
మానసిక వ్యాధితో యువకుడు ఆత్మహత్య
వలిగొండ : మానసిక వ్యాధితో బాధపడుతూ గడ్డి మందుతాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వలిగొండ మండలంలోని ముద్దాపురం పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూరెడ్డి అనిల్‌రెడ్డి (23) అనే యువకుడు తన చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి ఆత్మకూర్ ఎం మండలంలోని మేనమామ ఇంటి వద్ద ఉంటున్నాడు. పక్కనే ముద్దాపురం శివారులో ఉన్న ఎరువుల దుకాణంలో పనిచేస్తూ కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం తాను పనిచేస్తున్న ఎరువుల దుకాణంలో గడ్డి మందు తెచ్చుకుని తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు.
భార్యతో గొడవపడి..
అర్వపల్లి: భార్యతో గొడవపడి సంచారజాతికి చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జాజిరెడ్డిగూడెం మండలం సీతారాంపురం సమీపంలోని గుట్టపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం కోటపేట గ్రామానికి చెందిన పూసల భద్రి(45) కొద్దిరోజులుగా తిరుమలగిరిలో ఉంటూ గ్రామాలు తిరిగి దిష్టిబొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం తన బైక్‌పై సీతారాంపురం సమీపంలోని గుట్టపైకి వెళ్లి లుంగీతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చుట్టుపక్కల రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఈట సైదులు తెలిపారు.