ఖైదీలు గాంధీ బాటలో నడవాలి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ : ఖైదీ గాంధీ బాటలో నడిచి.. సమాజానికి ఆదర్శంగా మారాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా జిల్లా జైల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జైలు గోడలు ఖైదీల శరీరాన్ని బంధిస్తాయని.. వారి మనస్సును కాదన్నారు. గతంలో తప్పులు జరిగాయని.. భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని ఖైదీలకు సూచించారు. జైలు సూపరింటెండెంట్ ప్రమోద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రమేశ్, ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ సౌందర్య, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ పరశురామ్, జైలర్ బాలకృష్ణ, వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
నేటినుంచి పాఠశాలలు పునఃప్రారంభం
నల్లగొండ : ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు రాష్ట్ర విద్యాశాఖ సెప్టెంబర్ 21న ప్రకటించిన దసరా సెలవులు శుక్రవారంతో ముగిశాయి. శనివారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఆదివారాలు మినహాయిస్తే పండుగ సెలవులు 11 రోజులు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా నేటినుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఈ అవకాశాన్ని ఉపయోగించి స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసపు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చులకన అయ్యిందన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కార్యకర్తలంతా బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని కోరారు. సమావేశంలో నాయకులు కటికం సత్తయ్య గౌడ్, కొండూరు సత్యనారాయణ, దేప వెంకటరెడ్డి, గాదె రాంరెడ్డి, కృష్ణార్జునరెడ్డి, బడుపుల శంకర్, గుండెబోయిన జంగయ్య, పంతంగి శ్రీనాథ్, కొప్పోలు విమలమ్మ, పెరిక కరుణ్ జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
మట్టపల్లిలో కృష్ణమ్మకు హారతి
మఠంపల్లి: మట్టపల్లిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద పవిత్ర కృష్ణానదికి శుక్రవారం రాత్రి అర్చకులు హారతి పూజలు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం పల్లకీలో మంగళ వాయిద్యాల నడుమ కృష్ణానదిలోని ప్రహ్లాద ఘాట్‌కు తరలించారు. అనంతరం ప్రత్యేక అర్చనలు చీర సారె, పసుపు కుంకుమలు సమర్పించి హారతి ఇచ్చారు. ఆ తర్వాత ఆలయ ప్రవేశం గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఖైదీలు గాంధీ బాటలో నడవాలి


