు.
హడావుడిగా మండలాలకు శనగ విత్తనాలు
కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్ మొదలై వారం రోజులు గడచినప్పటికీ పప్పు శనగ విత్తన పంపిణీ అతీగతీ లేకపోయింది. దీనిపై మంగళవారం ‘సాక్షి’లో శనగ విత్తు అందక రైతుకు బెంగ శీర్షికన కథనం ప్రచురితమవడంతో వ్యవసాయ శాఖలో కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖపై బుధవారం సమీక్ష నిర్వహిస్తున్న తరుణంలో హడివుడిగా వెల్దుర్తి, తుగ్గలి, ఆలూ రు, బనగానపల్లి మండలాల్లో శనగ విత్తనాలను అరకొరగా అందుబాటులో ఉంచడం గమనార్హం. విత్తనాల కోసం రైతులు డి–క్రిషి యాప్‌లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ‘సాక్షి’లో కథనం వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద యాప్ ఇచ్చారు. ఇంతవరకు ఒక్క రైతు కూడా పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని విత్తనాలు పొందలేదంటే యాప్ అమల్లోకి రాకపోవడమే కారణంగా తెలుస్తోంది. సబ్సిడీపై విత్తనాల పంపిణీకి ఎగనామం పెట్టే కుట్రలో భాగంగానే అధిక ధర నిర్ణయం, నామమాత్రపు సబ్సిడీ అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్యమాలతోనే మహిళా సమస్యలకు పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): ఐక్య ఉద్యమాల ద్వారానే మహిళల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మల అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం కార్మిక కర్షక భవన్‌లో ఐద్వా 12వ జిల్లా మహాసభలు నిర్వహించారు. సభకు అరుణమ్మ, ధనలక్ష్మీ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథి పి.నిర్మల మాట్లాడారు.. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారన్నారు. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. మహిళలపై దౌర్జ న్యాలు, దాడులు, హత్యలు,మానభంగాలు ఎక్కు వయ్యాయని, వాటిని అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో అనంతపురంలో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రత్నమ్మ, ఉమాదేవి, సుజాత పాల్గొన్నారు.