రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
దేవరకొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం దేవరకొండ మండలం కొండభీమనపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం చారగొండకు చెందిన కొట్ర శివ(29) ద్విచక్ర వాహనంపై మరో మహిళతో కలిసి దేవరకొండ వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో కొండభీమనపల్లి వద్దకు రాగానే దేవరకొండ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న శివ, మహిళ కిందపడడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న దేవరకొండ సీఐ వెంకట్‌రెడ్డి వివరాలు సేకరించారు. మృతదేహాలను దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం
నల్లగొండ: టాస్క్‌ఫోర్స్ పోలీసుల సమాచారం మేరకు వ్యభిచార గృహంపై నల్లగొండ వన్ టౌన్ పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరు విటులు, ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తి, ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. వివరాలు.. సోమవారం నల్లగొండ పట్టణంలోని ప్రియదర్శిని కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. కొన్ని నెలలుగా ఆ ఇల్లు అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.


