ఇన్‌చార్జ్‌లే దిక్కు!
రెగ్యులర్ ఎంఈఓలు
లేకపోవడంతో..
● 10 మండలాలకు కరువైన అధికారులు
● ఎంఈఓలుగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు
● అదనపు బాధ్యతలతో సతమతమవుతున్న హెచ్‌ఎంలు
● పర్యవేక్షణ లేక పక్కదారి పడుతున్న నిధులు
ములుగు: జిల్లా విద్యాశాఖకు ఇన్‌చార్జ్ అధికారులే దిక్కయ్యారు. రెగ్యులర్ డీఈఓ, ఎంఈఓలు లేకపోవడంతో విద్యావ్యవస్థ కుంటుపడుతోంది. నాణ్యమైన విద్యతోనే విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందుతోంది. అలాంటి విద్యాశాఖ ఇన్‌చార్జ్‌ల పాలనలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాల్సిన జిల్లా విద్యాశాఖాధికారి పోస్టుతో పాటు ఎంఈఓల పోస్టులు కూడా ఇన్‌చార్జ్ పాలనలోనే కొనసాగుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ లేక నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 337 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 16,883 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
నాలుగు నెలల్లో నలుగురు డీఈఓలు..
ములుగు డీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న పాణిని జూన్ 16న లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. దీంతో హనుమకొండ డీఈఓ వాసంతికి జూన్ 17న జిల్లా డీఈఓగా అదనపు బాధ్యతలు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆమె విధుల్లో చేరలేదు. ఇంటర్ విద్యాశాఖ అధికారిణి చంద్రకళకు ఇన్‌చార్జ్ డీఈఓగా బాధ్యతలు అప్పజెప్పడంతో ఆమె కొద్దిరోజులు మాత్రమే విధులు నిర్వహించింది. సెప్టెంబర్ 1న ములుగు ఇండస్ట్రీయల్ మేనేజర్‌గా కొనసాగుతున్న సిద్దార్థరెడ్డికి ఇన్‌చార్జ్ డీఈఓ గా నియమించారు. నాలుగు నెలల్లో ముగ్గురు డీఈఓలు మారగా ప్రస్తుతం సిద్ధార్థరెడ్డి ఇన్‌చార్జ్ డీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలోని 10 మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవడంతో పాఠశాల విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. ములుగు, మల్లంపల్లి మండలాలకు ఇన్‌చార్జ్ ఎంఈఓగా మల్లంపల్లి హైస్కూల్ హెచ్‌ఎం తిరుపతి విధులు నిర్వహిస్తున్నారు. వెంకటాపురం(కె) మండలానికి ఆదే మండల కేంద్రంలోని హైస్కూల్ హెచ్‌ఎం సత్యనారాయణ, వాజేడు మండలానికి వెంకటాపురం(కె) మండలంలోని రాంచంద్రాపూర్ స్కూల్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, తాడ్వాయి మండలానికి మంగపేట మండలంలోని కమలాపురం హైస్కూల్ హెచ్‌ఎం శ్రీనివాస్, మంగపేట మండలానికి హెచ్‌ఎం మేనక, గోవిందరావుపేటకు హెచ్‌ఎం దివాకర్, కన్నాయిగూడెంకు హెచ్‌ఎం సాంబయ్య, వెంకటాపురం(ఎం)కు హెచ్‌ఎం ప్రభాకర్, ఏటూరునాగారంకు హెచ్‌ఎం మల్లయ్య ఇన్‌చార్జ్ ఎంఈఓలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


