కోతకొచ్చిన వరిపంట
ఫ నాన్ ఆయకట్టు మండలాల్లో
కోతలు షురూ
ఫ ముందస్తుగా సాగుచేసిన పంటకోత పనుల్లో అన్నదాతలు
ఫ దసరా పండుగ తర్వాత ఊపందుకోనున్న కోతలు
ఫ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారుల కసరత్తు
మూడెకరాల్లో సాగుచేసిన వరిపొలమంతా ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఎర్రబారి నేలవాలి పోయింది. దాన్ని కోత మిషన్‌తో కోయించాల్సి వస్తోంది. ఈసారి కోత ఖర్చు రెండింతలు అయ్యే అవకాశం ఉంది.
–కె వెంకన్న, రైతు, గుండ్లపల్లి,
నల్లగొండ మండలం
నాన్ ఆయకట్టులో వరికోతలు ప్రారంభమయ్యాయి. దసరా పండుగ తర్వాత కోతలు ఊపందుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాల వల్ల వరిచేలు నేల వాలాయి. దీంతో ఈసారి కోతల ఖర్చు పెరిగే అవకాశం ఉంది.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి
నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్‌కు సంబంధించి వరికోతలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 5.05లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో నాన్‌ఆయట్టు ప్రాంతంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరిసాగైంది. అయితే నాన్ ఆయకట్టులో జూన్ మొదటి వారంలోనే బోరుబావుల కింద వరినార్లు పోసుకున్న రైతులు జూలైలో నాట్లు వేసుకున్నారు. ఈ సారి జిల్లా అంతటా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భజలాలు పెరిగాయి. ఫలితంగా నాన్‌ఆయకట్టులో పెద్ద ఎత్తున వరినాట్లు వేసుకున్నారు. దొడ్డురకంతోపాటు సన్నాలను కూడా రైతులు సాగు చేసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాల్లో వరిచేలు నేలవాలిపోయాయి. మరికొన్ని చోట్ల చీడపీడలు సోకి ఎర్రబారాయి. ముందస్తుగా సాగుచేసిన వరిచేలను మూడు రోజుల నుంచి కోస్తుండగా దసరా పండుగ తరువాత వరికోతలు ఊపందుకోనున్నట్టు తెలుస్తోంది.
రైతులపై ఆర్థికభారం
అయితే ఇటీవల కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాల్లో వరిచేలు నేలవాలాయి. ఆ వరిచేలను కోయాలంటే టైర్ మిషన్‌లు కాకుండా చైన్ మిషన్‌లతో కోయాల్సి వస్తోంది. దీంతో సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉండడంతో గంటలకు రూ.2,500 నుంచి రూ.3 వేల చొప్పున మిషన్‌లకు చెల్లించాల్సి రావడం, ఎకరాకు సుమారు రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉన్నందున వరికోతకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు రైతులు భరించాల్సి ఉంటుంది. దీంతో తమపై అదనపు ఆర్థికభారం పడనుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిగుబడి అంచనా
11 లక్షల మెట్రిక్ టన్నులు
ఈ వానాకాలం సీజన్‌లో సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఎకరాకు సగటున 23 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రానుందని అధికారులు అంటున్నారు. అయితే జిల్లాలో నాన్ ఆయకట్టు ప్రాంతంలో మూడు రోజులుగా వరికోతలు ప్రారంభం కానుండడంతో జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే జిల్లా అధికారులు.. వ్యవసాయ శాఖ, ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలు, వసతుల కల్పనపై చర్చించారు.
వానాకాలం వరిసాగు వివరాలు.. (ఎకరాల్లో..)
జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం 5,05,560
నాన్ ఆయకట్టులో 3,00,000
దిగుబడి అంచనా (మెట్రిక్ టన్నులు) 11,62,788
కోతకొచ్చిన వరిపంట
కోతకొచ్చిన వరిపంట


