సూర్యాపేటటౌన్ : పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని చంపుతామని బెదిరింపులకు పాల్పడిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2వ తేదీన సూర్యాపేట మండల పరిధిలోని యర్కారం గ్రామానికి చెందిన బొర్ర సైదమ్మ తన ఇంటి ముందు నిలబడి ఉండగా.. అదే గ్రామానికి చెందిన గుండ్లపల్లి నవీన్, గుండ్లపల్లి సాయికుమార్, చందుపట్ల సందీప్‌కుమార్, బొర్ర అభిషేక్, పిల్లలమర్రి గ్రామానికి చెందిన చెరుకుపల్లి అర్జున్ కారులో ఆమె వద్దకు వచ్చారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని నవీన్‌తో పాటు మిగతా వారు కారులో నుంచి తల్వార్ తిప్పుకుంటూ బయటకు దిగి సైదమ్మతో పాటు ఆమె కుమారుడు, మారపల్లి సతీష్, మోదాల నాగయ్యను బూతులు తిడుతూ చంపుతామని బెదిరించారు. దీంతో బాధితురాలు సైదమ్మ సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో తనను బెదిరించిన వారిపై ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి కారుతో పాటు తల్వార్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ బాలునాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ రిమాండ్‌కు తరలింపు