
జాతీయ రహదారిపై కొనసాగిన రద్దీ
చౌటుప్పల్ : జాతీయ రహదారిపై వాహనాల రద్దీ సోమవారం సైతం కొనసాగింది. దసరా పండుగ నిమిత్తం సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో 65వ నంబర్ హైవేపై హైదరాబాద్ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. సాధారణ రోజుల్లో సుమారుగా 35 వేల నుంచి 40వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, సోమవారం అదనంగా మరో 20 వేల వాహనాలు రాకపోకలు సాగించినట్లు అంచనా. చౌటుప్పల్ పట్టణంలో నెలకొన్న రద్దీని నియంత్రించేందుకు జంక్షన్‌లను మూసివేశారు. బస్టాండ్‌లోకి ఆర్టీసీ బస్సులను సైతం అనుమతించలేదు. ప్రత్యేక పోలీసులను రంగంలోకి దింపారు. సాయంత్రం వరకు బారులుదీరిన వాహనాలు.. ఆ తర్వాత తగ్గాయి. హైవేపై రద్దీ కారణంగా కొంతమంది వాహనదారులు సర్వీస్‌రోడ్ల మీదుగా మళ్లించడంతో అవిసైతం ట్రాఫిక్ వలయంలో చిక్కుకున్నాయి.
పంతంగి టోల్‌ప్లాజా వద్ద ..
చౌటుప్పల్ రూరల్: దసరా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు ప్రజలు వస్తుండంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ కొనసాగింది. సుమారు 6 కిమీల వరకు పంతంగి టోల్‌ప్లాజా నుంచి చౌటుప్పల్ వరకు భారీగా వాహనాలు బారులుదీరాయి. ఈ క్రమంలో నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు ఆస్పత్రికి వెళ్తున్న ఓ అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అంకిరెడ్డిగూడెం నుంచి చౌటుప్పల్ వరకు వాహనాలు సైడ్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో అంబులెన్స్ కూడా నెమ్మదిగా ముందుకు సాగింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను 10 విండోలు ఓపెన్ చేసి పంపించారు. ఫాస్టాగ్ పని చేయని వాహనాలకు ఫొటో తీసుకుని పంపించారు.
చిట్యాల వద్ద హైవేపై..
చిట్యాల: విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ నగరం వైపునకు చిట్యాల పట్టణంలో హైవే మీదుగా వాహనాల రద్దీ సోమవారం రాత్రి వరకు కొనసాగింది. చిట్యాల పట్టణంతోపాటు పెద్దకాపర్తి గ్రామ పరిధిలో హైవేపై ఫ్లైవర్ బ్రిడ్జి నిర్మాణాలు చేపడుతున్న కారణంగా సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాలు నెమ్మదిగా వెళ్లాయి. చిట్యాల పట్టణ ప్రజలు హైవే రోడ్డును దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

జాతీయ రహదారిపై కొనసాగిన రద్దీ